Share News

‘నికోబార్‌’ భయాలు

ABN , Publish Date - Aug 31 , 2024 | 05:43 AM

డెబ్బైరెండువేల కోట్ల రూపాయల ‘గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్ట్‌’ మళ్ళీ చర్చలోకి వచ్చింది. మాజీ పర్యావరణ మంత్రి జైరామ్‌ రమేష్‌కీ, ప్రస్తుత మంత్రి భూపేందర్‌ యాదవ్‌కూ మధ్య ఇటీవల రేగిన వాగ్వాదం పర్యావరణ ప్రేమికులకు మరోమారు ఈ ప్రాజెక్టుమీద తమ భయాలు, అభ్యంతరాలు పంచుకోవడానికి

‘నికోబార్‌’ భయాలు

డెబ్బైరెండువేల కోట్ల రూపాయల ‘గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్ట్‌’ మళ్ళీ చర్చలోకి వచ్చింది. మాజీ పర్యావరణ మంత్రి జైరామ్‌ రమేష్‌కీ, ప్రస్తుత మంత్రి భూపేందర్‌ యాదవ్‌కూ మధ్య ఇటీవల రేగిన వాగ్వాదం పర్యావరణ ప్రేమికులకు మరోమారు ఈ ప్రాజెక్టుమీద తమ భయాలు, అభ్యంతరాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత అప్రదిష్టపాల్జేసినా ఈ ప్రాజెక్టు ఆగదని ప్రభుత్వం అంటోంది. ప్రాజెక్టుకు సంబంధించి వివిధ అంశాలపై తన అభ్యంతరాలు తెలియచేస్తూ పర్యావరణమంత్రికి జైరామ్‌ రమేష్‌ రాసిన సుదీర్ఘ లేఖలను పాలకులు ఏ విధంగా తీసుకున్నప్పటికీ, పర్యావరణ ప్రేమికులు మాత్రం స్వాగతిస్తున్నారు.

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌సీఎస్‌సీఎమ్‌) తన నివేదికలో ప్రస్తావించిన అంశాలను, ఈ ప్రాజెక్టు ఎట్టిపరిస్థితుల్లోనూ కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌–1ఎ లోపలకు విస్తరించకూడదన్న ఆ హెచ్చరికలను, కార్యక్షేత్రంలో అందుకు పూర్తిభిన్నంగా వ్యవహారం సాగుతున్న విషయాన్నీ రమేష్‌ తన లేఖలో ప్రస్తావించారు. ప్రాజెక్టు అమలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎన్ని పగడపు దీవులున్నాయో, అరుదైన తాబేళ్ళు, పక్షుల సంతానోత్పత్తి స్థావరాలు ఎలా ప్రమాదంలో పడ్డాయో వివరించారు. ఈ కీలకమైన, సున్నితమైన ప్రాంతాల వర్గీకరణల్లోనూ, నిర్వచనాల్లోనూ అత్యున్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మార్పుచేర్పులు ప్రజలకు తెలియచేయాల్సి ఉండగా, రక్షణపరంగా కీలకమైన అంశం అంటూ వాటిని దాచిపెడుతున్నారన్నది ఆయన ఆరోపణ. ఈ ప్రాజెక్టులో అధికభాగం ఆర్థిక, వాణిజ్యపరమైనదేనని ఆయన గుర్తుచేస్తున్నారు. ఒకభాగమైన ఓడరేవుకు స్థలాన్ని ఎంపికచేయడంలో కేవలం సాంకేతిక, ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని, పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని నిపుణుల కమిటీ 2021ఏప్రిల్‌ నివేదికలో వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఇతర ప్రాంతాల ప్రజల, పర్యాటకుల రాకపోకల వల్ల ఇక్కడి అరుదైన షోంపెన్‌ తెగలవారి ఉనికికి ముప్పు ఏర్పడటం ఖాయమనీ, స్థానిక ఆదివాసీ తెగల మనోభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించలేదనీ జైరామ్‌ రమేష్‌ చేస్తున్న విమర్శను భూపీందర్‌ యాదవ్‌ కొట్టిపారేస్తున్నారు.


ఈ ప్రాజెక్టుకు మీ మంత్రిత్వశాఖ ఇచ్చిన అన్ని అనుమతులనూ రద్దుచేయండి అంటూ పర్యావరణమంత్రికి జైరామ్‌ రమేష్‌ రాసినలేఖతో మొదలై, అనేకరోజులుగా సాగుతున్న ఈ వివాదం ఇప్పట్లో ముగిసేట్టు లేదు. రాష్ట్రపతి ఏడాదికాలంలో రెండుసార్లు ఇక్కడకు వెళ్ళిరావడం, రక్షణపరంగా, వ్యూహాత్మకంగా ఈ ద్వీపం మనకు ఎంత ముఖ్యమో సైనికాధికారులనుంచి తెలుసుకోవడం పాలకుల పట్టుదలకు నిదర్శనం. ఇక్కడ ఓ నౌకాస్థావరాన్ని ఏర్పాటు చేస్తే చైనామీద కన్నువేయవచ్చునని, కీలకమైన సముద్ర రవాణామార్గాలను నియంత్రించవచ్చునని భారత ప్రభుత్వం ఆలోచన. వ్యూహాత్మకంగా, రక్షణపరంగా ఈ ప్రాజెక్టు మనకు ఎంతోముఖ్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అత్యధికమేలు అస్మదీయులకేనని విపక్షాల అనుమానం. నికోబార్‌ ద్వీపంలో పదిహేనుశాతం అటవీప్రాంతాన్ని ప్రభావితం చేసే ప్రాజెక్టు ఇది. లక్షలాదిచెట్లు కూల్చి, మూడువందల హెక్టార్ల మేరకు సముద్రాన్ని మధించి, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్‌, ఒక టౌన్‌షిప్‌, సౌర విద్యుత్ కేంద్రం అభివృద్ధిచేస్తారు. భారీ నిర్మాణాలకోసం సంవత్సరాల తరబడి డ్రెడ్జింగ్‌, డ్రిల్లింగ్‌, బ్లాస్టింగ్‌లతో ఈ ప్రాంతం దద్దరిల్లబోతున్నది. స్వచ్ఛమైన ఆ నేల, నీరు, గాలి తీవ్రంగా కలుషితం కాబోతున్నాయి. పర్యావరణానికి కానీ, గ్రేట్‌ నికోబార్‌లో ఉన్న ఏకైక తెగ మనుగడకు కానీ ఏ లోటూ ఉండదన్న ప్రభుత్వం వాదనను పర్యావరణవేత్తలు ఎవరూ నమ్మడం లేదు. పర్యావరణం అంశాన్ని పక్కనబెట్టినా, రెండుదశాబ్దాలక్రితం సునామీ తీవ్రతను అధికంగా చవిచూసిన, భూకంపాలకు పుట్టినిల్లయిన ఈ ప్రదేశంలో ఒక నౌకాస్థావరాన్ని నెలకొల్పడం సరైనదేనా అన్నది ప్రశ్న.

Updated Date - Aug 31 , 2024 | 05:43 AM