ప్రపంచ టాప్ 10లోకి అంబానీ
ABN, Publish Date - Apr 04 , 2024 | 02:32 AM
భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. భారత్‌తోపాటు ఆసియాలోని అత్యంత ధనికుడూ ఆయనే...
ప్రపంచ టాప్ 10లోకి అంబానీ
సంపద రూ.9.63 లక్షల కోట్లు.. 8,400 కోట్ల డాలర్లతో ఆసియా నంబర్ 2 అదానీ
ఫోర్బ్స్ కుబేరుల జాబితా విడుదల
10 మంది తెలుగు వారికి స్థానం
న్యూఢిల్లీ: భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. భారత్‌తోపాటు ఆసియాలోని అత్యంత ధనికుడూ ఆయనే. ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకా రం.. అంబానీ ఆస్తి 11,600 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.9.63 లక్షల కోట్లు. ప్రపంచ ర్యాంకింగ్‌లో అంబానీ 9వ స్థానంలో నిలిచారు. వరల్డ్ టాప్-10లోని ఏకైక ఆసియా సంపన్నుడూ ఆయనే. అంతేకాదు, జాబితాలో 10,000 కోట్ల డాలర్లకు పైగా సంపద కలిగిన అతికొద్ది (14) మందిలో ఏకైక ఆసియా వ్యక్తి కూడా అంబానీయే. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ రెండో అత్యంత సంపన్న భారతీయుడిగా ఉన్నారు. అదానీ ఆస్తి 8,400 కోట్ల డాలర్లకు చేరుకుందని, గడిచిన ఏడాది కాలంలో 3,680 కోట్ల డాలర్లు పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అదానీ 17వ స్థానంలో ఉన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు...
హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ 3,690 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో మూడో అత్యంత ధనిక భారతీయుడిగా నిలిచారు. జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్‌కు నాలుగో స్థానం దక్కింది. ఆమె ఆస్తి 3,350 కోట్ల డాలర్లు. దేశంలోని అత్యంత ధనిక మహిళ కూడా ఆమె.
సన్‌ఫార్మాకు చెందిన దిలీప్ సంఘ్వీ (2,670 కోట్ల డాలర్లు) ఐదో స్థానంలో నిలవగా.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్ పూనావాలా (2,130 కోట్ల డాలర్లు) ఆరో స్థానంలో ఉన్నారు. డీఎల్‌ఎఫ్‌కు చెందిన కేపీ సింగ్ (2,090 కోట్ల డాలర్లు), ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా (1,970 కోట్ల డాలర్లు), డీ-మార్ట్ సూపర్‌మార్కెట్ల వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ (1,760 కోట్ల డాలర్లు), ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ (1,640 కోట్ల డాలర్లు) వరుసగా 7,8,9,10వ స్థానాల్లో ఉన్నారు.
ఈసారి జాబితాలో 10 మంది తెలుగువారికి చోటు లభించింది. దివీస్ లాబ్స్‌కు చెందిన మురళి దివి 620 కోట్ల డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.
భారత్ నుంచి 200 మంది
ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గత ఏడాది జాబితాలో కనిపించిన 169 మందితో పోలిస్తే ఈ సారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈసారి లిస్ట్‌లోని భారత బిలియనీర్ల మొత్తం సంపద 95,400 కోట్ల డాలర్లకు (రూ.79.18 లక్షల కోట్లు) పెరిగింది. గత ఏడాది మొత్తం సంపద 67,500 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 41 శాతం అధికం. ఈ ఏడాది కొత్తగా 25 మందికి చోటు లభించగా.. బైజూస్ రవీంద్రన్, రోహిక మిస్త్రీ స్థానం కోల్పోయారు. కాగా, ఆన్‌లైన్ బ్రోకింగ్ సేవల సంస్థ జీరోధా వ్యవస్థాపకులైన నితిన్, నిఖిల్ కామత్ సోదరులతోపాటు ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లు అత్యంత పిన్న వయస్కులైన భారత బిలియనీర్లుగా నిలిచారు. వీరిలోనూ 37 ఏళ్ల నిఖిల్ కామత్ అత్యంత పిన్న వయస్కుడు.
ప్రపంచ బిలియనీర్ల మొత్తం ఆస్తి రూ.1,179 లక్షల కోట్లు
ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 2,781 మందికి స్థానం దక్కింది. గత ఏడాదితో పోలిస్తే, మరో 141 మందికి కొత్తగా చోటు లభించింది. వీరి సంపద మొత్తం కూడా మరో 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 లక్షల కోట్ల డాలర్లకు (రూ.1,179 లక్షల కోట్లు) చేరుకుంది. అమెరికా నుంచి అత్యధికంగా 813 మంది ఈ జాబితాలో నిలిచారు. చైనా (473 మంది), భారత్ (200 మంది) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 8 నాటికి స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ఆయా కంపెనీలకు చెందిన షేర్ల ధరలు, కరెన్సీ మారకం విలువల ఆధారంగా బిలియనీర్ల సంపదను లెక్కించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఫ్యాషన్ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్ గ్రూప్ చైర్మన్ బెర్నార్డ్ అర్నో 23,300 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో నం.1 బిలియనీర్‌గా నిలిచారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విటర్) కంపెనీ సారథి ఎలాన్ మస్క్ 19,500 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ఈ సారి రెండో స్థానానికి పరిమితమయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (19,400 కోట్ల డాలర్లు), ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకెర్‌బర్గ్ (17,700 కోట్ల డాలర్లు), ఒరాకిల్ చైర్మన్ ల్యారీ ఎలిసన్ (14,100 కోట్ల డాలర్లు) టాప్-5లోని తర్వాత స్థానాల్లో ఉన్నారు.
తెలుగు సంపన్నుల వివరాలు
ప్రపంచ పేరు కంపెనీ బిలియన్
ర్యాంక్ డాలర్లు
469 మురళి దివి దివీస్ ల్యాబ్స్ 6.2
1104 ప్రతాప్ సీ రెడ్డి అపోలో హాస్పిటల్స్ 3
1143 జీఎం రావు జీఎంఆర్ గ్రూప్ 2.9
1143 పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మా 2.9
1438 జూపల్లి రామేశ్వర్ రావు మై హోమ్ గ్రూప్ 2.3
1438 పీ పిచ్చి రెడ్డి మేఘా ఇంజనీరింగ్ 2.3
1496 పీ వీ కృష్ణా రెడ్డి మేఘా ఇంజనీరింగ్ 2.2
1623 ఎం సత్యనారాయణ రెడ్డి ఎంఎస్‌ఎన్ ఫార్మా 2
1764 కే సతీశ్ రెడ్డి డాక్టర్ రెడ్డీస్ 1.8
2046 జీవీ ప్రసాద్ డాక్టర్ రెడ్డీస్ 1.5
Updated Date - Apr 04 , 2024 | 02:32 AM