Share News

ఆమె నిలిచి గెలిచింది!

ABN , Publish Date - Aug 08 , 2024 | 03:03 AM

ఆటల్లో జయాపజయాలు ఉంటాయి, అనిశ్చితి ఆఖరివరకూ వెంటాడుతుంది. చివరి అంకంలో ఆట ఒక్కసారిగా మలుపు తిరగవచ్చు, అంతవరకూ విజేత అనుకున్నవారిని పరాజితులుగా....

ఆమె నిలిచి గెలిచింది!

ఆటల్లో జయాపజయాలు ఉంటాయి, అనిశ్చితి ఆఖరివరకూ వెంటాడుతుంది. చివరి అంకంలో ఆట ఒక్కసారిగా మలుపు తిరగవచ్చు, అంతవరకూ విజేత అనుకున్నవారిని పరాజితులుగా కిందపడవేయవచ్చు. ఊహకు అందనప్పుడూ, ఉత్సాహాలతో ముంచెత్తినప్పుడు, ఉద్వేగాలు రేపినప్పుడు ఆట నిజానికి మరింత అందంగా ఉంటుంది. పరాజయం బాధించని సందర్భాలూ ఉంటాయి. కానీ, ఇప్పుడు జరిగింది అదికాదు. వినేశ్‌ ఫోగట్‌ గుండెబద్దలైందీ, కోట్లాదిమంది భారతీయుల ఆశలు ఆవిరైపోయిందీ ఆమె ఇంకా బరిలోకి దిగకముందే, గురిచూసి ప్రత్యర్థిని కూల్చకముందే. పారిస్‌నుంచి బంగారం తెస్తుందనుకున్న ఈ క్రీడాకారిణి కదనరంగం నుంచి ముందే నిష్క్రమించి ఆశలన్నీ అడియాసలు చేసినా దేశం ఆమె కన్నీరు తుడుస్తున్నది, నిలువెత్తు బంగారం నువ్వు అంటూ హారతులు పడుతున్నది. పసిడి పతకం పోరుకు దూరమైనా, అంతవరకూ రావడానికీ, ఆ ఎత్తుకు చేరడానికీ ఆమె పడిన శ్రమ, చేసిన యుద్ధం అసామాన్యమైనది.


ఆమె కుప్పకూలింది, కన్నీరు పెట్టుకుంది, ఆస్పత్రిపాలైంది కూడా. ఆమె గుండెగట్టిది కనుక, పోరాటం ఆమె రక్తంలో ఉన్నది కనుక అంతటి పెను ఉపద్రవాన్ని తట్టుకోగలిగింది. కొద్ది ఘడియలముందు తన చేతుల్లో ఓడిన ఓ క్రీడాకారిణి ఫైనల్‌కు ఎగబాకడం, తాను మాత్రం అనర్హురాలిగా మిగిలిపోవడం విషాదకరమైన పరిణామం. ఆమెకోసం ప్రత్యేకంగా కొందరు శిక్షకులు, నిపుణులు ఉన్నప్పుడు అతి తక్కువ సమయంలో రెండుకిలోల బరువు పెరగడం ఎలా సాధ్యమైందని కొందరి ప్రశ్న. పెరిగిన బరువును వదిలించుకోవడానికి రాత్రంతా ఆమె చేసిన శ్రమ, మహత్తరమైన ఆ పట్టుదల అపూర్వమైనవి. బరువును నియంత్రణలో ఉంచే విషయంలో సిబ్బంది యావత్తూ శ్రద్ధపెట్టివుంటే బాగుండేది. ఇలా అతివేగంగా బరువులో మార్పులు రావడం వల్ల ఆమెపై కుట్ర జరిగిందన్న అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఇది సాంకేతిక అంశమనీ, కుట్రకోణాలు వెతకవద్దనీ, రాజకీయం చేయకూడదనీ ఎందరెందరో హితవులు చెబుతున్నారు కానీ, అనుమానాలు ఆగడం లేదు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనీ, అతడిని పదవినుంచి తప్పించాలని రెజ్లర్లంతా ఏడాదిపాటు రోడ్డునపడి చేసిన పోరాటం, అతడికి ఆఖరువరకూ అండగా నిలిచిన పాలకపక్షపెద్దలు ఈ క్రీడాకారులతో అమానుషంగా వ్యవహరించిన గతం ఇప్పుడు అందరికీ గుర్తుకువస్తున్నది. సాటి మహిళా క్రీడాకారుల పక్షాన వినేశ్‌ ఫోగట్‌ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ సందర్భంలో ఎదుర్కొన్న అవమానాలు, ఛీత్కారాలు ఇప్పుడు దేశం గుర్తుచేసుకుంటోంది. నిరసన శిబిరాలనుంచి ఆమెను ఈడ్చివేసిన దృశ్యాలు, గంగలో పతకాలు నిమజ్జనం చేయడానికి సిద్ధపడిన ఘట్టాలు తిరిగి ప్రచారంలోకి వస్తున్నాయి. తమ గోడు ఏమాత్రం పట్టించుకోని పాలకులపట్ల ఆగ్రహంతో, ఆవేదనతో ఆమె అప్పట్లో ఆటలమీద విరక్తిని ప్రదర్శించినప్పటికీ, తరువాత మనసు మార్చుకొని, ఒలింపిక్స్‌ కోసం సర్వసన్నద్ధమైంది, దేశం కోసం సర్వశక్తులూ ఒడ్డింది. రాష్ట్రపతి, ప్రధాని, విపక్షనేత, విభిన్నరంగాలకు చెందిన ప్రముఖులు ఇచ్చిన సందేశాలు ఈ సమయంలో ఆమెకు ఎంతో ఉపశమనం ఇస్తాయి.


పారిస్‌ ఒలింపిక్స్‌ శిక్షణ కోసం ఆమెమీద డెబ్బయ్‌ లక్షలకుపైగా ఖర్చుచేశామని కేంద్ర క్రీడామంత్రి పార్లమెంటులో ప్రకటించడం ఆత్మరక్షణ కోసం కావచ్చునేమో కానీ, ఆమెనూ, అభిమానులనూ గిల్లడమే. గతంలో మోదీకి వ్యతిరేకంగా నిలబడి నినదించినా, ఆమెను ఒలింపిక్స్‌కు పంపి తమ పెద్దలు ఎంతో ఉన్నతంగా వ్యవహరించారన్నట్టుగా మరో నాయకురాలు వ్యాఖ్యానించారు. కానీ, సమస్త వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా ఉన్నా తోటి మహిళాక్రీడాకారుల కోసం వినీశ్‌ ఫోగట్‌ అప్పట్లో బరికి ఆవల పాలకులతో పోరాడారు, ఇప్పుడు బరిలో కడవరకూ నిలిచి పోరాడి చూపించారు. ఆఖరుక్షణాల్లో ఓ వందగ్రాముల్లో తేడావచ్చి, ఆమె వెండి బంగారాలతో మెరవకపోవచ్చును గానీ, దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ విజేతగా నిలిచిపోవడం కంటే గొప్ప అవార్డులూ రివార్డులు ఇంకేమి ఉంటాయి?

Updated Date - Aug 08 , 2024 | 03:03 AM