Share News

Tirupati: మున్సిపల్ ఉద్యోగులమంటూ ఇంటికి వెళ్లారు.. మహిళను మాటల్లో పెట్టి మరీ..

ABN , Publish Date - Dec 21 , 2024 | 01:00 PM

ఓ మహిళ ఇంటికి వెళ్లిన కొందరు.. తమని తాము మున్సిపల్ ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు. ‘‘మీ ఇంటికి కొలతలు తీయాలి’’.. అని చెప్పడంతో వారి మాటలు నమ్మిన ఆమె.. లోపలికి అనుమతించింది. ఇంట్లోకి వెళ్లిన వారు చివరకు భారీ చోరీకి పాల్పడ్డారు..

Tirupati: మున్సిపల్ ఉద్యోగులమంటూ ఇంటికి వెళ్లారు.. మహిళను మాటల్లో పెట్టి మరీ..

నేరస్థులు తెలివిమీరిపోతున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పక్కా పథకం ప్రకారం చోరీలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. రోజూ ఎక్కడో చోట ఇలాంటి చోరీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో ఓ భారీ చోరీ జరిగింది. మున్సిపల్ ఉద్యోగుల పేరుతో ఓ మహిళ ఇంటికి వెళ్లిన దొంగలు.. చివరకు భారీ చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..


తిరుపతి (Tirupati) కేశవాయన గుంటలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఇంటికి వెళ్లిన కొందరు దొంగలు.. తమని తాము మున్సిపల్ ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు. ‘‘మీ ఇంటికి కొలతలు తీయాలి’’.. అని చెప్పడంతో వారి మాటలు నమ్మిన ఆమె.. లోపలికి అనుమతించింది. ఇంట్లోకి వెళ్లిన దొంగలు కొలతలు తీసే నెపంతో ఇల్లు మొత్తం వెతికారు. ఈ క్రమంలో సదరు మహిళను మాటల్లో పెట్టి, ఇంట్లో దాచుకున్న 205 గ్రాముల బంగారు నగలు, రూ.లక్ష నగదుతో ఉడాయించారు. ఇంట్లో దాచిన బంగారు, నగదు కనిపించకపోవడంతో మోసపోయానని గ్రహించిన మహిళ.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్ ఈస్టు పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


తిరుపతి నగర పరిధిలో నెల రోజుల వ్యవధిలో అనేక చోరీ కేసులు జరిగాయి. తిరుపతి ఎయిర్‌బైపాస్ రోడ్డులో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ కార్యాలయంలో నవంబర్ 15న చోరీ జరిగింది. ఓ వ్యక్తి మధ్యాహ్న సమయంలో తాళం వేసి ఉన్న కార్యాలయంలోకి ప్రవేశించి, క్యాష్ కౌంటర్‌లోని రూ.8లక్షల నగదు తీసుకుని ఉడాయించాడు. మరోవైపు ఓ భక్తుడు తిరుమల క్షేత్రంలోని హుండీకే కన్నం వేశాడు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి ఆలయంలోని స్టీల్ హుండీలో చోరీ చేశాడు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని రూ.15వేలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా డిసెంబర్ 18న తిరుపతి, రేణిగుంట రోడ్డులోని ఇండియన్ బ్యాంక్‌లో ఓ దొంగ చోరీకి విఫల యత్నం చేశాడు. అకౌంటెంట్ మెడపై కత్తి పెట్టి డబ్బు దోచుకోవాలని చూడగా.. ఖాతాదారులంతా కలిసి అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. తాను రూ.5 లక్షలు అప్పు చేశారని, అది తీర్చేందుకే ఇలా చేశానని సదరు దొంగ చెప్పడం విశేషం.

Updated Date - Dec 21 , 2024 | 01:00 PM