Share News

శభాష్‌ నితీష్‌

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:17 AM

ఆస్ర్టేలియా గడ్డపై విశాఖ యువ క్రికెటర్‌ నితీష్‌కుమార్‌రెడ్డి సత్తా చాటాడు. పెర్త్‌ పిచ్‌పై అలవోకగా బౌండరీలు బాది ఆస్ర్టేలియా బౌలర్లను బెంబేలెత్తించాడు.

శభాష్‌ నితీష్‌

  • ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటాడు

  • తొలి టెస్టులోనే 41 పరుగులు చేసి జట్టును ఆదుకున్న నగర యువకుడు

  • టీమిండిమా బ్యాటింగ్‌లో నితీష్‌దే అత్యధిక వ్యక్తిగత స్కోరు

విశాఖపట్నం, స్పోర్ట్సు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):

ఆస్ర్టేలియా గడ్డపై విశాఖ యువ క్రికెటర్‌ నితీష్‌కుమార్‌రెడ్డి సత్తా చాటాడు. పెర్త్‌ పిచ్‌పై అలవోకగా బౌండరీలు బాది ఆస్ర్టేలియా బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆస్ర్టేలియాలో పర్యటిస్తున్న భారత్‌ జట్టుకు నగరానికి చెందిన నితీష్‌కుమారెడ్డి ఎంపికైన విషయం తెలిసిందే. పెర్త్‌లో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో తుది జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నితీష్‌కుమార్‌రెడ్డి వమ్ము చేయకుండా సొగసైన బ్యాటింగ్‌తో రాణించి జట్టును ఆదుకున్నాడు. వరుసగా వికెట్లు నేలకొరుతున్న సమయంలో ఎనిమిదో నంబరు బ్యాట్స్‌మన్‌గా వికెట్ల ముందుకు వచ్చిన నితీష్‌కుమార్‌రెడ్డి కెరీర్‌లో ఆడుతున్నది తొలి టెస్ట్‌ అయినా వంద టెస్టులు ఆడిన అనుభవజ్ఞుడిలా ఒత్తిడికి గురికాకుండా ఆస్ర్టేలియా బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు. ఎటువంటి తడబాటు లేకుండా బంతులను బౌండరీ లైను దాటించి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. సహ బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవెలియన్‌కు చేరుతున్నా ఆత్మవిశ్వాసంతో ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 59 బంతుల్లో ఆరు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 41 పరుగులు చేసి..చివరి వికెట్‌గా పెవెలియన్‌కు చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150 పరుగులకు ఆలౌట్‌ కాగా అందులో నితీష్‌కుమార్‌రెడ్డి చేసిన 41 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన నితీష్‌కుమారెడ్డి...అద్భుతంగా రాణించి టీమిండియా సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. దీంతో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. సిరీస్‌లో ఢిల్లీలో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారీ హాఫ్‌ సెంచరీతో (74; 4 బౌండరీలు, 7 సిక్సర్లు) సత్తా నిరూపించుకున్నాడు. ఆస్ర్టేలియా పర్యటనకు సంబంధించి భారత్‌ జట్టులో చోటు దక్కించుకోవడమే కాకుండా తొలి టెస్టులోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

Updated Date - Nov 23 , 2024 | 01:17 AM