Share News

తీయని విషం

ABN , Publish Date - May 29 , 2024 | 11:37 PM

పండ్లను సహజంగా పండే పద్ధతులకు వ్యాపారులు స్వస్తి చెప్పి కార్బైట్‌ వంటి పదార్థాలు ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పండ్లు విష తుల్యం అవుతున్నాయి.

తీయని విషం

కార్బైట్‌ పద్ధతిలో మగ్గుతున్న మామిడి పండ్లు

రసాయనాల వినియోగంతో రోగాలు

గణపవరం : మానవుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవిం చడానికి ప్రకృతి కొన్ని వరాలు ప్రసాదించింది. అటువంటి వాటిలో పండ్లు ఒకటిగా చెప్పవచ్చు. పండ్లలో రారాజు మామిడి. ప్రతీ సీజన్‌లో ఎన్ని తిన్నా మోజు తీరనిది మామిడిపండు. చెట్ల నుంచి సహజసిద్ధంగా లభించే పండ్లు మానవునికి సమతుల్యమైన విలువైన పోషకాహార పదార్థాలు సమకూరు స్తాయి. అయితే పండ్లను సహజంగా పండే పద్ధతులకు వ్యాపారులు స్వస్తి చెప్పి కార్బైట్‌ వంటి పదార్థాలు ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పండ్లు విష తుల్యం అవుతున్నాయి. ఈ పద్ధతిలో పండిన పండు పైకి నిఘ నిఘ లాడుతూ నోరూరించేలా కనిపించినప్పటికి దానిలోని సహజ సిద్ధమైన ప్రయోజనాలు ఉండవు. పైగా ఇది ఆరోగ్యానికి హానికరం. పక్వానికి రాని కాయలను కూడా వ్యాపారులు రసాయనాలతో మాగపెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. లాభపేక్షతో కొందరు వ్యాపారులు ఇటువంటి విధానాలను అవలంభిస్తున్నారు. మామిడిని ముగ్గబెట్టేందుకు కాల్షియం కార్బేట్‌, ఇథిపాల్‌ లిక్విడ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. రసాయనాలు వినియోగించిన పండ్లు విషతుల్యమవుతున్నాయని వీటిని నిషేదిస్తే వ్యాపారులు ప్రజల జీవి తాలతో చెలగాటం ఆడుతున్నారు. మామిడికాయలు త్వరగా పండ్లుగా రూపాంతరం చెందటానికి 30 నుంచి 48 గంటల వ్యవధిలో పండ్లుగా మారితే ఈ కృత్రిమ పద్ధతుల వల్ల కేవలం 12 గంటల్లోనే కాయ పండుగా మారుతుంది. ఈ రసాయనాలు మానవుడి కాలేయం, నరాల వ్యవస్థలపై చెడుప్రభావం చూపుతుంది. దీంతో ఆకలి సన్నగిల్లడం, వికారం, వంటివి సంభవిస్తుంటాయి. నరాల పటుత్వం సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీ ముక్కలను మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయి స్తున్నారు. వీటిని వ్యాపారులు అధికంగా ఉపయోగిస్తున్నారు. పండ్ల దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే వ్యాపారులు మామిడి కాయలను కావు వేసే గదులపై కూడా తనిఖీలు నిర్వహిస్తే కార్బైట్‌ బ్యాటరీ ద్వారా పండ్లను పండించే విధానం కొంత వరకు నివారించేందుకు వీలుంటుందని అంటున్నారు.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

– సంతోష్‌నాయుడు, ప్రభుత్వ వైద్యాఽధికారి, గణపవరం

రసాయనాలు వాడకుండా ప్రజలను చైతన్య పరిచేందుకు చర్యలు తీసు కుంటున్నాం. పండ్ల పై ప్రమాదకర రసాయనాలు వాడరాదని వ్యాపారులను హెచ్చరిస్తున్నాం. రసాయనాలు వినియోగించిన పండ్లు తింటే పలు రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. కిడ్నీ, కాలేయాలపై ప్రభావం చూపుతాయి. సహజసిద్ధంగా పండిన పండ్లు భుజిస్తే ఆరోగ్యవంతంగా జీవించవచ్చు.

శాంపిల్స్‌ తీసుకుని పరీక్షిస్తున్నాం

–ఎం.శ్రీనివాసరావు ఉమ్మడి జిల్లాల అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌

సహజ సిద్ధమైన పండ్లపై క్రిమిసంహారక మందులు, రసాయనాలు వాడటం చట్టరీత్యా నేరం. దీనిపై విస్తృతంగా దాడులు చేయాలని అధికారులను కూడా ఆదేశించాం. మామిడిపై రసాయనాలు వినియోగిస్తే చర్యలు తప్పవు. కొందరు వ్యాపారుల నుంచి పండ్లు శాంపిల్స్‌ తీసుకుని ల్యాబ్‌కు పంపిస్తున్నాం. పండ్లపై రసాయనాలు వాడరాదని వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - May 29 , 2024 | 11:37 PM