ప్రజాస్వామ్య లోటుతో బంగ్లా ప్రళయం
ABN , Publish Date - Aug 10 , 2024 | 05:36 AM
జూలై 4, 1776న పదమూడు అమెరికా రాష్ట్రాలు తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. ఫ్రెంచ్ విప్లవం సంభవించి రెండు శతాబ్దాలకు పైగా గడిచిపోయింది. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వేచ్ఛ పొందిన తొలి
జూలై 4, 1776న పదమూడు అమెరికా రాష్ట్రాలు తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. ఫ్రెంచ్ విప్లవం సంభవించి రెండు శతాబ్దాలకు పైగా గడిచిపోయింది. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వేచ్ఛ పొందిన తొలి వలస రాజ్యం ఆస్ట్రేలియా (1901లో). భారత్ 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నది. అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇప్పటికీ స్వతంత్ర, ప్రజాస్వామిక దేశాలుగా వర్థిల్లుతున్నాయి. వలస పాలనా శక్తుల (బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, పోర్చుగల్ మొదలైనవి) నుంచి విముక్తి పొందిన దేశాలన్నీ చిరకాలం నిజంగా ‘స్వతంత్ర’ దేశాలుగా లేవు. పలు దేశాల పౌరులు అందరూ పౌర స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు పూర్తిగా నోచుకోవడం లేదు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షికమైన ఎన్నికలలో తాము కోరుకుంటున్న వారిని ఎన్నుకోలేని దుస్థితి నెదుర్కొంటున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో కేవలం 20 శాతం మంది మాత్రమే నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పొందుతున్నారు. ప్రజాస్వామిక హక్కులను అనుభవిస్తున్నారు. ఆ అదృష్ట భాగ్య దేశాలలో భారత్ కూడా ఉన్నది. ఇది మనకు సంతోషకరమేకాదు, గర్వకారణం కూడా.
ప్రజాస్వామ్యం ఒకరు ఇచ్చేది కాదు. మరొకరి నుంచి స్వీకరించేదీ కాదు. ఆగస్టు 14, 1947న పాకిస్థాన్ స్వతంత్ర దేశంగా ప్రభవించింది. అయితే అనేకమార్లు సైనిక నియంతృత్వ పాలనలోకి వెళ్లింది. మన మరో పొరుగు దేశం (తొలుత పాకిస్థాన్‌లో ఒక రాష్ట్రంగా ఉన్న) బంగ్లాదేశ్ పాకిస్థాన్‌ను ఏలిన సైనిక ప్రభుత్వాల పద ఘట్టనలో దశాబ్దాల పాటు నలిగిపోయింది. సైనిక పాలకులపై తిరుగుబాటుగా గెరిల్లా ఉద్యమం ఆరంభమయింది. క్రమేణా బలోపేతమై విముక్తి పోరాటంగా పరిణమించింది. భారత్ జోక్యంతో 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1975–91 సంవత్సరాల మధ్య పలువురు సైనిక పాలకులు వచ్చారు, పోయారు. ప్రధాన రాజకీయ పక్షాలు అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బిఎన్‌పి) కలసికట్టుగా సైనిక పాలకులను వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యం కోసం పోరాడాయి. 1991లో పౌర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అవామీ లీగ్ అధినేత్రి బేగం షేక్ హసీనా ప్రధానమంత్రిగా 1996లో ప్రప్రథమంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2008, 2014, 2019, 2024లో ఆమె ప్రధానమంత్రిగా ఎన్నికవుతూ వచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఎన్నికలను ప్రతిపక్షాలు బాయ్‌కాట్ చేశాయి.
షేక్ హసీనా నేతృత్వంలో బంగ్లాదేశ్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించింది. బంగ్లా తలసరి ఆదాయం భారత్ తలసరి ఆదాయం కంటే అధికం. శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్ మొదలైన ఇతర దక్షిణాసియా దేశాల కంటే కూడా బంగ్లాదేశ్ ముందంజ వేసింది. మానవాభివృద్ధి సూచీలో బంగ్లాదేశ్, శ్రీలంక తరువాయి స్థానంలో ఉన్నది; భారత్, నేపాల్, పాకిస్థాన్ కంటే ఉన్నత స్థాయిలో ఉన్నది. బంగ్లాదేశ్‌లో శిశు మరణాల రేటు భారత్‌లో కంటే తక్కువగా నమోదవుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణలో ఢాకా పాలకుల వ్యవహార శైలిని ఫ్రీడమ్ హౌజ్ నివేదిక తూర్పార బట్టింది. అలాగే పత్రికా స్వాతంత్ర్యం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విషయంలో కూడా బంగ్లా పాలకుల తీరు తెన్నులు అంతర్జాతీయ సంస్థల ఆమోదాన్ని పొందలేదు. ప్రజాస్వామ్య స్వేచ్ఛలను అదుపు చేస్తే లేదా నిరుద్యోగిత, అసమానతలు, వివక్షలపై ప్రజల అసంతృప్తి తగ్గితేనే ఆర్థికాభివృద్ధి సుసాధ్యమవుతుందని పాలకులు భావించడం కద్దు. అయితే ఇది చాలా చాలా అరుదుగా మాత్రమే నిజం. బంగ్లాదేశ్‌లో పాలకుల పట్ల ప్రజల వ్యతిరేకత మహోధృతంగా వెల్లువయింది. ప్రభుత్వోద్యోగాలలో వివక్షాపూరిత, ఆశ్రిత పక్షపాత రిజర్వేషన్ల విధానంతో విద్యార్థిలోకం ఆగ్రహావేశాలకు అవధులు లేకపోయాయి. ప్రజాస్వామ్య ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లాయి.
ఇదిలా వుండగా ఆర్థిక వ్యవస్థ పెరుగుదల మందగించింది. ధరలు పెరిగాయి. ఉద్యోగాలు మృగ్యమయ్యాయి. పరిస్థితులు విషమిస్తున్నాయన్న వాస్తవాన్ని షేక్ హసీనా గుర్తించలేదు. గుర్తించినా నిరాకరిస్తూ వచ్చింది. ఇది నియంతలు అందరూ చేసే తప్పే. రిజర్వేషన్ల విధానం ఆందోళనాగ్నులకు ఆజ్యం పోసింది. అవినీతి, పోలీసు క్రౌర్యాలు, న్యాయవ్యవస్థ ఉదాసీనత మొదలైనవి కూడా బంగ్లా ప్రజల ఆందోళనను మరింత తీవ్రం చేశాయి. పర్యవసానాలు సుపరిచితమైన కథే కదా. సకల జనులు వీథుల్లోకి వచ్చారు. పోటెత్తారు. పోరాటాల వెల్లువలకు అడ్డు లేకపోయింది. ఇటువంటి పరిణామాలు ప్రభుత్వాలను కూల్చివేయడం సహజమే.
ప్రజలు పూర్తిగా ఆశాభావాన్ని కోల్పోయినప్పుడే సామూహికోద్యమాలు ప్రజ్వరిల్లుతాయి. స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని మార్చివేసే మార్గం పూర్తిగా మూసుకుపోయినప్పుడు ప్రజల అసంతృప్తి, ఆగ్రహానికి అంతు ఉండదు. ప్రజాందోళనలు ఒకసారి ప్రారంభమయితే అందులో సామాన్య ప్రజలు మాత్రమే ఉండరు. తీవ్రవాద శక్తులు ఉగ్రవాద బృందాలు కూడా పాల్గొంటాయి బంగ్లాదేశ్‌లో ఇదే జరిగింది. వివిధ సంస్థలు, పలువురు వ్యక్తులు ఈ వాస్తవాన్ని ధ్రువీకరించారు. విదేశీ జాతీయులు, మైనారిటీ వర్గాలు ఉద్యమ తీవ్రతను చవిచూడడం అనివార్యమవుతుంది. అల్పసంఖ్యాక వర్గాల గృహాలపై దాడులు జరుగుతాయి. వారి వ్యాపార సంస్థలు, ఆరాధనా మందిరాలను ధ్వంసం చేస్తారు.
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అందుకు భిన్నమైనవి కావు. చాలా దేశాలలో అటువంటి ఉపద్రవాలలో మైనారిటీలు తీవ్ర ఇక్కట్లనే ఎదుర్కొన్నారు. కారణమేమిటి? ప్రజాస్వామ్య లోటు. దానివల్లే ప్రజలు వీథుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అనివార్యమవుతుంది. పరిష్కారమేమిటి? ప్రజాస్వామ్య లోటును పూరించడమే. ప్రజాస్వామ్య లోటును పూరించడమనే కళలో అమెరికా, బ్రిటన్‌లు దాదాపుగా సమగ్ర ప్రావీణ్యాన్ని, పరిణతిని సాధించాయి. పార్టీలోను, పార్లమెంటులోను, ప్రజలలోను అసంతృప్తి తీవ్రమయినప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రులు థాచర్, జాన్సన్, మే స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగి కొత్త నాయకుడిని ఎన్నుకొనే అవకాశాన్ని తమ పార్టీకి కల్పించారు. అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్, జో బైడెన్‌లు అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేసేందుకు నిరాకరించారు. జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసి ప్రభుత్వాధినేతల రాజీనామాలు సాధించవచ్చు. పదవీకాల పరిమితులు కూడా చాలా ఉపయోగపడతాయి. పత్రికా స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంటే పరిస్థితులను చక్కదిద్దడం మరింత తేలికవుతుంది సుప్రీంకోర్టు అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్య కాపలాదారుగా వ్యవహరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. స్వతంత్ర ఎన్నికల సంఘం ప్రతి ఐదేళ్లకు ఒకసారి విధిగా ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించడం వల్ల పేదలు, అణగారిన వర్గాలవారు, నిర్లక్ష్యానికి గురవుతున్న వారికి ఎంతైనా ఉపశమనం కలుగుతుంది. పార్లమెంటు ప్రతి నెలా విధిగా సమావేశమవుతూ సభాపతి అనవసర జోక్యం లేకుండా ప్రతి రోజూ అధికార, ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదనలు అనుమతించడమే ప్రజాస్వామ్య లోటుకు అంతిమ సమాధానమని నేను భావిస్తున్నాను.
ప్రజాస్వామ్య లోటుకు బంగ్లాదేశ్ భారీ మూల్యాన్ని చెల్లించింది. ప్రజా ప్రళయాగ్నులలో ఆహుతి అయిన వారి కోసం నేను దుఃఖిస్తున్నాను.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)