దగాపడిన పేదలు, యువకులు
ABN , Publish Date - Jul 27 , 2024 | 05:48 AM
సాధారణ జీవితంలో చాలా మంది వ్యవహార రీతులు లావాదేవీల సంబంధితంగా ఉండడం కద్దు. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు మానవ బృందాల మధ్య లావాదేవీల సంబంధమేమిటి? ‘నేను ఆశిస్తున్నది మీరు ఇస్తే లేదా చేస్తే మీరు కోరింది నేను ఇస్తాను’ అనేదే ఆ బంధం. దీన్నే వ్యవహారికంలో ‘క్విడ్ ప్రొ
సాధారణ జీవితంలో చాలా మంది వ్యవహార రీతులు లావాదేవీల సంబంధితంగా ఉండడం కద్దు. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు మానవ బృందాల మధ్య లావాదేవీల సంబంధమేమిటి? ‘నేను ఆశిస్తున్నది మీరు ఇస్తే లేదా చేస్తే మీరు కోరింది నేను ఇస్తాను’ అనేదే ఆ బంధం. దీన్నే వ్యవహారికంలో ‘క్విడ్ ప్రొ కో’ (ప్రతిఫల సిద్ధాంతం) అంటారు. అధికారిక నిర్ణయాలకు ముడుపులు చెల్లించడం ఇటువంటి లావాదేవీల వ్యవహారమే. ప్రశ్నపత్రాల లీకేజీ కూడా అంతే. ఈ తరహా ప్రవర్తనారీతుల స్థాయిని మోదీ ప్రభుత్వం పెంచింది. వాటిని బాగా ప్రోత్సహించింది. ఎన్నికల బాండ్లు ఇందుకొక ఉదాహరణ. వీటిని ఎందుకు కొనుగోలు చేశారు? ప్రభుత్వం తమకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలకు, తీసుకుబోయే నిర్ణయాలకు ప్రతిఫలంగానే కాదూ? ఎన్నికల బాండ్ల అసలు లక్ష్యం అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఆలస్యంగానే అయినప్పటికీ ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దుచేయడం పూర్తిగా సరైన చర్యే అనడంలో సందేహం లేదు. అయితే ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ఉద్దేశాలపై వ్యాఖ్యానించడలో బాగా సంయమనం పాటించింది.
జూలై 23, 2024న ఎన్డీఏ ప్రభుత్వం ఈ లావాదేవీల ప్రవర్తనను మరింత పై స్థాయికి తీసుకువెళ్లింది 2024–25 వార్షిక బడ్జెట్‌కు ప్రధాన ప్రేరణ ‘ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలి’ అన్న ఆరాటమే సుమా! అది కుర్సీ బచావో బడ్జెట్. ఆ బడ్జెట్ రూపకర్త ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆమె ఆ విధిని ఎలాంటి విచారభావానికి లోను కాకుండా నిర్వర్తించారు. బడ్జెట్‌పై ఆర్థికమంత్రి, ఆమె మంత్రిత్వ శాఖ కార్యదర్శులు ఇచ్చిన వివరణలను గమనిస్తే ప్రభుత్వ మనుగడకు రెండు మిత్రపక్షాల మద్దతును సాధించుకోవడానికి చేసిన ప్రయత్నమే బడ్జెట్ ప్రతిపాదనలు అని స్పష్టమవుతుంది. మోదీ మూడో ప్రభుత్వం ఏర్పాటుకు 16 మంది సభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీ, 12 మంది సభ్యులు ఉన్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీల మద్దతుకు ప్రతిఫలంగా మోదీ సర్కార్ బిహార్‌కు పారిశ్రామిక కేంద్రాలు, కనెక్టివిటీ ప్రాజెక్టులు, విద్యుత్కేంద్రాలను మంజూరు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కేమో పోలవరం పారిశ్రామిక కారిడార్‌లు, విద్యుత్కేంద్రాలు, పోలవరం ప్రాజెక్టుకు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు మంజూరు చేసేందుకు సర్కార్ సమ్మతించింది. బాహ్య ఆర్థిక సహాయాన్ని సత్వరమే సమకూర్చేందుకు లేదా ‘ఏర్పాటు’ చేస్తామనే వింత హామీ నొకదాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారు. అయితే ఇదొక అసాధ్య హామీ.
కేంద్ర ప్రభుత్వం, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్విడ్ ప్రొ కొ మూలంగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. ఆ రాష్ట్రాలు పశ్చిమబెంగాల్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ. ఆ రాష్ట్రాల నుంచి ఎంపికైన ఎంపీలు అందరూ, బీజేపీకి ఓటు వేయని కారణంగా ఎన్డీఏ ప్రభుత్వం తమ రాష్ట్రాలకు ఎన్నడూ లేని రీతిలో దగా చేసిందని ఆక్రోశించారు.
దేశ జనాభాలో అత్యధికుల శ్రేయస్సు విషయమై అసలు శ్రద్ధే చూపలేదు. ఈ నిర్లక్ష్య వైఖరి మూలంగా యువత బాగా నష్టపోయింది. నిరుద్యోగిత ప్రబలిపోతోంది. యువజనులు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. అఖిల భారత స్థాయిలో నిరుద్యోగిత రేటు జూన్ 2024లో 9.2 శాతంగా ఉందని సిఎమ్ఐఈ వెల్లడించింది. పట్టభద్రులలో 40 శాతం మంది నిరుద్యోగులే. ఉద్యోగులుగా ఉన్న వారిలో కేవలం 20.9 శాతం మంది మాత్రమే క్రమబద్ధంగా వేతనాలు పొందుతున్నారని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. పెద్దగా చదువు సంధ్యలు లేనివారిలో చాలా తక్కువ మంది మాత్రమే నిరుద్యోగులుగా ఉండడం ఒక విచిత్ర విశేషం.
ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహకాల పథకంపై హామీ ఇచ్చింది. ఈ పథకం ప్రకారం యాజమాన్యాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా 290 లక్షల మందికి ఉద్యోగకల్పనకు ప్రభుత్వం హామీ పడుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువజనులకు నైపుణ్యాల శిక్షణ నిచ్చేందుకు, 500 కంపెనీలలో 1 కోటి మందికి ఇంటర్న్‌షిప్ (అనుభవం గడిచే ఉద్యోగం) సమకూర్చేందుకుగాను యాజమాన్యాలకు భారీ ఆర్థిక పోత్సాహకాలు ఇస్తామని ఆమె పేర్కొన్నారు. భారీగా ఉన్న ఈ అంకెలు అన్నీ మరో బ్రహ్మాండమైన ఎన్నికల అనంతర వంచనను సూచిస్తున్నాయి.
మరి కేంద్ర ప్రభుత్వంలోను, ప్రభుత్వ నియంత్రణ సంస్థలలోను 30 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ విషయమేమిటి? ఈ విషయాన్ని ఆర్థికమంత్రి గానీ, ప్రభుత్వంలోని వేరే వారు గాని అసలు ప్రస్తావించడమే లేదు. అలాగే ఉత్పాదకతను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చే పథకం కింద వేల కోట్ల రూపాయలు వ్యయం చేశారు. అయినా చెప్పుకోదగిన ఫలితాలే లేవు. ఎందుకని? సరే, విద్యా రుణాల రద్దు విషయమేమిటి? విద్యాభ్యాసం కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నానా అవస్థలు పడుతున్నారు. ఆ రుణాలను పూర్తిగానో, పాక్షికంగానో రద్దు చేయాలనే డిమాండ్ ఒకటి గట్టిగా ఉన్నది. దీనిపై ప్రభుత్వ నిర్ణయమేమిటో బడ్జెట్ వెల్లడించలేదు. ఒక సైనికుడికి, మరో సైనికుడికి మధ్య వివక్ష చూపుతున్న అగ్నిపథ్ పథకం భవిష్యత్తు విషయమై బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావనే లేదు.
యువజనులే కాదు, పేద ప్రజలు సైతం మోదీ ప్రభుత్వం తమను దగా చేసిందని భావిస్తున్నారు. దేశ జనాభాలో పేదలు 5 శాతం కంటే అధికంగా లేరని నీతి ఆయోగ్ సీఈఓ సెలవిచ్చారు. ఆ పెద్ద మనిషి అభిప్రాయంతో ఆర్థికమంత్రి కూడా ఏకీభవిస్తున్నట్టున్నారు ప్రభుత్వ కుటుంబ వినియోగ వ్యయ సర్వే దేశ ప్రజల నెలవారీ తలసరి వ్యయాన్ని ప్రస్తుత ధరల ప్రకారం లెక్క కట్టింది. నెలవారీ తలసరి వ్యయం గ్రామీణ ప్రాంతాలలో రూ.3,094 కాగా పట్టణ ప్రాంతాలలో రూ. 4,963గా ఉందని ఆ సర్వే వెల్లడించింది. అంటే 71 కోట్ల మంది భారతీయులు రోజుకు కేవలం రూ.100–150 వ్యయంతో జీవిస్తున్నారు. ఆ సర్వే వివరాలను మరింత నిశితంగా పరిశీలిస్తే మనం మరింత నైరాశ్యంలోకి జారిపోతాం. అట్టడుగున ఉన్న 20 శాతం మంది రోజుకు కేవలం రూ.70–100 వ్యయంతో జీవిస్తుండగా మరీ దిగువున ఉన్న 10 శాతం మంది కేవలం రూ.60–90 దినసరి వ్యయంతో బతుకులు ఈడుస్తున్నారు. వీరందరూ పేదలు కాదా? పేదలకు సహాయమందించేందుకు పలు మార్గాలు ఉన్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పనులతో సహా అన్ని రకాల ఉద్యోగాలలోను కనీస దినసరి వేతనాన్ని రూ.400కి పెంచాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచితే విధిగా ఉపాధి కల్పించే కనీస పనిదినాల సంఖ్యను ఏడాదికి 50 నుంచి 100కు పెంచవచ్చు.
ఇతర పౌరులతో పాటు యువజనులు, పేద ప్రజల చేతిలో ఒక శక్తిమంతమైన ఆయుధం– ఓటు ఉందనే వాస్తవాన్ని ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి గుర్తుంచుకోవాలి. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి వారు ఒక తీవ్ర హెచ్చరిక చేశారు. వారే జూన్ 2024లో జరిగిన 13 ఉప ఎన్నికలలో దేశ పాలకపక్షానికి ఒక చెంపపెట్టు లాంటి తీర్పు నిచ్చారు. ఈ సంవత్సరాంతంలోగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాయి. జూలై 23, 2024న ఎన్డీఏ ప్రభుత్వం తమకు చేసిన దగాను యువజనులు, పేద ప్రజలు ఎట్టి పరిస్థితులలోను మరచిపోరు.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
యువజనులు, పేద ప్రజల చేతిలో ఓటు అనే ఒక శక్తిమంతమైన ఆయుధం– ఉందనే వాస్తవాన్ని ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి గుర్తుంచుకోవాలి. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి వారు ఒక తీవ్ర హెచ్చరిక చేశారు. ఇటీవలి 13 ఉప ఎన్నికలలో దేశ పాలక పక్షానికి ఒక చెంపపెట్టు లాంటి తీర్పు నిచ్చారు.
ఈ సంవత్సరాంతంలోగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూలై 23, 2024న ఎన్డీఏ ప్రభుత్వం తమకు చేసిన దగాను యువజనులు, పేద ప్రజలు ఎట్టి పరిస్థితులలోను మరచిపోరు.