Share News

భళా పారిస్‌!

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:51 AM

ఫ్యాషన్‌ నగరి పారిస్‌ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్‌ క్రీడలు పరిసమాప్తమయ్యాయి, విజయవంతమైనాయి. వ్యయనియంత్రణ, భద్రత, మౌలిక సదుపాయాలవంటి అంశాల్లో తాజా క్రీడలు కొత్త ఒరవడికి...

భళా పారిస్‌!

ఫ్యాషన్‌ నగరి పారిస్‌ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్‌ క్రీడలు పరిసమాప్తమయ్యాయి, విజయవంతమైనాయి. వ్యయనియంత్రణ, భద్రత, మౌలిక సదుపాయాలవంటి అంశాల్లో తాజా క్రీడలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌ నిర్వహించబోయే దేశాలకు ఇవి దిశానిర్దేశం చేస్తాయి. కొత్త స్టేడియాలు నిర్మించడం, ఆర్భాటపు ఖర్చులు చేయడం వంటి విషయాల్లో పారిస్‌ జాగరూకతతో వ్యవహరించింది. ఒలింపిక్స్‌ నిర్వహించిన దేశాలు ఆ తరువాత అప్పులకుప్పల్లా మారడం గతంలో చూశాం. ఈ తరహా అనుభవాలతో పారిస్‌ ముందు చూపు ప్రదర్శించింది.


ఇక పతకాల పట్టికలో అగ్రస్థానం కోసం అమెరికాతో చైనా హోరాహోరీగా తలపడింది. ఈ పోరాటం నువ్వానేనా అన్నట్టుగా చివరిదాకా సాగింది. ఆఖరి ఈవెంట్‌గా జరిగిన మహిళల బాస్కెట్‌బాల్‌ మ్యాచ్‌లో పసిడి పతకాన్ని గెలవడం ద్వారా అమెరికా ఊపిరిపీల్చుకుంది. ఇరు దేశాల స్వర్ణ పతకాలు 40–40తో సమమైనా రజతాలు, మొత్తం మెడల్స్‌లో అమెరికాదే పైచేయి. 126 పతకాలతో అది అగ్రస్థానంలో ఉంటే, చైనా 91 మెడల్స్‌తో రెండో స్థానానికి పరిమితమైంది. జపాన్‌, ఆస్ర్టేలియా తర్వాతి స్థానాల్లో కొలువుదీరాయి. ఆతిథ్య ఫ్రాన్స్‌ అద్భుత ఆటతీరుతో ఐదో స్థానం దక్కించుకుంది. ఇక తాజా క్రీడల్లో పలువురు ఆటగాళ్లు అమేయమైన ఆటతీరుతో అందరిదృష్టినీ ఆకర్షించారు. అమెరికా స్టార్లు నోవా లైల్స్‌, సిమోన్‌ బైల్స్‌, కేటీ లెడెకీ, స్వీడన్‌కు చెందిన డుప్లాంటిస్‌, కెన్యా రన్నర్‌ కిప్చొగె, ఫ్రాన్స్‌కు చెందిన లియాన్‌ మర్చండ్‌ తదితరులు పారిస్‌ను ఉర్రూతలూగించారు.

పతకాల పట్టికలో భారత జట్టు ఏకంగా 71వ స్థానంలో నిలవడం అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరచింది. 117 మంది సభ్యుల భారీ బృందం కనీసం రెండంకెల్లో పతకాలు తేకపోదా అని ఆశించినవారిని టీమిండియా ఉసూరుమనిపించింది. ఖాయంగా పతకం కొట్టేస్తారని భావించిన ఆటగాళ్లు రిక్తహస్తాలతో వెనుదిరగడం క్రీడాభిమానికి మింగుడుపడని విషయం. నిస్సందేహంగా పతకాలు సాధిస్తారనుకున్న బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బోర్గోహైన్‌, బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ జోడీ, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను తీవ్రంగా నిరాశపరిచారు. గత క్రీడల చాంపియన్‌ నీరజ్‌ చోప్రాకు మళ్లీ పసిడి పతకం ఖాయమని భావించారంతా. అయితే పాకిస్థాన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ నమ్మశక్యంకాని త్రో వేయడం నీరజ్‌ ఆశల్ని వమ్ముచేసింది. ఇక రెజ్లర్‌ వినేష్‌ ఫొగట్‌ సంగతి సరేసరి.


100 గ్రాముల అదనపు బరువు ఒక పతకాన్ని దూరం చేసింది. ఆ బౌట్‌లో ఆమె తలపడి నెగ్గివుంటే భారత్‌కు స్వర్ణం వచ్చిపడేది. ఇలా అనూహ్య పరాజయాలతో పతకాలు చేజార్చుకున్న వారి సంగతి అది. నాణేనికి మరోవైపు–స్వప్నిల్‌ కుషాలేవంటి ఆటగాళ్లు పతకాలతో అబ్బురపరచారు. మనుభాకర్‌ వ్యక్తిగతంగా ఒకటి, సరబ్‌జ్యోత్‌తో కలిసి మరో కాంస్యం సాధించగా, కుస్తీలో అమన్‌ సెహ్రావత్‌, పురుషుల హాకీ జట్టు కూడా పోడియంపై సగర్వంగా నిలిచారు. ఇక ఈసారి తెలుగు అథ్లెట్లు అంచనాలను అందుకోలేకపోయారు.

ఈ ఒలింపిక్స్‌ సన్నాహాల కోసం భారత ప్రభుత్వం సుమారు 470 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. అయినా ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడం బాధాకరం. మొత్తం 92 జట్లలో మనం 71వ స్థానంలో ఉన్నాం. 2008 నుంచి జరిగిన ఐదు ఒలింపిక్స్‌లోనూ మన జట్టు ఇంతగా దిగజారింది లేదు. 2008లో 50, 2012లో 55, 2016లో 67, 2020లో 48వ స్థానంతో భారత్‌ పర్వాలేదనిపించింది. మన ఆటగాళ్ల ప్రదర్శన ఎంతోబాగున్నా పతకాలు రాకపోవడం బాధాకరమన్న వాదన ఒకటి వినిపిస్తోంది. ఒలింపిక్‌ పోటీల అంతిమలక్ష్యం పతకాల సాధన తప్ప మరోటికాదు. అలాంటప్పుడు ఎంత అద్భుతంగా ఆడినా పతకం రాకపోతే ఏం ప్రయోజనం? మనవాళ్ల శ్రమను తక్కువ చేయడం కాదు కానీ, అద్భుత ఆటకు–పతక సాధనకు మధ్య ఉన్న సన్నటిగీతను దాటగలిగితే కనీసం మరో అరడజను పతకాలు మనకు దఖలుపడేవి. ఏదేమైనా పారిస్‌ క్రీడల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం నిరుత్సాహకరమే. మిగతా ప్రపంచంతో పోలిస్తే మన క్రీడారంగం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్న వాస్తవం పారిస్‌ క్రీడల ద్వారా అవగతమవుతోంది. మరో నాలుగేళ్ల తర్వాత జరిగే లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లోనైనా భారత్‌ రెండంకెల స్కోరు సాధిస్తుందని ఆశిద్దాం.

Updated Date - Aug 13 , 2024 | 03:51 AM