Share News

AP Politics: అన్న మోసం చేశాడు.. షర్మిల కన్నీటిపర్యంతం..

ABN , Publish Date - Oct 26 , 2024 | 05:58 PM

వైఎస్ షర్మిల బోరున విలపించారు. అన్న జగన్ చేసిన మోసాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. జగన్ తన క్యాడర్‌తో తనపై అడ్డమైన కామెంట్స్ చేయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల..

AP Politics: అన్న మోసం చేశాడు.. షర్మిల కన్నీటిపర్యంతం..
YS Sharmila vs YS Jagan

విజయవాడ, అక్టోబర్ 26: వైఎస్ షర్మిల బోరున విలపించారు. అన్న జగన్ చేసిన మోసాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. జగన్ తన క్యాడర్‌తో తనపై అడ్డమైన కామెంట్స్ చేయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. ‘అన్న మీద ప్రేమతో అండగా ఉంటే.. మోసం చేశారు’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఆస్తి వివాదాలపై మళ్లీ మళ్లీ మాట్లాడటం ఇష్టం లేదన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తనకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. 2019లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించిందని.. ఇంతటి అఖండ విజయం వైఎస్ఆర్ అభిమానుల వల్లే సాధ్యమైందన్నారు. వైఎస్ఆర్ అభిమానులు అండగా నిలిచారు కాబట్టే.. వారంతా ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేస్తేనే ఆ విజయం సాధ్యమైందన్నారు.


తాను, అమ్మ విజయమ్మ కూడా తమ సామర్థ్యం కంటే ఎక్కువే చేశామన్నారు షర్మిల. జగన్ అంటే ఎంతో ప్రాణం కాబట్టే.. ఆయన కోసం పాదయాత్ర చేశానన్నారు. ఓదార్పు యాత్రలు చేసి ప్రజల్లో నిలబడ్డానని అన్నారు. రెండు ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేశానని షర్మిల చెప్పుకొచ్చారు. జగన్ కోసం తాను ఎన్నో చేశానని.. జగన్ తన కోసం ఏం చేశారో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ చెల్లెలి కోసం నేను ఇది చేశాను అని జగన్ చెప్పగలరా? అని షర్మిల ప్రశ్నించారు.


ఇదే పచ్చినిజం..

‘నాకు, నా బిడ్డలకు జగన్ అన్యాయం చేస్తున్నారనేది పచ్చి నిజం. ఇవన్నీ దేవుడికి, అమ్మకు, నాన్నకు, చాలా మందికి తెలుసు. అయినా ఇలాంటి జగన్‌ను క్యాడర్ ఇంకా మోస్తుంది. ఐదు సంవత్సరాలు ఎంఓయూ నా చేతిలో ఉంది. ఇందులో ఈ ఆస్తులు నావి అని వారు సంతకాలు పెట్టారు. ఐదు సంవత్సరాలలో నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఆ ఎంఓయూలను వాడుకోలేదు. ఇప్పుడు ఈ ఎంఓయూ అనేక మంది చేతుల్లో ఉందంటే కారణం ఎవరు? వైఎస్ఆర్ సతీమణిని కోర్టుకు పిలిచారంటే కారణం ఎవరు? అలాంటి కొడుకును ఎందుకు కన్నాను అని ఆ తల్లి మదన పడుతుంది. ఇంకా ఎందుకు బతికి ఉన్నానా అని ఆ తల్లి బాధపడుతుంది. జగన్ బెయిల్ రద్దు అవుతుందనే కారణంతోనే మమ్మల్ని కోర్టుకు ఇచ్చారు.’ అంటూ షర్మిల తీవ్రమైన కామెంట్స్ చేశారు.


లాభం జరుగుతుందంటే ఏదైనా చేస్తారా..

‘జగన్‌కు లాభం జరుగుతుందని తల్లిని సైతం కోర్టుకు లాగుతారా? ఆనాడు తండ్రి వైఎస్ఆర్ పేరును కూడా సీబీఐ ఛార్జీషీట్‌లో చేర్పించారు. జగన్ తాను కేసుల నుంచి బయటపడేందుకు సుధాకర్ రెడ్డితో కేసు వేయించారు. ఆ తర్వాత ఎజీగా కూడా ఆయనకు పదవి ఇచ్చారు. తనకు మేలు జరుగుతుంటే.. జగన్ ఎవరినైనా వాడతారు.. ఆ తర్వాత తొక్కేస్తారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అయినా ఆలోచించుకోండి. నేను తప్పు చేయలేదు కాబట్టే.. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు అయినా జగన్ మోసాలను తెలుసుకుని బయటపడతారా.. అతని మాయలకు బలి అవుతారా అనేది వైసీపీ నేతలు ఆలోచన చేసుకోవాలి’ అని షర్మిల హితవు చెప్పారు.


Also Read:

'ఇండియా' కూటమికి ప్రచారం.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం

జగన్ క్యారెక్టర్ ఇదే.. మంత్రి నిమ్మల విసుర్లు

రాత్రి ఆహారం స్కిప్ చేస్తే జరిగేది ఇదే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 26 , 2024 | 05:58 PM