ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్యూనిస్టు చైనా గుట్టువిప్పిన ‘నిప్పుకణాలు’!

ABN, Publish Date - Aug 10 , 2024 | 05:46 AM

‘గతాన్ని ఎవరైతే నియంత్రిస్తారో వారే భవిష్యత్తునూ నియంత్రిస్తారు. వర్తమానాన్ని ఎవరైతే నియంత్రిస్తారో వారే గతాన్నీ నియంత్రిస్తారు’– జార్జి ఆర్వెల్‌ నవల ‘1984’ లోని సుప్రసిద్ధ వాక్యాలవి. ఈ వ్యాఖ్యలు నియంత స్టాలిన్‌ కాలం నాటి రష్యాను ఉద్దేశించి

‘గతాన్ని ఎవరైతే నియంత్రిస్తారో వారే భవిష్యత్తునూ నియంత్రిస్తారు. వర్తమానాన్ని ఎవరైతే నియంత్రిస్తారో వారే గతాన్నీ నియంత్రిస్తారు’– జార్జి ఆర్వెల్‌ నవల ‘1984’ లోని సుప్రసిద్ధ వాక్యాలవి. ఈ వ్యాఖ్యలు నియంత స్టాలిన్‌ కాలం నాటి రష్యాను ఉద్దేశించి చేసినవి. అయితే ఆర్వెల్‌ సుభాషితం పూర్తిగానో పాక్షికంగానో అధికార పక్షం, దాని అధినేత తమకు అనుకూలంగా ఉండే చరిత్ర కథనాలను వృద్ధులు, యువజనులు; స్త్రీ పురుషులు; ధనికులు, దరిద్రులు... జనాభాలో ప్రతి ఒక్కరిపై రుద్దేందుకు ప్రయత్నించే నిరంకుశ పాలనా వ్యవస్థలు అన్నిటికీ వర్తిస్తుంది.

సాపేక్షంగా బహిరంగ సమాజం (ఓపెన్‌ సొసైటీ)లో పాలకులకు ఆమోదయోగ్యమయ్యే ఏ ఒక్క తరహా చరిత్రను మొత్తం ప్రజలు అందరిపై రుద్దలేరు. ఉదాహరణకు అమెరికాలో రిపబ్లికన్లు అధికారంలో ఉన్నప్నుడు జాతి సంబంధాలు ఎలా ఉండేవో, ఎలా ఉండాలో అన్న విషయమై తమ దృక్పథాన్ని రుద్దడానికి ప్రయత్నించవచ్చు. అయితే జాతి సంబంధిత పరిణామాలను భిన్నంగా అర్థం చేసుకున్నవారు ఆ కథనాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం, సవాల్‌ చేయడం తప్పక జరుగుతుంది. భారత్‌ లాంటి లోపభూయిష్టమైన లేదా పాక్షిక ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా గతాన్ని గురించి ప్రభుత్వ ప్రాయోజిత దృక్పథాలు, కథనాలపై తీవ్ర చర్చలు జరుగుతాయి. ఉదాహరణకు హిందూ–ముస్లిం సంబంధాలపై స్వాభిప్రాయబద్ధమైన కథనాలను ప్రజలకు నివేదించేందుకు మోదీ ప్రభుత్వం తన శక్తియుక్తులు, వనరులు సమస్తాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకున్నది. నవ భారతదేశ నిర్మాణానికి ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చేసిన అనుపమేయమైన కృషిని, ఆయన అనితరసాధ్యమైన సేవలను తక్కువ చేసేందుకు కూడా మోదీ సర్కార్‌ చాలా శ్రద్ధగా నిరంతరం పని చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ వైఖరిని అంగీకరించని, నిర్ద్వంద్వంగా తిరస్కరించే వెబ్‌సైట్‌లు, ప్రచురణ సంస్థలు, యూట్యూబ్‌ చానెల్స్‌, వార్తాపత్రికలు ఎన్నో ఉన్నాయి. ఆ చారిత్రక అంశాలను భిన్నంగా అవగాహన చేసుకున్నవారు ప్రభుత్వ వాదనలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. ఈ స్వతంత్ర ఆలోచనాశీలురను అదుపు చేసే లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వం ఒక కొత్త ‘బ్రాడ్‌ కాస్టింగ్‌ బిల్లు’ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.


ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు అంటూ ప్రజల ఆలోచనలను నియంత్రించడంలో చైనా కమ్యూనిస్టు పార్టీ(సిపిసి)కి సాటిరాగల సంస్థ మరేదీ మన కాలంలో లేదనడం సత్యదూరం కాదు. చైనా గతం, వర్తమానం, భవిష్యత్తు విషయమై చారిత్రక కథనాలు ఎలా ఉండాలన్న దానిపై సిపిసి నాలుగు నిర్దేశాలు చేసింది. అవి: 1) కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ సరైన విధంగానే వ్యవహరిస్తుంది, తప్పు చేయదు. నాయకుడు (ఒకప్పుడు మావో, ఇప్పుడు జిన్‌పింగ్‌) సదా సబబుగా, నిర్దుష్టంగా, అమోఘంగా వ్యవహరిస్తారు; 2) పార్టీ కార్యకర్తలు, అధికారులు, మరీ ముఖ్యంగా మహానాయకుడు రేయింబవళ్లు, ఆరు రుతువులూ చైనా సర్వతోముఖ అభివృద్ధికి అవిరామంగా పనిచేస్తుంటారు. ప్రజలకు సుఖసంతోషాలు సమకూర్చడం, జాతిని సర్వశక్తిమంతం చేయడమే ధ్యేయంగా వారి కార్యకలాపాలు సాగుతాయి; 3) పార్టీని దాని విధానాలను, ఆచరణలను విమర్శించేవారు జాతి శత్రువులు, విదేశాల ప్రోద్బలంతోనే వారు ఆ విమర్శలకు పాల్పడుతున్నారు;

4) ఆ విమర్శలను పార్టీ దృఢంగా, సత్వరమే ఖండించి, విమర్శకులను తొలగించని పక్షంలో 1949లో కమ్యూనిస్టులు, అధికారానికి రాకముందు ఉన్న అల్లకల్లోల పరిస్థితులు పునరావృతమవుతాయి. విభజనలు, అంతర్యుద్ధంతో దేశం అతలాకుతలమవుతుంది. పాశ్చాత్య దేశాల దుష్ట ప్రభావంలోకి మళ్లీ వెళుతుంది.

చరిత్రపై పార్టీ దృక్పథానికి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడమనేది అమెరికాలో వలే కాదుకదా భారత్‌లో కంటే కూడా చైనాలో చాలా చాలా కష్టం. 1949 నుంచి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నవారు, మాట్లాడుతున్నవారు ఉద్యోగాల నుంచి తొలగించబడడం, అరెస్ట్‌ కావడం చిత్ర హింసలకు గురవడం, అంతిమంగా చంపివేయబడడం చాలా సాధారణమైపోయింది. అటువంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న, ఆధునిక చైనా చరిత్ర, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర గురించి అధికారిక వాదనలకు భిన్నమైన కథనాలను ప్రజలకు నివేదించేందుకు సాహసించిన కొంతమంది మేధావులు, కళాకారులు, విద్యావేత్తలు, సృజనశీలురు గురించి ఇటీవల ఒక పుస్తకం విశాల ప్రపంచానికి తెలియజేసింది. చైనాలో సుదీర్ఘకాలం విలేఖరిగా పనిచేసి చివరకు బీజింగ్‌ పాలకులచే బహిష్కరణకు గురైన పాత్రికేయుడు, రచయిత ఇయాన్‌ జాన్సన్‌ రాసిన. ‘Sparks: China's Underground Historians and their Battle for the Future’ గురించి నేను ప్రస్తావిస్తున్నాను.


మనస్తత్వంలో చంచల స్వభావం, హంతక ప్రవృత్తి మిళితమై ఉన్న విలక్షణ నాయకుడు మావో. 1956లో వివిధ అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వేయి పువ్వులు వికసించాలని, వేయి ఆలోచనలు వర్ధిల్లాలని ఆయన నినదించారు. చైనా ప్రజలు మావో పిలుపునకు ప్రతిస్పందించారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయసాగారు. దీంతో మావో తన మాట మార్చారు. తన విజ్ఞప్తిని ఉపసంహరించుకున్నారు. మితవాద ధోరణుల వ్యతిరేక పోరాటం పేరిట రచయితలు, విద్యార్థులు, న్యాయవాదులు, మేనేజర్లు, సివిల్‌ సర్వెంట్లు, శాస్త్రవేత్తలను, ఇంతెందుకు సొంతంగా ఆలోచించగల సామర్థ్యమున్న వారిని తీవ్ర ఇక్కట్లపాలు చేశారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, పరిశోధన కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. వేలాది బుద్ధిజీవులను నిర్బంధ శ్రమ శిబిరాలకు తరలించారు. మిగిలిన వారిని లొంగదీసుకుని, అణచి వేశారు. పార్టీ ఆదేశాలను సర్వత్రా ప్రతి ఒక్కరూ పాటించేలా చేశారు.

జాన్సన్‌ విపులంగా రాసిన అజ్ఞాత చరిత్రకారులలో చాలా మంది జైలుపాలయిన లేదా చంపివేయబడ్డ వారి బిడ్డలు లేదా తోబుట్టువులే. ఆప్తులు, ఆత్మీయులను కోల్పోయిన బాధే కమ్యూనిస్టు పాలనలోని చీకటి కోణాలను ప్రజలకు నివేదించేలా వారిని పురిగొల్పాయి. గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌, సాంస్కృతిక విప్లవం, టిబెట్ ఆక్రమణ, ‘మహానాయకుడు’ రూపొందించి స్వీయ పర్యవేక్షణలో అమలుపరిచిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల వాస్తవాల గురించి తమ రచనల ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు వారు సాహసించారు. జాన్సన్‌ పేర్కొన చరిత్రకారులు, ఇతర మేధావులలో చాలా మంది 21వ శతాబ్ది తొలి దశకంలో చురుగ్గా ఉన్నవారు. అప్పట్లో అసాధారణ బహిరంగతత్వం అమల్లో ఉండేది. ఇంటర్నెట్‌ వారికొక ఆలంబనగా ఉండేది. ఆ మీడియం ద్వారా వారు తమ రచనలు, సినిమాలకు స్వేచ్ఛగా పరిమిత స్థాయిలో ప్రాచుర్యం కల్పించారు. మరికొంత మంది 1980ల నుంచి క్రియాశీలంగా ఉన్నారు. ఆ దశకంలో వర్ధిల్లిన కళా, సృజనాత్మక స్వేచ్ఛ 1989లో జూన్‌లో తియనాన్మెన్ స్క్వేర్‌ ఊచకోతలతో ముగిసింది.

2012లో జిన్‌పింగ్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ స్వతంత్ర చరిత్రకారుల మేధోకృషికి పరిస్థితులు మరింత ప్రతికూలమయ్యాయి. జిన్‌పింగ్‌ అధికారానికి వచ్చిన తొలి రోజులలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రను సాధ్యమైనంతగా ఒక మహోజ్వల గాథగా ప్రజలకు నివేదించేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి, లక్ష్య నిర్దేశం చేశారు. ఇందుకు చాలా పెద్ద సంఖ్యలో చరిత్రకారులను నియోగించారు. కమ్యూనిస్టు పార్టీ ‘మహా విజయాలు, అద్వితీయ సాఫల్యాల’ను సువర్ణాక్షరాలతో లిఖించాలని వారిని ఆదేశించారు. మావో కాలంలో వలే జిన్‌పింగ్‌ హయాంలో కూడా స్వతంత్ర మేధావుల కష్టాలు మిక్కుటమయ్యాయి. అయినప్పటికీ కొంతమంది మేధావులు ఆ పరిస్థితులకు ధైర్య సాహసాలతో ఎదురీదారు. జాన్సన్‌ ఇలా రాశారు: ‘నిజమేమిటంటే చైనా స్వతంత్ర చింతన సజీవంగా ఉన్నది. అది ఎప్పుడూ నామరూపాలు లేకుండా పోలేదు’. ‘కమ్యూనిస్టు పార్టీయే ఎల్లప్పుడూ గెలవలేదు’ అనే సత్యాన్ని కొంతమంది రచయితలు, జర్నలిస్టులు, కళాకారులు, సినిమా స్రష్టలు ప్రజలకు చెప్పడాన్ని కొనసాగిస్తారు.

జాన్సన్‌ ‘నిప్పు కణాలు’ నన్ను అప్రతిభుడిని చేశాయి. ఆ స్వతంత్ర చరిత్రకారుల నైతిక స్థైర్యం, భౌతిక ధైర్యమే కాదు వారి మేధా స్పష్టత కూడా నన్ను ఆశ్చర్యపరిచింది. కమ్యూనిస్టు చైనాలో చరిత్ర రచన, బోధన గురించి జియాంగ్‌ జుయె అనే రచయిత్రి ఏమన్నారో చూడండి: ‘మావో, మనం చరిత్రను పునర్లిఖించాలని అన్నారు. అయితే చరిత్ర సంభవించింది. తిరిగి రాయడానికి అదొక నవల కాదు. దానినెలా మీరు తిరిగి రాయగలరు? ధర్మాధర్మ విచక్షణ ఉన్నవారెవరైనా సరే తిరగరాసిన చరిత్రను తిరస్కరించి తీరుతారు’. ఝాంగ్‌ షిహె అనే పాత్రికేయుడు ఇలా అన్నాడు: ‘ఏదైనా ఒక అపకారం ప్రజలకు జరగడాన్ని చూసినప్పుడు నిజంగా ఆగ్రహం చెందే వ్యక్తులలో నేనూ ఒకరిని. తత్కారణంగా ఆ యథార్థ ఘటనల గురించి మాట్లాడాలి గనుక నేను భిన్న దృక్పథంతో రాస్తున్నాను’. విద్యావేత్త అయిన చెన్‌ హింగ్యుయో ఇలా ఎత్తి పొడిచారు: ‘‘మన కాలం రాజకీయాలు ‘గుడ్డివాళ్లను ముందుకు తీసుకువెళుతున్న ఉన్మాదుల’ తరహా వ్యక్తులవి కావూ?’’ మళ్లీ జియాంగ్‌ జుయె వద్దకు వెళదాం: ప్రత్యామ్నాయ రీతిలో నీవు చేస్తున్న చరిత్ర రచనా కృషి వ్యర్థమైనది, అసంగతమైనది. కమ్యూనిస్టు చైనా లాంటి నిరంకుశ పాలన వ్యవస్థ ఉన్న సమాజంలో ఆ చరిత్ర ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు అన్న తన స్నేహితురాలి ఆక్షేపణకు జుయె ఇలా ప్రతిస్పందించారు. ‘నేను విభేదిస్తున్నాను. భిన్న దృక్పథంతో రాయడానికి ప్రయత్నిస్తే అది ప్రాధాన్యం పొందుతుంది. ఒక విపరీత సమాజంలో ఒక మామూలు వ్యక్తిగా నేను ఉండదలిచాను. సత్యసమ్మతమైన విషయాలను నేను చెప్పదలుచుకున్నాను. నా హృదయంలోని ఘోషలను వ్యక్తం చేయాలన్నదే నా ఆరాటం’.

ప్రజల ఆలోచనలను నియంత్రించడంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి సాటి రాగల సంస్థ మరేదీ మన కాలంలో లేదు. కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నవారు, మాట్లాడుతున్న వారు చంపివేయబడడం సర్వసాధారణం. ఆ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న, అధికారిక వాదనలకు భిన్నమైన కథనాలను ప్రజలకు నివేదించేందుకు సాహసించిన కొంతమంది మేధావులు, విద్యావేత్తల గురించి ఇటీవల ఒక పుస్తకం విశాల ప్రపంచానికి తెలియజేసింది. ఆప్తులు, ఆత్మీయులను కోల్పోయిన బాధే కమ్యూనిస్టు పాలనలోని చీకటి కోణాలను ప్రజలకు నివేదించేలా వారిని పురిగొల్పాయి.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Aug 10 , 2024 | 05:46 AM

Advertising
Advertising
<