ఉద్యమానికి ‘న్యాయం’
ABN , Publish Date - Aug 02 , 2024 | 01:49 AM
తెలుగు రాష్ట్రాల మాదిగలు ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం విజయవంతమైంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సహా ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఉదయం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో...
తెలుగు రాష్ట్రాల మాదిగలు ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం విజయవంతమైంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సహా ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఉదయం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో షెడ్యూల్డ్ కులాల, తెగల రిజర్వేషన్ల వర్గీకరణపై బిగుసుకున్న పీటముడి విడిపోయింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేసిన పోరాటం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన ఇవే మోస్తరు డిమాండ్లు, జరిగిన జనాందోళనలు అన్నీ ఈ తీర్పుతో ఒక కీలకమయిన విజయం సాధించాయి. ఇప్పుడిక, రాష్ట్రాలు వాటి వాటి సొంత పరిస్థితులను బట్టి, ఎస్సీఎస్టీ తెగల రిజర్వేషన్లలో ఉప విభజన చేయవచ్చు. కాకపోతే, యథేచ్ఛగా, ఇష్టాయిష్టాలను బట్టి కాకుండా, వాస్తవమైన, లెక్కించదగిన సమాచారం ఆధారంగా మాత్రమే ఉపవిభజన జరగాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పులో మరో ముఖ్యమైన అంశం, షెడ్యూల్డు కులాలు, తెగల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ప్రాతిపదికను అమలుచేయాలన్న ఆదేశం. రిజర్వేషన్లు అర్హులకే అందాలన్న విలువకు అనుగుణమైనది ఈ క్రీమీలేయర్ పరిగణన. షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల వర్గీకరణకు కూడా దారి సుగమం చేస్తున్న ఈ తీర్పువల్ల అనేక రాష్ట్రాలలో కొత్త ఆకాంక్షలు, ఆందోళనలు వ్యక్తంకావచ్చు.
న్యాయవివాదం వల్లనే వర్గీకరణ అంశం స్తంభించిపోవడం నిజమే కానీ, ఇది కేవలం లిటిగేషన్ మాత్రమే కాదు. దీని వెనుక ఎంతో ప్రజాపోరాట చరిత్ర ఉన్నది. వర్గీకరణ లేకపోవడం వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుగు రాష్ట్రాల మాదిగ సమాజం ఎలుగెత్తి చాటిన తరువాత, ఆ స్పందనను చూసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం చేసి, దాని ప్రకారం రిజర్వేషన్లను కొంతకాలం అమలుచేశారు కూడా. దాని మీద న్యాయస్థానంలో దాఖలైన వ్యాజ్యమే ‘ఇ.వి. చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.’ 2004 నాటి ఈ కేసు తీర్పులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణ చెల్లదని చెప్పింది. రాజ్యాంగంలోని 341 అధికరణం షెడ్యూల్డు కులాల, తెగల జాబితా నిర్ణయాన్ని రాష్ట్రపతికి దఖలు పరిచిందని, దాన్ని రాష్ట్రాలు ఉల్లంఘించలేవని ఆ తీర్పు సారాంశం. ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వం వేసిన వ్యాజ్యం మీద ఇచ్చిన తీర్పులో ఈ 2004 నాటి తీర్పునే తప్పుపట్టారు. వర్గీకరణ అన్నది జాబితాను సవరించడం కాదని, అణగారిన తరగతులు ఏకరూప తరగతులు కావని, వాటిలోనూ అంతరాలు ఉంటాయని, ఏ రకంగానూ వర్గీకరణ రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించినట్టు కాదని చెబుతూ, షెడ్యూల్డు కులాలు, తెగల రిజర్వేషన్లలో రాష్ట్రాలు ఉపవిభజన చేసుకోవచ్చునని చెప్పింది. చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పుతో విభేదిస్తున్నామని ఈ కేసులో ఐదుగురు సభ్యుల బెంచి 2020లోనే అభిప్రాయపడడంతో, ఈ వ్యాజ్యాన్ని ఏడుగురు సభ్యుల బెంచికి నివేదించారు.
సమాజంలో అట్టడుగు, బడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉన్న సమర్థనలే ఉపవిభజనకు కూడా వర్తిస్తాయి. మంద కృష్ణ మాదిగ చెప్పినట్టు, వర్గీకరణ అన్నది దోపిడీ పీడనలకు సంబంధించినది కాదు. అసమానతలకు సంబంధించినది. ఒక సామాజిక వర్గం విషయంలో సానుకూల వివక్ష చూపించినప్పుడు, ఆ వర్గంలోని వేరువేరు శ్రేణులు సమానంగా ఆ లబ్ధి పొందలేకపోతే, జరిగేది అన్యాయమే. ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి, జనాభా, ఇతర సామాజిక ప్రాతిపదికల పైన వర్గీకరణ చేసి పంచడమే న్యాయమని మాదిగ దండోరా ఉద్యమం వాదించింది. వివిధ రాజకీయపక్షాలు, ప్రజాస్వామిక వాదులు, పౌరసమాజం అంతా మాదిగ ఉద్యమానికి సానుభూతిగా నిలిచారు. ఈ ప్రయాణంలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ తెలుగుదేశం అందించిన మద్దతు, చూపిన చొరవ. వర్గీకరణ కారణంగా మాదిగలకు కలిగే ప్రయోజనాన్ని ఆచరణాత్మకంగా, నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో అమలైన రిజర్వేషన్లు నిరూపించాయి.
ప్రజా ఉద్యమాల చరిత్రలో ఎంఆర్‌పీఎస్ ది ప్రత్యేకమైన అధ్యాయం. సృజనాత్మకమైన, సాహసోపేతమైన ఆందోళనరూపాలను రూపొందించి, ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసింది ఆ సంస్థ. పార్టీల మీద నైతికమయిన, రాజకీయమైన ఒత్తిడిని తీసుకురాగలిగింది. అనేకమార్లు శాసనసభల చేత తీర్మానాలను చేయించింది, అఖిలపక్షాలు ఢిల్లీ వెళ్లేట్టు చేయగలిగింది. ఎవరు మద్దతు ఇస్తే, వారి పక్కన నిలబడి, తన ఉద్యమాన్ని మందకృష్ణ కొనసాగించగలిగారు. దీర్ఘకాలం ఉద్యమం స్తబ్ధ దశలోకి వెళ్లినా, ఇతర ప్రజా ఉద్యమాలను చేపట్టి తమ సంస్థ ఉనికిని చాటుకున్నారు.
రెండు తెలుగురాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ చేపడతామని ముందుకు రావడం హర్షణీయం. ఈ కేసులో పిటిషనర్లుగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అవి అన్నీ వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది. కేంద్రప్రభుత్వం తీసుకోవలసిన చర్యలేవీ లేవు కానీ, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నిర్ణయాలు ఎట్లా ఉంటాయో చూడవలసి ఉన్నది. ఏది ఏమయినా, వివక్షితులలో అంతర్గత వివక్ష ఉండరాదనే సహజసూత్రం నెగ్గింది. ఈ ఉద్యమం వల్ల దళిత ఉద్యమంలో కొన్ని పొరపొచ్చాలు, అనైక్యత ఏర్పడిందని బాధపడినవారున్నారు. ఇప్పుడు, ఈ తీర్పు తరువాత, అంతా వాస్తవాన్ని అంగీకరిస్తారని, బలశాలి అయిన సమష్టి దళిత సమాజంగా రూపొందుతారని ఆశించవచ్చు.