Share News

48 గంటల్లోనే...

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:14 AM

కూటమి ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపే బిల్లులు చెల్లించింది. వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది.

48 గంటల్లోనే...

రైతుల ఖాతాలకు నగదు జమ

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

పార్వతీపురం, నవంబరు23 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపే బిల్లులు చెల్లించింది. వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. ఇటీవల పార్వతీపురం మండలం పెదబండపల్లి గ్రామానికి చెందిన ఎం.ధనుంజయనాయుడు సుమారు రూ.1.38 లక్షల విలువైన ధాన్యం విక్రయించారు. అయితే నిర్ణీత గడువులోపే ఆయన బ్యాంకు ఖతాకు నగదు జమైంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ సర్కారు హయాంలో ధాన్యం విక్రయించిన తర్వాత నగదు కోసం ఎదురుచూడాల్సి వచ్చేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలోఆ పరిస్థితి లేదన్నారు. కాగా జిల్లాలో 301 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించి సేవలు అందిస్తున్నారు. ఇందులో 71 ఆర్‌ఎస్‌కేల్లో షెడ్యూలింగ్‌ ప్రారంభమైంది.

బకాయిలు జమ...

గత ప్రభుత్వం రైస్‌ మిల్లర్లకు బిల్లులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారెంటీల్లో ఈ సొమ్మును కలుపుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 93 మిల్లులకు సంబంధించి రూ. 4.90 కోట్లు బ్యాంకు గ్యారెంటీ కింద మినహాయించారు. ఇదిలా ఉండగా జిల్లాలో మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 16 మిల్లులకు సంబంధించి రూ. 7.97 కోట్లు విలువైన 21 బీజీలు అందాయి. గత ఏడాది మిల్లర్లకు చెల్లించాల్సిన రూ.4.90 కోట్లు కలుపుకొని ఇప్పటివరకు జిల్లాలో రూ.12.87 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీలు అందాయి.

ముమ్మరంగా కొనుగోలు

జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతులు దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతల్లో సొమ్ము జమవుతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

- శ్రీనివాసరావు, డీఎం, సివిల్‌ సప్లైస్‌, పార్వతీపురం మన్యం

Updated Date - Nov 24 , 2024 | 12:14 AM