ఆసుపత్రుల్లో అవే అవస్థలు
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:40 PM
మన్యం’లో ప్రభుత్వాసుపత్రుల నుంచి మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. మౌలిక సౌకర్యాలు, వసతి, సిబ్బంది కొరత వేధిస్తుండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా ఎమర్జెన్సీ కేసులను రిఫరల్ చేస్తున్నారు. దీంతో మన్యం వాసులు పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
వేధిస్తున్న మౌలిక వసతులు, సిబ్బంది కొరత
పూర్తిస్థాయిలో అందని వైద్యసేవలు
రోగులకు తప్పని ఇబ్బందులు
అత్యవసర వేళల్లో పొరుగు జిల్లాలకు పరుగు
పార్వతీపురం, నవంబరు19 (ఆంధ్రజ్యోతి) :‘మన్యం’లో ప్రభుత్వాసుపత్రుల నుంచి మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. మౌలిక సౌకర్యాలు, వసతి, సిబ్బంది కొరత వేధిస్తుండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా ఎమర్జెన్సీ కేసులను రిఫరల్ చేస్తున్నారు. దీంతో మన్యం వాసులు పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో గిరిజనులు వ్యయ ప్రయాసలకు గురవ్వాల్సి వస్తోంది. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు లేరు. ఇక్కడ ఎంఆర్‌ఐ స్కానింగ్, ఐసీయూ వంటి సదుపాయాలు లేవు. సీజన్‌లో బెడ్లు చాలక రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సాలూరు ఏరియా ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేసినా అవే సమస్యలు కొనసాగుతున్నాయి. వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలు పూర్తవ్వకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. ఇక పాలకొండ ఏరియా ఆసుప్రతిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వారంలో ఐదు రోజుల పాటు రోగులకు వైద్యసేవలు అందడం లేదు. రేడియాలజిస్ట్, స్టాఫ్‌నర్సుల కొరత వెంటాడుతుంది. ఆపరేషన్ థియేటర్‌లో ఎక్విప్‌మెంట్ లేదు. జనరల్ వార్డుల్లో కూడా మరమ్మతు పనులు చేయాల్సి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మండలాల్లో 24 గంటల పీహెచ్‌సీలు పేరుకే అన్నట్లుగా మారాయి. సాయంత్రమైతే చాలు ఇన్‌పేషెంట్లను ఇళ్లకు పంపిస్తున్నారు. కొన్నిచోట్ల వైద్యాధికారులు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బందే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. దీంతో గిరిజనులకు ఇక్కట్లు తప్పడం లేదు. చాలాచోట్ల శానిటైజేషన్‌పైనా రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ విజిట్ చేయగా అన్నిచోట్లా సమస్యలు కనిపించాయి. రోగుల ఇబ్బందులు ప్రస్ఫుటమయ్యాయి.
Updated Date - Nov 19 , 2024 | 11:40 PM