ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నినాదాల్లో వినపడి, వ్యవస్థలో కనపడని న్యాయం!

ABN, Publish Date - Nov 08 , 2024 | 04:58 AM

కళ్ళకు గంతలు లేని నూతన న్యాయ దేవత విగ్రహాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఇటీవల నెలకొల్పారు. వలసవాద చిహ్నాలను చెరిపేయడానికి ఇలా చేసినట్లు పేర్కొన్నారు.

ళ్ళకు గంతలు లేని నూతన న్యాయ దేవత విగ్రహాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఇటీవల నెలకొల్పారు. వలసవాద చిహ్నాలను చెరిపేయడానికి ఇలా చేసినట్లు పేర్కొన్నారు. విగ్రహం పాతదయినా, కొత్తదయినా, వ్యవస్థ పని తీరు ఎలా ఉందన్న దాన్ని బట్టే న్యాయం నిర్ణయించబడుతుంది.

న్యాయ వ్యవస్థకు సంబంధించి మన దేశంలో రెండు నినాదాలు అత్యంత బలంగా వినబడుతూ ఉంటాయి. ఒకటి ‘‘జస్టిస్‌ డిలేయిడ్‌ ఈస్‌ జస్టిస్‌ డినైడ్‌’’. అంటే ఆలస్యంగా న్యాయం జరగటం న్యాయాన్ని నిరాకరించటంతో సమానం అని అర్థం. రెండోది వెయ్యిమంది దోషులైనా తప్పించుకోవచ్చు గాని ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్నది. ఈ రెండు అంశాల అమలులోనూ ఘోరమైన వైఫల్యం మన న్యాయవ్యవస్థలో స్పష్టంగా కనపడుతోంది.

మన దేశంలో పైకోర్టులు, క్రింది కోర్టుల్లో కలిపి సుమారు ఐదు కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయి. ఒక్కొక్క కేసులో ఆరుగురు కక్షిదారులు ఉన్నారనుకున్నా, ఆ లెక్కన కనీసం ముప్పై కోట్ల మంది, అంటే అమెరికా జనాభా కంటే ఎక్కువ మంది వివిధ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కేసులలో తీర్పులు రావటంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోంది. దేశంలో సగటున ఒక కేసు పరిష్కారం కావడానికి పదమూడున్నరేళ్లు పడుతోంది. సుప్రీంకోర్టులో నలభై శాతం కేసులు ఐదేళ్ళకు పైగా పెండింగులో ఉన్నాయి. దేశ ఉన్నత న్యాయస్థానంలో ఒక కేసు మూడు దశాబ్దాలకు పైగా పెండింగులో ఉంది. బెర్హంపూర్‌ బ్యాంకు కేసులో తీర్పు రావడానికి ఏకంగా డెబ్బై రెండేళ్లు పట్టింది.

1951లోని ఈ కేసు తుది తీర్పు 2023లో వచ్చింది. కొన్ని కేసులలో ముఖ్యంగా సివిల్‌, క్రిమినల్‌ కేసుల రెంటిలోనూ కేసులు వేసిన మనుషులు కూడా చనిపోతున్నారు. తరాలు మారినా తీర్పులు మాత్రం వెలువడని ఉదంతాలు ఎన్నో. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే కోర్టులో ఒక కేసు వేసేస్తే ఇక అవతలి వారి పని అయినట్లే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నట్లుగా పెండింగ్‌ కేసుల పరిష్కారం న్యాయ వ్యవస్థ ముందు పెద్ద సవాలు.


వరల్డ్‌ జస్టిస్‌ ప్రాజక్టు వివిధ అంశాల ఆధారంగా విడుదల చేసే ర్యాంకింగులలో మన దేశం 79వ స్థానంలో ఉంది. మన పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌ వంటివి మన దేశం కంటే మెరుగ్గా ఉన్నాయి.

ఈ రకంగా కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరగడం ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కేసు వేగంగా పరిష్కారం కావాలని నష్టపోయినవాడు కోరుకుంటే, ఎంత ఆలస్యం అయితే అంత మంచిదని లాభపడేవాడు కోరుకుంటాడు. ఇప్పుడు మన న్యాయవ్యవస్థలో లాభపడుతున్నది రెండవ కోవకు చెందినవారే. అంటే నష్టపోయినవాడు న్యాయవ్యవస్థ వల్ల కూడా నష్టపోతున్నాడు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పినా– సామాన్యుడు కోర్టుల చుట్టూ తిరగలేకపోవడంతో, వాస్తవంగా ఆచరణలో న్యాయం ఆర్థిక స్తోమత ఉన్న వారికే అనుకూలంగా ఉంటోంది.

కొన్ని మంచి తీర్పులు కూడా ఆలస్యంగా రావడంతో ఆ తీర్పుల సాఫల్యం పూర్తిగా దక్కడం లేదు. ఉదాహరణకు ఇటీవల సుప్రీం కోర్టు ఎన్నికల బాండ్లు చెల్లవని తీర్పు ఇచ్చింది. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. బీజేపీ వేల కోట్ల రూపాయలు ఈ బాండ్ల ద్వారా సంపాదించి లబ్ధి పొందింది. ఆ సొమ్మును కక్కించే పని కోర్టు ఎలాగూ చేయలేదు. ఇక్కడ కూడా ఆలస్యంగా జరిగిన న్యాయం, న్యాయమెలా అవుతుందన్న ప్రశ్నే ఉదయిస్తుంది. ఇలా తీర్పులు ఆలస్యం కావడానికి మౌలిక వసతులు, సిబ్బంది లేకపోవడం ప్రధాన కారణం అని చెబుతున్నా, దీనికి బాధ్యత కూడా ప్రభుత్వమూ, న్యాయ వ్యవస్థే వహించాలి. వారి లోపానికి సామాన్యులను బలి చేయడం సమంజసం కాదు.


రెండోది నిర్దోషులు, దోషుల గురించి. మహిళలపై అత్యాచారం చేసిన దోషి డేరా బాబా దర్జాగా బెయిల్‌పై బయట తిరుగుతుండగా, చేయని నేరానికి నిర్దోషి ప్రొఫసర్‌ సాయిబాబా పదేళ్లు జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. మొత్తం ఆయన జీవితాన్నే కోల్పోవాల్సి వచ్చింది. ఓ ప్రసంగం కారణంగా ఉమర్‌ ఖలీద్‌ అనే యువ పీహెచ్‌డీ విద్యార్థి గత నాలుగున్నరేళ్ళుగా జైలులో ఉన్నాడు. విశేషమేమిటంటే ఈ కాలమంతా ఆయనకు బెయిల్‌ లేదు, ట్రయలూ లేదు. ప్రభుత్వం తమకున్న అధికార బలంతో తప్పుడు కేసులు బనాయించి, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరచడం ద్వారా అనేక మందిని కేసుల్లో ఇరికిస్తోంది. వీటిలో అత్యధిక కేసుల్లో వారిపై మోపిన నేరం నిరూపించబడడం లేదు. కానీ ఈ లోగా తీవ్ర జాప్యం జరిగి నిర్దోషులు శిక్ష అనుభవించవలసి వస్తోంది. వీరందరికీ అన్యాయమే జరుగుతోంది. పోనీ తప్పుడు కేసులు బనాయించిన వారిపై ఏమైనా చర్యలుంటాయా అంటే అలాంటి అవకాశమే చట్టంలో లేదు.

ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే– కులం, అంటరానితనం వంటివి జైళ్ళల్లో కూడా ఉన్నాయని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. జైలులో దళితులను ప్రత్యేక ప్రదేశాలలో ఉంచడం, వారికి మిగిలిన ఖైదీలతో పోలిస్తే తక్కువ ఆహారాన్ని సరఫరా చేయడం, మిగిలిన ఖైదీలతో పోలిస్తే వారిచేత కిందిస్థాయి పనులు చేయించడం, పడుకోవడానికి కూడా జాగా సరిపోనంత ఇరుకైన ప్రదేశాల్లో వారిని నిర్బంధించడం వంటి ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. అంటే మన జైళ్ళలో నిర్దోషులు ఖైదీలుగా ఉండడమే గాక వారికి మానవత్వంతో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. దానితో పాటుగా రాజ్యాంగం నిషేధించిన వివక్ష కూడా కొనసాగుతోంది. వికలాంగుడైన ప్రొఫెసర్‌ సాయిబాబా విషయంలో కూడా జైలు అధికారులు కనీసం తినడానికి ఒక స్పూన్‌ ఇవ్వడానికి కూడా నిరాకరించి, ఎంత అమానుషంగా ప్రవర్తించారో విదితమే.


అందువల్ల, మన న్యాయవ్యవస్థ ఎలాంటి నినాదాలు ఇచ్చినప్పటికీ, ఆచరణలో అది నష్టపోయినవారికి కాక లాభపడిన వారికే అనుకూలంగా ఉంది. ఇటువంటి లోపాలను సరిదిద్ది కక్షిదారులకు, ముఖ్యంగా సామాన్యులకు త్వరితగతిన ఒక కాలపరిమితిలోగా తీర్పులు వచ్చేటట్టుగా వ్యవస్థలో కొన్ని సమూలమైన మార్పులు చేయాలి. నిర్దిష్ట కాలపరిమితి లోగా న్యాయం జరగకపోతే దానికి నష్టపరిహారాన్ని అందుకునే హక్కు కూడా సామాన్యులకు ఉండేలా వ్యవస్థలో మార్పులు చేయాలి. అప్పుడు మాత్రమే చట్టం ముందు అందరూ సమానులే అన్న నినాదం ఆచరణలో సాకారమవుతుంది. కార్ల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఏంగిల్స్‌ మహాశయులు చెప్పినట్టు సమాజంలో న్యాయ వ్యవస్థతో సహా రాజ్యాంగ యంత్రం అంతా దోపిడీ సమాజాన్ని కాపాడానికి, పాలకులను రక్షించడానికే సహకరిస్తుంది. మన న్యాయవ్యవస్థ కూడా దీనికి మినహాయింపు కాదని వివిధ ఘటనలు నిరూపిస్తున్నాయి.

ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తులు గాను, ప్రధాన న్యాయమూర్తులు గాను ఉన్నవారు ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన తర్వాత, రిటైరయిన వెంటనే పదవులు పొందుతున్నారు. బాబ్రీ మసీద్‌ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయిని పదవీవిరమణ అయిన మూడు నెలలకే రాజ్యసభకు ప్రభుత్వం నామినేట్‌ చేయడం చూశాం. తాజాగా నేటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వినాయక చవితి పూజ సందర్భంగా దేశ ప్రధానమంత్రి వెళ్ళడం కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. ఈయన కూడా బాబ్రీ మసీదు కేసు తీర్పు బెంచిలోని ఒక న్యాయమూర్తే. చట్టాల పేర్లు మార్చినంత మాత్రాన న్యాయం జరగదు. సమూలమైన సంస్కరణలు చేపట్టినప్పుడు మాత్రమే న్యాయవ్యవస్థ మీద సామాన్యులకు విశ్వాసం కలుగుతుంది. ఆలస్యమైన కేసులలో పరిహారం చెల్లింపు, తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం, న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళి అమలు వంటి చర్యల ద్వారా న్యాయ వ్యవస్థ నుండి కొంతైనా న్యాయం జరిగేలా చేయవచ్చు.

ఎ. అజశర్మ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - Nov 08 , 2024 | 05:25 AM