ఆలయాలను హిందూ సంఘాలకు అప్పగించాలి
ABN, Publish Date - Oct 20 , 2024 | 04:50 AM
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను హిందూ సంఘాలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ కేంద్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు.
జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం
వీహెచ్‌పీ కేంద్ర సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్
విజయవాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను హిందూ సంఘాలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ కేంద్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. దీనికి విజయవాడ నుంచి అడుగులు వేస్తామని అన్నారు. ఆలయాలను హిందూ సంఘాలకు అప్పగించాలన్న డిమాండ్‌తో జనవరి 5వ తేదీన విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వివాదం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని సురేంద్ర జైన్ అన్నారు. దేవాలయాల ఆదాయాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు.
సనాతన ధర్మం వర్ధిల్లాలంటే హిందూ సంఘాలే దేవాలయాలను నిర్వహించాలన్నారు. హిందూయేతర వ్యక్తులు ప్రభుత్వం ఆధీనంలోని ఆలయాలను నిర్వహిస్తున్నారని, ఈ జాబితాల్లో టీటీడీ కూడా ఉందన్నారు. టీటీడీ నిర్వాహణకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. అయోధ్యలోని రామాలయాన్ని ఇలాంటి కమిటీనే నిర్వహిస్తోందన్నారు. సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఒబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, కార్యదర్శి టీఎస్ రవికుమార్, వీహెచ్‌పీ సెంట్రల్ కార్యదర్శి, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, సెంట్రల్ కమిటీ సభ్యులు వై.రాఘవులు పాల్గొన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 04:50 AM