Post Office Schemes: అధిక రాబడినిచ్చే సూపర్ స్కీమ్స్.. వివరాలు మీకోసం..!
ABN , Publish Date - Jan 08 , 2024 | 05:40 PM
పోస్ట్ ఆఫీస్ దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను తీసుకువస్తూనే ఉంటుంది. దేశంలోని జనాభాను స్వావలంబనగా మార్చేందుకు తపాలా శాఖ అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. 2023 బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల అవసరాలకు అనుగుణంగా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని ప్రారంభించారు.
న్యూఢిల్లీ, జనవరి 08: పెట్టుబడి పెట్టడానికి దేశంలో అనేక మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థలతో పాటు.. ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడి పెడితే.. రెట్టింపు ఆదాయం, రాబడి లభించే అవకాశం ఉంది. అందుకే.. చాలా మంది ప్రజలు తమ సంపాదనను పెట్టుబడిగా పెడుతుంటారు. అయితే, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల మాదిరిగానే.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు కూడా ప్రజల కోసం అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్స్ స్కీమ్స్ తీసుకువచ్చాయి. ముఖ్యంగా పోస్టాఫీస్ స్కీమ్స్‌లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన అనేక పోస్టాఫీసు పథకాలు ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను తీసుకువస్తూనే ఉంటుంది. దేశంలోని జనాభాను స్వావలంబనగా మార్చేందుకు తపాలా శాఖ అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. 2023 బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల అవసరాలకు అనుగుణంగా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని ప్రారంభించారు. రెండేళ్లలో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. దీంతోపాటు.. 10 సంవత్సరాల వయస్సు వరకు ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. ఈ రెండు పథకాలు మహిళల అవసరాలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడిని పొందవచ్చు. ఈ రెండు పథకాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్(MSSC)..
ఏ వయస్సులోనైనా మహిళలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడి మొత్తం రూ. 2 లక్షలు. ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా 7.50 శాతం స్థిర వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద డిపాజిట్ చేసిన మొత్తంపై రూ. 1.50 లక్షల రాయితీ లభిస్తుంది. డిసెంబర్ 2023లో ఈ పథకం కింద రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీపై రూ. 2,32,044 లక్షలు పొందుతారు.
సుకన్య సమృద్ధి యోజన(SSY)..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2014లో సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించింది. ముఖ్యంగా మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకం రూపొందించడం జరిగింది. ఈ పథకం కింద.. పుట్టిన అమ్మాయి మొదలు.. 10 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయి పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవవచ్చు. సంవత్సరానికి రూ. 250 నుండి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద 18 ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయి పేరిట డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల వయస్సులో మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా.. అమ్మాయి చదువు, పెళ్లి ఖర్చులకు ఉపయోగపడుతుంది. కాగా, ఈ పథకం కింద పెట్టే పెట్టుబడిపై ప్రభుత్వం 8 శాతం వడ్డీ రేటు ప్రయోజనాన్ని ఇస్తోంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ vs సుకన్య సమృద్ధి యోజన..
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు రెండూ మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనేది స్వల్పకాలిక పొదుపు పథకం. సుకన్య సమృద్ధి యోజన దీర్ఘకాలిక పొదుపు పథకం. సుకన్య ఖాతాలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడి అమ్మాయి చదువు, పెళ్లి ఖర్చులకు ఉపకరిస్తుంది.