ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కులగణన స్ఫూర్తి గ్రహించక కువిమర్శలు!

ABN, Publish Date - Nov 20 , 2024 | 02:10 AM

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నో విప్లవాత్మక సామాజిక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా...

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నో విప్లవాత్మక సామాజిక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా కులగణన చేపడతామన్న అంశాన్ని పొందుపరిచింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’లో భాగంగా ‘హీస్సేదార్ న్యాయ్’లో దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని, రిజర్వేషన్‌పై ఉన్న 50శాతం పరిమితిని తొలగిస్తామని రెండు కీలకమైన వాగ్దానాలను రాహుల్‌గాంధీ చేశారు. ఆయన ఆలోచనలకు రూపంగా తెలంగాణలో మహోన్నతమైన కులగణన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 6న శ్రీకారం చుట్టారు.


వెనుకబడిన తరగతుల ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి భూసాని వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో డెడికేషన్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోంది. ఇందుకుగాను రూ.150 కోట్లను కేటాయించగా, 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు సర్వేలో భాగస్వాములవుతూ, ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. 1953లో కాకా కలేల్కర్ కమిషన్, 1978లో మండల్ కమిషన్, 2017లో జస్టిస్ రోహిణి కమిషన్‌లు కూడా సామాజిక ఆర్థిక అసమానతలు తెలుసుకోవడానికి కులగణన జరగాలని అభిప్రాయపడ్డాయి. తెలంగాణలో దాదాపు 154పైగా బీసీ కులాలు, ఉప కులాలు ఉన్నాయి. ఇప్పటికీ కనీస గుర్తింపుకు నోచుకోని కులాలు ఉన్నాయి. ఇవన్నీ సామాజికంగాను, ఆర్థికంగాను, అక్షరాస్యతలోను వెనుకబడి ఉన్నాయి. రాజకీయపరంగా, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందక, సరైన గుర్తింపు లేక దుర్భర జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనతో అలాంటి వారి జీవన విధానం మారనున్నది.


ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలోనూ, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అర్హులకు అందేట్టు చేయడంలోనూ ఈ కుల గణన సర్వే ఎంతో కీలకం కానున్నది. గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. కానీ ఆ గణాంకాలను స్వార్థపూరిత కుల రాజకీయాలకు వాడుకున్నారు తప్పితే రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రతిపక్ష పార్టీలు సదరు గణాంకాలు రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలని ఎంత మొత్తుకున్నా ఏనాడూ వెల్లడించలేదు. కేవలం కులాలను ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు.


మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆర్థిక జీవన విధానం మారాలి. దామాషా ప్రకారం ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలి. అందుకు ఈ కులగణన గణాంకాలు ఉపయోగపడతాయి. కులగణనపై విపక్షాలు బురదజల్లే ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టాయి. అసంబద్ధమైన ప్రశ్నలకు ఎక్కుపెడుతున్నాయి. పైపైన కులగణనకు తాము అనుకూలం అంటూనే ప్రజల మదిలో అనుమానాలను రేకెత్తించే విధంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం సోషియో ఎకానమీ ప్రకారం సర్వే చేస్తోంది. గతంలో బిహార్ రాష్ట్రంలో కులగణన గణాంకాల ఆధారంగా 34 శాతం మంది ప్రజల రోజువారీ ఆదాయం 200 రూపాయలని తేలింది. అంటే నెలకు రూ. 6వేలు సంపాదిస్తున్నారు. అక్కడ జనాభా ప్రకారం బీసీల రిజర్వేషన్ 33 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. ఎస్సీల రిజర్వేషన్ 17 శాతం నుంచి 23 వరకు పెంచారు. అలాగే ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు వివరాలు సేకరిస్తున్నదే తప్ప గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా వివరాలు దాచి పబ్బం గడుపుకోవడానికి కాదు. బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నది వాస్తవం. రానున్న స్థానిక ఎన్నికల్లో దామాషా ప్రకారం వారు రాజకీయ అవకాశాలను అందుకుంటారు.


2018లో పార్లమెంట్ సాక్షిగా రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ జనాభా గణనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కులగణన చేపడతామని చెప్పారు. కానీ ఓబీసీ కుల గణన చేపట్టబోమని స్పష్టం చేసారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ స్టాండ్ ఏమిటన్నది అర్థం అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ వర్గానికి చెందిన వారైనప్పటికీ సర్వేకు విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. లౌకిక దేశంలో మతాల ప్రాతిపదికన ఓట్లు దండుకోవడానికి రాజకీయాలు చేయడమే బీజేపీకి ప్రధాన ఎజెండాగా మారింది. ఆడలేక మద్దెల దరువు అన్నట్టు– దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాహుల్‌గాంధీ కోరితే– బీజేపీవారు అసలు రాహుల్‌గాంధీ కులం ఏమిటీ అని వ్యంగ్య విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక అసమానతలకు ప్రధాన కారణం కులమే. రాష్ట్రంలో జరుగుతున్న కులగణన ప్రక్రియ ద్వారా ప్రజల అభివృద్ధి, సామాజిక సమానత్వం, ఆర్థిక స్వావలంబన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియకు అన్ని ప్రతిపక్ష పార్టీలు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలి.

ఇందిరా శోభన్

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు

Updated Date - Nov 20 , 2024 | 02:10 AM