మన కోచింగ్ సెంటర్లపైనా ఓ కన్నేసి ఉంచాలి!
ABN, Publish Date - Aug 10 , 2024 | 05:35 AM
భారీ వర్షాల కారణంగా మురుగు కాలువ పొంగిపొర్లి ఢిల్లీలో ఒక సివిల్ సర్వీస్ శిక్షణా సంస్థలో బేస్‌మెంట్ లైబ్రరీలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించిన దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు జల సమాధి కావటం
భారీ వర్షాల కారణంగా మురుగు కాలువ పొంగిపొర్లి ఢిల్లీలో ఒక సివిల్ సర్వీస్ శిక్షణా సంస్థలో బేస్‌మెంట్ లైబ్రరీలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించిన దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు జల సమాధి కావటం యావత్ దేశాన్ని కలిచివేసింది. చనిపోయిన ముగ్గురిలో ఒకరైన తానియా సోనీ తండ్రి మంచిర్యాల సింగరేణిలో సీనియర్ మేనేజర్ కావడంతో తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తానియా సోనీ మృతదేహాన్ని తరలించడంలో తండ్రి విజయ్ కుమార్‌కి సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కి ఆదేశాలు జారీ చేశారు.
మన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అనుమతి లేని పలు కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు వరంగల్ మరియు ఇతర జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాయి. హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ల మూలంగా అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్‌లు నిరుద్యోగుల కూడళ్ళుగా పేరుపొందాయి.
అడ్డు అదుపులేని కోచింగ్ సెంటర్లపై మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం తొలుత దృష్టి పెట్టింది. కోచింగ్ సెంటర్లను సేవారంగంలోకి తెచ్చి వాటిపై పన్నులు వేశారు. 18 జనవరి 2024న భారత ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నియంత్రణ కోసం విద్యా మంత్రిత్వశాఖ ద్వారా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు.
మన రాష్ట్రంలో హైదరాబాద్ అశోక్‌నగర్‌లో గ్రూప్ 1, 2, 3, సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండగా దిల్‌సుఖ్‌నగర్‌లో డీఎస్సీ, ఎస్సై/ కానిస్టేబుల్, గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (BSRB), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఫర్ అడ్మిషన్స్ (IIMs) ఇన్ ఎంబీఏ సంస్థ నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) వంటి శిక్షణను ఢిల్లీకి చెందిన అనేక శిక్షణా సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా దిల్‌సుఖ్‌నగర్‌లోను, ఇతర ప్రాంతాల్లోను నిర్వహిస్తున్నాయి. ఇక అమీర్‌పేట్‌లో కేవలం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లతోపాటు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ (TOEFL), ప్రపంచవ్యాప్త బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్స్ (GRE) కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.
రాష్ట్రంలో అత్యధిక కోచింగ్ సెంటర్లకు ఎటువంటి అనుమతులు ఉండవు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నామమాత్రపు రుసుముతో ఒక వ్యాపార సంస్థగా నమోదు చేసుకుంటారు. కోచింగ్ సెంటర్లు నడుపుతున్న భవనాలకి భవన యజమానులు అగ్నిమాపక శాఖ విధించిన రక్షణ నిబంధనలు పాటించరు. గృహ అవసరాలకు అని ముందుగా విద్యుత్ శాఖ నుంచి అనుమతి తీసుకుని ఆ భవనాలను కోచింగ్ సెంటర్‌లు నడుపుకోవటానికి వాడుకుంటూ విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. తనిఖీకి వచ్చిన జీహెచ్ఎంసి, విద్యుత్ శాఖ అధికారుల జేబులు నింపుతూ జరిమానాల నుంచి తప్పించుకుంటున్నారు. ఆ శిక్షణా సంస్థల్లో ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు, వారు ఎంతెంత ఫీజులు చెల్లిస్తున్నారు అనేటువంటి లెక్కల పత్రాలు ఉండవు. తరగతి గదిలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పైన జీఎస్టీ వంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. జీతాలు లేదా ప్యాకేజీలు ఇచ్చే బోధనా సిబ్బంది నుంచి టీడీఎస్ (టాక్స్ డిటెక్టెడ్ సర్వీస్) చెల్లించరు. ఇరుకుగా వెలుతురు లేని గదుల్లో 100 మంది కూర్చోవాల్సిన చోట సుమారు 500మందిని కూర్చోబెట్టి బోధిస్తున్నారు. వందలాదిమంది విద్యార్థులకు ఒకటి రెండు అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉంచి విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
రాష్ట్రంలో 33 జిల్లాలకి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సుమారు 13 ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. వాటిలో ఎస్సై, కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్స్, సివిల్స్ సర్వీసెస్ వంటి శిక్షణ లభిస్తుంది. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో ప్రవేశాల కోసం పోటీ పరీక్ష పెట్టి ప్రతిభ ఆధారంగా పరిమితమైన సీట్లలో నిరుద్యోగులను చేర్చుకొని శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో సీటు రానివాళ్లు ఇష్టం లేకున్నా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల కన్నా ఆదాయం తక్కువగా ఉన్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఉత్తీర్ణులై సివిల్స్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్ అభయహస్తం పేరుతో సింగరేణి సంస్థ ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడాన్ని ఈ సందర్భంగా మనమంతా అభినందించాలి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో సివిల్ సర్వీసెస్, ప్రిలిమ్స్ మెయిన్స్‌కి రూ.1,50,000వేలు; గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్‌కి రూ.1,00,000; గ్రూప్ 2, గ్రూప్ 3కి రూ.22 వేలు; డీఎస్సీకి రూ.20వేలు; ఎస్సై కానిస్టేబుల్ కోచింగ్‌కి రూ.20 వేలు; ఐఐటి, నీట్, ఎంసెట్, కోచింగ్‌లకు రూ.2లక్షల 50వేలు, ఇతర కోచింగ్‌లైన గేట్, క్యాట్, టోఫెల్, జీఆర్ఈల ఫీజు సుమారు ఒక లక్ష వరకు ఉంటుంది. అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్న కొన్ని కోచింగ్ సెంటర్లను నియంత్రించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. వీటి నియంత్రణకు అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చి తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా విద్యార్థి నిరుద్యోగుల శ్రేయస్సుకు పాటుపడాలి.
కోటూరి మానవతారాయ్
టీపీసీసీ అధికార ప్రతినిధి
Updated Date - Aug 10 , 2024 | 05:35 AM