Annual budget : కోరలు చాచిన ఈ నిరుద్యోగం కనిపించలేదా?
ABN , Publish Date - Aug 03 , 2024 | 01:41 AM
జూలై 23, 2024న గౌరవనీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ సమర్పించారు. మరుసటి రోజు పార్లమెంటు ఉభయ సభలలో బడ్జెట్‌పై చర్చ జరిగింది.
జూలై 23, 2024న గౌరవనీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ సమర్పించారు. మరుసటి రోజు పార్లమెంటు ఉభయ సభలలో బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఆ చర్చకు జూలై 30న లోక్‌సభలోను, జూలై 31న రాజ్యసభలోను ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు.
ఆర్థిక మంత్రి వాదన స్థూలంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంది: (1) ప్రతి మంత్రిత్వ శాఖ వ్యయాల కింద ప్రభుత్వం నిధులను మరింత మిక్కుటంగా ఖర్చు పెడుతోంది. వ్యయ పరిమాణం సుపరిపాలనకు కొలమానం అని సీతారామన్ ఉద్ఘాటించారు. పర్యవసానంగా అన్ని వర్గాల ప్రజలు ‘అభివృద్ధి’, ‘సంక్షేమం’తో విశేషంగా లబ్ధి పొందుతున్నారు. తన వాదనను బలపరచుకోవడానికి ఆర్థిక మంత్రి కొన్ని అంకెలను వెల్లడించారు : 2013–14 (యూపీఏ ప్రభుత్వ చివరి సంవత్సరం)లో ఎంత ఖర్చు పెట్టింది; 2019–20, 2023–24 (ఎన్డీఏ రెండో ప్రభుత్వ మొదటి, చివరి సంవత్సరాలు)లో ఎంత ఖర్చు పెట్టిందీ, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టనున్నదీ ఆమె తెలిపారు. ఆ అంకెలు, సంవత్సరం సంవత్సరానికీ ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఎంతగా పెరిగిపోతున్నదో వివరించాయి. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో చేసిన వ్యయాన్ని చూద్దాం. యూపీఏ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వ్యవసాయరంగానికి రూ.0.30 లక్షల కోట్లు కేటాయించగా, ఆ కేటాయింపులు రూ.1.52 లక్షల కోట్లు అని ఆమె పేర్కొన్నారు. ఈ మొత్తం, గత ఆర్థిక సంవత్సరం (2023–24) కేటాయింపుల కంటే రూ.8000 కోట్లు ఎక్కువ అని ఆర్థిక మంత్రి అన్నారు. ‘వ్యవసాయ రంగానికి కేటాయింపులు మేము ఏటికేడాది పెంచుతూ పోయామే కాని ఎన్నడూ తగ్గించలేదని’ నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే గమనార్హమైన విషయమేమిటంటే ఆ అంకెలు ప్రస్తుత ధరలలో ఉన్నాయి కాని స్థిరమైన ధరలలో లేవు. మొత్తం వ్యయంలో లేదా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆ వ్యయ పెరుగుదల ఎన్నో వంతుగా ఉన్నదనేదే చాలా ముఖ్యం. ఈ ఉపయుక్త విషయాలను ఆర్థిక మంత్రి వెల్లడించనే లేదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే 2023–24 ఆర్థిక సంవత్సరంలో వివిధ మంత్రిత్వ శాఖలు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు పెట్టలేదు. ఎందుకు ఖర్చు పెట్టలేదో ఆర్థిక మంత్రి వివరించలేదు.
(2) నిరుద్యోగిత సమస్య లేనే లేదు. ‘సక్షామ్, స్వతంత్ర, సమర్థ్ ’ (అర్హత, స్వతంత్రత, సామర్థ్యం) అనేది తమ ప్రభుత్వ విధానమని ఆర్థిక మంత్రి చెప్పారు. దేశంలో నిరుద్యోగిత 3.2 శాతానికి తగ్గిపోయినట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించిందని ఆమె పేర్కొన్నారు. 2014–2023 సంవత్సరాల మధ్య దేశంలో 125 మిలియన్ ఉద్యోగాలను సృష్టించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధక విభాగం నివేదిక వెల్లడించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. అవి రెండూ ప్రభుత్వ నివేదికలే. సిఎమ్‌ఐఇ డేటా ఆ నివేదికల వివరాలకు విరుద్ధంగా ఉన్నది. దేశంలో నిరుద్యోగిత ప్రస్తుతం 9.2 శాతంగా ఉన్నదని ఆ ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థ పేర్కొంది. భారత్‌లో నిరుద్యోగులుగా ఉన్న వారిలో 83 శాతం మంది యువజనులేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) వెల్లడించింది. మరి కేవలం కొన్ని వందల లేదా కొన్ని వేల ఉద్యోగాలకు లక్షలాది అభ్యర్థులు ఎందుకు పోటీపడుతున్నారు? ఈ ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమివ్వలేదు. ఈ ఉదంతాలను చూడండి. బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ కాన్‌స్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు పరీక్ష నిర్వహించారు. 60,244 కాన్‌స్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఆ పరీక్షకు (16 లక్షల మంది మహిళలతో సహా) 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనున్న 7500 ప్రభుత్వోద్యోగాలకు 24,74,030 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగిత నిజంగా తగ్గిపోతే భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యకు, దరఖాస్తుదారుల/అభ్యర్థుల సంఖ్యకు మధ్య అంత పెద్ద తేడా ఎలా ఉన్నది? ఆ తేడా పోలీసు ఉద్యోగాల విషయంలో 1:80గా, క్లర్క్‌ల విషయంలో 1:329గా ఎందుకు ఉన్నది! పోలీసు శాఖలో అతి తక్కువ స్థాయి ఉద్యోగానికి ఇంజనీర్లు, మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్లు, లాయర్లు, పోస్ట్–గ్రాడ్యుయేట్లు సైతం ఎందుకు దరఖాస్తు చేశారు? నిరుద్యోగిత ఎంత తీవ్రంగా ఉన్నదో తెలుసుకోవాలంటే ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు పట్టణాలు, నగరాల వీథులలో తిరగాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన సంచారాన్ని మదురై (ఆమె జన్మ స్థలం)లో ప్రారంభించి విల్లుపురం (ఆమె పాఠశాల విద్యాభ్యాసం జరిగిన పట్టణం)కు వెళ్లి, ఆ తరువాత తిరుచిరాపల్లి (కళాశాల చదువుకు ఆమె వెళ్లిన నగరం)లో ముగించాలి.
(3) యూపీఏ ప్రభుత్వాల హయాంలో కంటే మా ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రేటు మెరుగ్గా ఉన్నదని ఆర్థిక మంత్రి అన్నారు. నిర్మలా సీతారామన్ ఇంకా ఇలా అన్నారు: ‘హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో చదువుకున్న నాయకులు యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. 2009–13 సంవత్సరాల మధ్య ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి పెరగడానికి దారితీసిన ఉద్దీపన పథకాలను ఎప్పుడు, ఎలా ఉపసంహరించాలో వారికి తెలియలేదు’. ఆర్థిక మంత్రి అభియోగం సాంకేతికంగా సరైనదే. అయితే అది ఔచిత్యం లోపించిన ఆరోపణ. ఎందుకని? ఇప్పుడు దేశ ప్రజలు యూపీఏ ప్రభుత్వ పాలనలో నివశించడం లేదు. నరేంద్ర మోదీ రెండో ప్రభుత్వ పాలనలో నివశిస్తున్నారు. టొమాటో, ఉల్లిపాయలు, పొటాటో ధరలు ఏటేటా వరుసగా 30 శాతం, 46 శాతం, 59 శాతం చొప్పున పెరుగుతున్న కాలంలో నివశిస్తున్నారు. వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం (వేజ్ పుష్ ఇన్‌ఫ్లేషన్) 3.4 శాతం, వినియోగ దారు ధరల ద్రవ్యోల్బణం (కన్జ్యూమర్ ప్రైస్ ఇన్‌ఫ్లేషన్) 5.1 శాతం, ఆహార ద్రవ్యోల్బణం 9.4 శాతంగా ఉన్న కాలంలో నివశిస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా సకల కార్మికుల వేతనాల పెరుగుదల స్తంభించిన కాలంలో వారు నివశిస్తున్నారు. గత వేసవిలో జరిగిన సార్వత్రక ఎన్నికలలో ప్రజలు యూపీఏ ప్రభుత్వ కాలంలోని ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాకుండా, నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో ద్రవ్యోల్బణ పెరుగుదలకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించేందుకు, పూర్వ నిర్ధారిత ధరల (అడ్మినిస్ట్రడ్ ప్రైసెస్) తగ్గింపునకు, పన్నులు, సెస్‌ల తగ్గింపునకు, కనీస వేతనాల పెరుగుదలకు ఆర్థిక మంత్రి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. ద్రవ్యోల్బణంపై ప్రధాన ఆర్థిక సలహాదారు అభిప్రాయాన్ని ఆమె ఉటంకించారు. అది: ‘భారతదేశ ద్రవ్యోల్బణం తక్కువస్థాయిలో స్థిరంగా కొనసాగుతూ నాలుగు శాతం నిర్దేశిత లక్ష్యం దిశగా సాగుతోంది’. ఈ ఉటంకింపుతో ద్రవ్యోల్బణంపై చర్చకు ఆమె తన సమాధానాన్ని ముగించారు. ఇంతకూ ఒక ప్రాసంగిక ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమివ్వనే లేదు. ఇదీ ఆ ప్రశ్న: ద్రవ్యోల్బణం నియంత్రణ అంత మెరుగ్గా ఉంటే, రిజర్వ్ బ్యాంక్ గత 13 నెలలుగా బ్యాంక్ రేటును 6.5 శాతంగా మాత్రమే ఎందుకు ఉంచుతోంది? 2024లో సైతం దానిని తగ్గించే అవకాశాలు ఎందుకు కన్పించడం లేదు?
2024–25 కేంద్ర బడ్జెట్‌పై ప్రజలు పెదవి విరిచారు. సగటు పౌరులు దానిపట్ల ఉదాసీనంగా ఉన్నారు. మోదీ ప్రభుత్వాన్ని సమర్థించే వారు సైతం సమాజంలోని వివిధ వర్గాలకు అది సమకూర్చే శ్రేయస్సుపై సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అది చేసే దోహదమేమిటో వారికి అర్థం కావడం లేదు. ఎవరూ ఉత్సాహంగా లేరు. ఒక్క ఆర్థిక మంత్రి మాత్రమే తన బడ్జెట్ విషయంలో అమితోత్సాహంగా ఉన్నారు. సామాన్యుల ఉదాసీనతను ఆమె గ్రహించడం లేదు. సరే, నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినప్పుడు చాలా మందితో పాటు నాకూ కలిగిన సంశయాలు, సంకోచాలు బడ్జెట్‌పై చర్చకు ఆమె సమాధానం ముగించిన తరువాత కూడా అదే విధంగా ఉండిపోయాయి.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)