ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమలకు సానుకూలం!

ABN, Publish Date - Aug 09 , 2024 | 01:39 AM

డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న కమలాహారిస్‌, ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్‌ టిమ్‌వాల్జ్‌ను ఎంచుకున్నారు. మంచిపేరున్న వాల్జ్‌ను ఎంచుకొని...

డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న కమలాహారిస్‌, ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్‌ టిమ్‌వాల్జ్‌ను ఎంచుకున్నారు. మంచిపేరున్న వాల్జ్‌ను ఎంచుకొని ఆమె ఎంతో మంచిపనిచేశారని అమెరికన్‌ మీడియా మెచ్చుకుంటోంది. గవర్నర్‌గా, ఫుట్‌బాల్‌ కోచ్‌గా, ఉపాధ్యాయుడుగా విభిన్న భూమికలు నిర్వహించిన వాల్జ్‌ను నిర్ణయించి తనకంటే చక్కగా, గట్టిగా ప్రత్యర్థిని విమర్శించగలిగే వ్యక్తిని కమల తోడుతెచ్చుకున్నారని పార్టీ అభిమానులు సంతోషిస్తున్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌, జేడీ వాన్స్‌లను ఈయన విచిత్రమైన పదబంధాలతో, చమత్కారాలతో విమర్శిస్తూ ప్రజల దృష్టిని బాగా ఆకర్షించగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి, సైన్యంలోనూ పనిచేసి, మధ్యతరగతి మెచ్చినవాడిగా, శ్రామిక వర్గం పక్షపాతిగా పేరున్న వాల్స్‌ చేరికతో విజయానికి కమల మరింత చేరువైనారని ఆమె పార్టీ నమ్ముతోంది.


పార్టీ ప్రతినిధులంతా ముక్తకంఠంతో డెమోక్రటిక్‌పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ఖరారుచేయడంతో ఆమె ఒక కీలకదశ దాటింది. తద్వారా, అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఈ భారత, ఆఫ్రికన్ సంతతి మహిళ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అమెరికాలోని ఒక ప్రధాన రాజకీయపక్షంనుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని పొందిన తొలి నల్లజాతి వనిత ఆమె. ఇక, జో బైడెన్‌ బరిలో నిలిచి ఉన్నంతకాలం డోనాల్డ్‌ ట్రంప్‌ విజయం ఖాయమనీ, ఆయన చాలా ముందంజలో ఉన్నారని సర్వేలన్నీ తేల్చేశాయి. ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్‌ దూకుడుగా ఉంటూ వచ్చారు. పార్టీ ఒత్తిడిమేరకు బైడెన్‌ తప్పుకొని, కమలను క్రమంగా పెద్దలంతా బలపరుస్తున్న తరుణాన సర్వేలు ఆమెకే అనుకూలంగా ఉంటున్నాయి. ట్రంప్‌ కంటే కమల మెరుగ్గా పరిపాలించగలరని నమ్మేవారి సంఖ్య హెచ్చుతోంది. భారీగా విరాళాలు సమకూరడం, ఆమె సభలకు జనం పెద్దసంఖ్యలో వస్తూండటం స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. గతనెలలో ట్రంప్‌మీద భయానకమైన హత్యాయత్నం జరిగిన తరువాత ప్రజల్లో ఆయనపట్ల సానుభూతి పెరిగినమాట నిజం. ఒక ధీరుడిగా, పోరాటవీరుడిగా, రక్షకుడిగా ఆయన కనిపించాడు. తుపాకీ గుండు ఛేదించిన చెవితో, రక్తం చిందిన మొఖంతో, భద్రతాబృందం మధ్యలోనుంచి పిడికిలెత్తి నినదిస్తున్న ఆ దృశ్యం ఓటర్ల మీద ప్రభావం చూపకపోదు. కానీ, ఆ దెబ్బతో ఘోరపరాజయం ఖాయమని డెమోక్రాట్లంతా భయపడి, అధ్యక్ష అభ్యర్థిని మార్చేయడం ఇప్పుడు సానుకూల ఫలితాన్నిస్తున్నది.


ఈ మార్పు గమనించబట్టే, కమలాహారిస్‌ మూలాలకు సంబంధించి డోనాల్డ్‌ ట్రంప్‌ నోట విచిత్రమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మనమంతా బహుళ సాంస్కృతిక ప్రపంచంలో బతుకుతున్నామని, విభిన్న మతాలు, జాతుల మధ్య వివాహాలతో మానవసమాజం పురోగమిస్తున్నదని ఆయనకు తెలియకపోదు. కానీ, ప్రత్యర్థి జాతీయతను అనుమానించడం ద్వారా తాను రాజకీయంగా లబ్ధిపొందవచ్చునని ఆయన అనుకున్నారు. ఆఫ్రో అమెరికన్‌ జర్నలిస్టుల వేదికనుంచి కమల భారతీయురాలే తప్ప, నల్లజాతి కాదని చెప్పదల్చుకున్నారు. ఆమె దశాబ్దాలపాటు తన భారతీయమూలాలను ప్రచారం చేసుకొని, ఇప్పుడే నల్లజాతి అస్త్రాన్ని వెలికితీసిందన్న రీతిలో ట్రంప్‌ విమర్శ చేశారు. కమల ప్రతిస్పందనను అటుంచితే, ఒక బ్లాక్‌ ఎకనమిస్టుకు, ఇండియన్‌ బయోలజిస్టుకు పుట్టిన ఆమె తన రెండు వారసత్వాలను ఘనంగా, గర్వంగా చెప్పుకోవచ్చునని కొందరు అంటున్నారు. బరాక్‌ ఒబామా, కమలా హారిస్‌ తండ్రులు ఇద్దరూ నల్లజాతి వారేనని గుర్తుచేస్తున్నారు. భారతీయ అమెరికన్లు, నల్లజాతి అమెరికన్లు ఆమెలో తమను చూసుకుంటారన్న భయం ట్రంప్‌కు ఉండవచ్చు. భారతీయ మూలాలున్నాయి కాబట్టి, ఆమె నల్లజాతీయురాలు కాదని ఆయన నిరూపించడానికి ప్రయత్నించినప్పటికీ, అమెరికన్‌ శ్వేతజాతి సమాజంలో మిగతాజాతులమీద అది పెద్దగా పనిచేయదు, నిజం ఏమిటో వారికి తెలియనిదీ కాదు. అధ్యక్ష అభ్యర్థిగా కమల ప్రవేశంతో అక్కడి రాజకీయం ఒక్కసారిగా మారింది. అమెరికన్‌ ప్రజలు ఆశాజీవులనీ, మార్పుకోసం తపిస్తారనీ, బరాక్‌ ఒబామాను రెండుసార్లు అధ్యక్షుడిని చేసినట్టుగానే, కమలాహారిస్‌నూ గద్దెనెక్కిస్తారని కొందరి నమ్మకం. రేపటి ఆమె విజయం పలురకాల వివక్షలున్న అమెరికన్‌ సమాజంమీద విశేషమైన ప్రభావం చూపుతుందన్న ఆ నమ్మకం నిజమైతే మంచిదే.

Updated Date - Aug 09 , 2024 | 01:39 AM

Advertising
Advertising
<