Share News

ఎర్రకోట సందేశం

ABN , Publish Date - Aug 16 , 2024 | 01:49 AM

ప్రధాని నరేంద్రమోదీ ఎంతో చక్కగా ప్రసంగించగలరు. ఆయన ఎర్రకోట ప్రసంగాల్లో ఆదిలో ఉన్న పస క్రమంగా తగ్గిందని గిట్టనివారు అంటూంటారు కానీ, ఈ 78వ స్వాతంత్ర్యదినోత్సవంలో ఆయన...

ఎర్రకోట సందేశం

ప్రధాని నరేంద్రమోదీ ఎంతో చక్కగా ప్రసంగించగలరు. ఆయన ఎర్రకోట ప్రసంగాల్లో ఆదిలో ఉన్న పస క్రమంగా తగ్గిందని గిట్టనివారు అంటూంటారు కానీ, ఈ 78వ స్వాతంత్ర్యదినోత్సవంలో ఆయన ఒక సరికొత్త రికార్డు కూడా సృష్టించేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన ప్రసంగం ఏకంగా 98నిముషాలు సాగింది.మరో రెండునిముషాలు మాట్లాడివుంటే సెంచరీ కొట్టేవారని అభిమానులు అంటున్నారు. ఓ రెండునిముషాలు ఎక్కువగా మాట్లాడి ఆయన 2016నాటి రికార్డును చెరిపేశారు. 2019లో అధిక సంఖ్యాబలంతో రెండోసారి ప్రధాని అయినప్పుడు కూడా ఎర్రకోటనుంచి 92నిముషాలే మాట్లాడారు. ఇప్పుడు సొంత బలం 240కు పడిపోయి, కూటమి కట్టాల్సివచ్చినప్పటికీ, గత పది ప్రసంగాల రికార్డులను చెరిపివేస్తూ ఈ 11వ ఎర్రకోట ప్రసంగాన్ని సుదీర్ఘంగా చేశారు. ప్రధాని ప్రసంగంలో 140కోట్ల బలం కనిపించిందే తప్ప, ఆ 240 బలహీనత కాదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


ప్రత్యక్షంగా ఆహూతులను, పరోక్షంగా కోట్లాదిమంది ప్రజలను ఆయన సంబోధించారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్, అటల్‌బిహారీ వాజపేయి వంటివారు కాస్త అటూఇటూగా అరగంటే మాట్లాడేవారు. పనిమంతుడైన మన్మోహన్‌ సింగ్‌ మంచిమాటకారి కాదు కానీ, అంతటి వాగ్ధాటి ఉన్నప్పటికీ అటల్‌ జీ ఎర్రకోటమీద ఎందుకంత తక్కువ సమయం ఉండేవారో తెలియదు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచీ నరేంద్రమోదీ ఈ స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగాన్ని నామమాత్రపు తంతుగా కాకుండా ఒక ప్రజాసంబంధ వ్యవహారంగా చూశారు. ప్రసంగానికి అప్పటివరకూ ఉన్న హద్దులను కూడా చెరిపేసి, రాజకీయం చేస్తున్నారన్న విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. నెహ్రూ నుంచి రాహుల్‌ వరకూ ఎవరిని తప్పుబట్టాలన్నా, గతపాలకుల పాపాలు దేశానికి శాపాలుగా మారాయని కడిగిపారేయడానికి కూడా ఆయన దీనిని వాడుకున్నారు. అలాగే, పలురకాల అభియాన్లు, మిషన్ల ప్రకటనకు కూడా ఇదే వేదికైంది. స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పడావో, ఉజ్వల, జల్‌జీవన్‌ వంటివి అందులో కొన్ని. అవినీతి వ్యతిరేక పోరాటాలు, కుటుంబపాలనపై విమర్శలు సైతం ఆయన ఎర్రకోట ప్రసంగాల్లో ఉంటాయి.

ఇప్పుడు సొంతబలం తగ్గినంతమాత్రాన మోదీ తీరులో మార్పు ఉండబోదని ఈ ప్రసంగం సైతం రుజువుచేసింది. ఆయన ఈ మారు దూకుడుగా కాక, కాస్తంత మెత్తగా మాట్లాడారని కొంతమందికి అనిపించినా, విపక్షాలను ఏకిపారేయడానికీ, వివాదాస్పద అంశాలను ముందుకు తేవడానికీ ఆయన సంకోచించలేదు. వికసిత భారతాన్ని కాంక్షించారు, మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించడం లక్ష్యంగా ప్రకటించారు.


మద్దతిస్తున్న మిత్రపక్షాలకు ఇబ్బందిలేకుండా ఉండటానికి కాబోలు, తాము ఎప్పటినుంచో వల్లిస్తున్న ఉమ్మడిపౌరస్మృతికి ఈసారి ఆయన ‘సెక్యులర్‌’ పదాన్ని జతచేర్చారు. చర్చ జరగాలన్న ఒక్క మాటతో రచ్చరేపవచ్చునని ఆయనకు తెలుసు. ఇప్పటి సివిల్‌కోడ్ మతపరమైనదనీ, వివక్షాపూరితమైనదనీ ఆక్షేపించి, మెజారిటీ ప్రజలు దానిని మెచ్చడం లేదని నిర్థారించి, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న ఈ లౌకకవాద ఉమ్మడిపౌరస్మృతికి సుప్రీంకోర్టు ఆమోదం, ఆశీస్సులు ఉన్నాయన్నారు. ఆ స్వప్నసాకారం దిశగా వడివడిగా అడుగులు ఎలా పడతాయో ఇక చూడాలి. ఒకేదేశం–ఒకే ఎన్నిక అవసరాన్ని కూడా ఆయన ఈ వేదికమీదనుంచి మరోమారు ఉద్ఘాటించి, సభాబలం తగ్గినంతమాత్రాన ఎజెండాలో తాము వెనక్కు తగ్గడంలేదని తెలియచెప్పారు. ఆర్థిక, చట్టపరమైన సంస్కరణల విషయంలో విపక్షాలు అడ్డుపడినా ఆగేదిలేదన్న ప్రకటన కూడా అటువంటిదే. విద్య, ఉపాధి గురించి ప్రస్తావించడం, కొన్ని చర్యలను వివరించడం ఆగ్రహంగా ఉన్న యువతరాన్ని ఉపశమింపచేయడం కోసం కావచ్చు. పదేళ్ళలో అద్భుతాలు చేశామంటూ ఏ ఒక్కరంగాన్నీ, ఏ చిన్న విషయాన్నీ వదలకుండా ఆయన ప్రజలకు వివరించారు. అదానీకి వ్యతిరేకంగా జరిగే ఏ వ్యవహారమైనా విదేశీకుట్రలో భాగమే కనుక, ఇప్పుడు సెబీచీఫ్‌మీద హిండెన్‌బర్గ్‌ కథనాన్ని సైతం విశ్వసించకూడదని అన్యాపదేశంగా సెలవిచ్చారు. మోదీ ఎంతో ఓపికగా చేసిన ఈ సుదీర్ఘ ప్రసంగంలో ఆత్మస్తుతి పరనిందలను అటుంచితే, కొనసాగుతున్న లక్ష్యాలను, అంతర్లీన సందేశాలను ప్రజలు సరిగానే గ్రహించి ఉంటారు.

Updated Date - Aug 16 , 2024 | 01:49 AM