కొత్త ఆరంభం!
ABN, Publish Date - Aug 14 , 2024 | 03:23 AM
అనేక వారాలపాటు తీవ్ర హింస, రక్తపాతాన్ని చవిచూసిన బంగ్లాదేశ్ చల్లబడుతోంది. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా గతవారం ప్రమాణం చేశారు. ప్రధానమంత్రితో...
అనేక వారాలపాటు తీవ్ర హింస, రక్తపాతాన్ని చవిచూసిన బంగ్లాదేశ్ చల్లబడుతోంది. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా గతవారం ప్రమాణం చేశారు. ప్రధానమంత్రితో సమానమైన ఈ హోదాలో ఆయన ఉంటూ, మరో పదహారుమందితో కూడిన సలహామండలి పాలనలో ఆయనకు సహకరిస్తూండటంతో దేశం తిరిగి గాడినపడటం మొదలైంది. కోటా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన నాహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మూద్‌తో పాటు మహిళా హక్కుల కార్యకర్త ఫరీద్ అక్తర్‌లతో పాటు, ఆర్థికవేత్తలు, పౌరసమాజ ప్రతినిధులు, ఒక సైనిక కమాండర్ ఇత్యాదులు ఇందులో ఉన్నారు. దాదాపు అన్నిరంగాలనుంచి ప్రాతినిధ్యం ఉన్నట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సినీ, కళారంగాలకు చెందినవారు లేరని కొందరు నటీమణులు గుర్తుచేశారు. వ్యవస్థలన్నీ కుప్పకూలిన స్థితిలో ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు ఒక కొత్త ఆరంభానికి పునాది.
రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా తాత్కాలిక ప్రభుత్వం నడుచుకుంటుందని యూనస్ హామీ ఇస్తున్నారు. దీర్ఘకాలం రగిలిన తన దేశం ఇంకా చల్లారలేదనీ, పలు అవాంఛనీయఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయనకు తెలియకపోదు. షేక్ హసీనా మీద ఉన్న ఆగ్రహం ఎవరిమీదకు అనవసరంగా మళ్ళుతున్నదో కూడా ఆయనకు అవగాహన ఉన్నది. ప్రధానంగా మైనారిటీల రక్షణకు సంబంధించి ఆయన పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పరిస్థితులు పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. రాజధాని ఢాకాలో హిందువులు పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు వచ్చి తమపైనా, దేవాలయాలపైనా జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ ఘటనలు తాత్కాలిక ఆగ్రహావేశాల్లో భాగమే తప్ప, నిర్దిష్టమైన వ్యూహాలు, కరడుగట్టిన వ్యతిరేకతలు లేవని అక్కడి నాయకులు అంటున్నారు. షేక్ హసీనాకు భారతదేశంతో ఉన్న దశాబ్దాల అనుబంధం, ఆఖరు ఘట్టంలోనూ భారత్ ఆమెకు అండగా నిలవడం ఇత్యాదివి కొందరికి ఏ మాత్రం గిట్టని విషయం మనకు తెలిసిందే. హిందువులకు భద్రత కల్పించండి అంటూ మహ్మద్ యూనస్‌కు భారత ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. ఆ చెదురుమదురు ఘటనలు ఇక జరగవని అక్కడి నాయకులు హామీ ఇస్తున్నారు. హిందువులపై దాడుల్లో మతం కోణం లేదని, రాజకీయకోణం మాత్రమే ఉన్నది బీఎన్పీ నాయకుల వాదన.
న్యాయవ్యవస్థ, పోలీసు, మీడియా సైతం ఉద్యమకారుల ఆగ్రహాన్ని చవిచూడాల్సివచ్చింది. ఆయా వ్యవస్థలు, వ్యక్తుల అండదండలతోనే షేక్ హసీనా పదిహేనేళ్ళపాటు దేశాన్ని నిరవధికంగా, నిరంకుశంగా ఏలగలిగారనీ, ఆమె ఆదుపాజ్ఞల్లోకి పోయిన వ్యవస్థలను కూల్చడం, పునర్నిర్మించుకోడం దేశ భవిష్యత్తుకు అవసరమని వారు నమ్మారు. బంగ్లాదేశ్ చీఫ్‌జస్టిస్ ఒబైదుల్ హసన్, మరో ఐదుగురు న్యాయమూర్తులు మారుమాట్లాడకుండా రాజీనామాలు చేసిన దృశ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. హసీనా ప్రతీ తప్పునూ వెనకేసుకొస్తూ వీరంతా ఆమెకు రక్షణగా నిలిచారని విద్యార్థి ఉద్యమకారుల ఆగ్రహం. హసీనామీద కోపాన్ని వారు ఎక్కడెక్కడో ప్రదర్శిస్తున్నారు కానీ, పరిస్థితులు వేగంగా ఉపశమించకపోతే వారు ఎంతో ప్రేమగా ప్రతిష్ఠించుకున్న తాత్కాలిక ప్రభుత్వానికి అప్రదిష్ట తప్పదు.
ప్రజాభీష్టాన్ని నిర్ణయించేవి ఎన్నికలే. అవి స్వేచ్ఛగా, స్వతంత్రంగా జరిగినప్పుడు మిగతా ప్రపంచం ఈ పరిణామాలన్నింటినీ నమ్ముతుంది. షేక్ హసీనా ఏలుబడిలో ఒక్క ఎన్నికకూడా సవ్యంగా సక్రమంగా జరగలేదని విమర్శలు ఉన్నందున తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్పు స్పష్టంగా కనిపించాలి. పార్లమెంట్ రద్దయిన మూడునెలల్లోగా ఎన్నికలు జరగాలని బంగ్లాదేశ్ రాజ్యాంగం నిర్దేశిస్తున్నప్పటికీ, అంతలోగా కచ్చితంగా జరుగుతాయని యూనస్ ప్రభుత్వం చెప్పడం లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో గడువు పెంచుకొనే సౌలభ్యం ఉన్నదని బీఎన్పీ నాయకులు గుర్తుచేస్తున్నారు. తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న ఆ పార్టీ అధినేత ఖలీదాజియా విదేశాల్లో చికిత్స చేయించుకొని వెనక్కువచ్చేవరకూ ఎన్నికలు ఉండకపోవచ్చునని కొందరి అనుమానం. ఎన్నికలు ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు షేక్ హసీనా బంగ్లాదేశ్‌లో అడుగుపెడతారని ఆమె కుమారుడు అంటున్నారు. ఈ నేపథ్యంలో, ప్రజలు ఎంతో నమ్మకంగా బాధ్యతలు అప్పగించిన మహ్మద్ యూనస్ తన విధిని సక్రమంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సి ఉంది. ఆయనను ముందుపెట్టి బీఎన్పీ, జమాత్–ఎ–ఇస్లామీ వంటివి వెనకనుంచి చక్రం తిప్పుతాయన్న విమర్శలు, విశ్లేషణల్లో నిజం లేదని రుజువుచేయాలి.
Updated Date - Aug 14 , 2024 | 03:23 AM