Share News

ఇది సరికాదు...!

ABN , Publish Date - Jul 31 , 2024 | 01:49 AM

గతకాలపు ప్రణాళికాసంఘం మీద కూడా అప్పట్లో రాజకీయ విమర్శలు రాకపోలేదు కానీ, దానిని చరిత్రలో కలిపేసి నీతి ఆయోగ్‌ తెచ్చిన తరువాత దీని చుట్టూ సాగుతున్న రాజకీయం మరీ భరించలేనంతగా ఉంది. శనివారం నాటి నీతి ఆయోగ్...

ఇది సరికాదు...!

గతకాలపు ప్రణాళికాసంఘం మీద కూడా అప్పట్లో రాజకీయ విమర్శలు రాకపోలేదు కానీ, దానిని చరిత్రలో కలిపేసి నీతి ఆయోగ్‌ తెచ్చిన తరువాత దీని చుట్టూ సాగుతున్న రాజకీయం మరీ భరించలేనంతగా ఉంది. శనివారం నాటి నీతి ఆయోగ్ సమావేశానికి పదిరాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతంనుంచి ప్రాతినిధ్యం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాష్ట్రాల అభివృద్ధి, కేటాయింపులు, కోటాలూ వాటాలూ ఇత్యాది కీలకమైన అంశాలను నిర్ణయించే ఓ ముఖ్యమైన సమావేశానికి విపక్షపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా గైర్హాజరుకావడానికి వారు చెబుతున్న ప్రధాన కారణం ఇటీవలి బడ్జెట్‌ కేటాయింపుల్లో తమకు ఉద్దేశపూర్వకంగా తీరని అన్యాయం చేశారని. మిగతావారిలాగా కాక మమతాబెనర్జీ ఈ సమావేశానికి హాజరైనారు కానీ, ఆ తరువాత బాయ్‌ కాట్‌ చేశారు. తనను ఐదునిముషాలు మాత్రమే మాట్లాడనిచ్చారని, బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చెప్పబోతుండగా మైక్‌ కట్‌చేశారని ఆమె ఆరోపించారు. నీతి ఆయోగ్ సమావేశాలను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న బీజేపీ విమర్శ పూర్తిగా కొట్టిపారేయలేనిది. మమత మాదిరిగానే ఆ సమావేశానికి హాజరై కూడా వారు తమ ఆగ్రహాన్నో, అసమ్మతినో వ్యక్తపరిస్తే సరిపోయేది. అది జరగకపోగా, విపక్షపార్టీకి చెందిన ఒకేఒక్క నాయకురాలు సమావేశానికి హాజరై తాను మాట్లాడుతూంటే మైక్‌ కట్‌చేశారని ఆరోపించడం ఆశ్చర్యకరమైన విషయం. లోపల ఏమి జరిగిందో తెలియదుకానీ, ఆమె చేసిన పలు ఆరోపణలను ఖండిస్తూ ఓ పూర్తిభిన్నమైన వివరణ ఒకటి ఆ తరువాత ప్రభుత్వం నుంచి వెలువడింది. నీతి ఆయోగ్ ను రద్దుచేసి, ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని మమత ఎందుకు డిమాండ్ చేశారన్నది అటుంచితే, ఈ రాజకీయ వైరంలో ఈ సంస్థ ప్రతిష్ఠ క్రమంగా దిగజారిపోతున్నమాట నిజం.


పశ్చిమబెంగాల్‌ ఉత్తరప్రాంతాలను ఈశాన్య ప్రాంత అభివృద్ధిశాఖ పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి సుకాంత ముజుందార్‌ ఇటీవల చేసిన ప్రతిపాదన తృణమూల్‌కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ప్రతీకారంగా మమత ఈ సమావేశానికి హాజరై ఏకంగా నీతి ఆయోగ్‌ రద్దునే డిమాండ్‌ చేశారని అంటారు. బెంగాల్‌ ఉత్తరాది ప్రాంతాలకు ఈశాన్యంతో చాలా సామీప్యం ఉంటుందని, అవి అభివృద్ధి చెందాలంటే కేంద్రప్రభుత్వ అధీనంలోని తన మంత్రిత్వశాఖలోకి రావాలని ఆ బీజేపీ నాయకుడు ప్రధానికి స్వయంగా ప్రతిపాదించడం సహజంగానే వివాదాన్ని రేపింది. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ సగానికి సగం సీట్లను గెల్చుకున్నది ఉత్తర బెంగాల్‌ నుంచే. దానిని రాష్ట్రంగానో, కేంద్రపాలిత ప్రాంతంగానో చేయాలని బీజేపీ నాయకులు అప్పుడప్పుడు డిమాండ్‌ చేస్తూ, తమకు అనాదిగా అన్ని విధాలా అన్యాయం జరుగుతున్నదన్న ఆ ప్రాంతవాసుల భావనను సజీవంగా ఉంచుతూ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తుంటారు. మమతను గద్దెదించడం అసాధ్యమని తేలిపోవడంతో రాష్ట్రాన్ని నిలువునా చీల్చే దిశగా బీజేపీ కుట్రపన్నుతోందని టీఎంసీ దీనితో భగ్గుమన్నది. రాష్ట్రాన్ని చీల్చే ఆలోచన మాకు లేదు కానీ, రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఉత్తరబెంగాల్‌కు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమని సువేందు అధికారి ఓ వివరణ ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌కు కేంద్ర బడ్జెట్లో ఎంత అన్యాయం జరిగిందో చెప్పి, మీ రాజకీయం కోసం మా రాష్ట్రాన్ని చీల్చుతారా అని హెచ్చరించేందుకు నీతి ఆయోగ్‌ సమావేశాన్ని మమత ఉపయోగించుకున్నారు.


గతకాలపు ప్రణాళికా సంఘంలో లోపాలు లేవని ఎవరూ అనడం లేదు. కానీ, రాష్ట్రాలతో సంప్రదింపులు, వివిధరకాల కేటాయింపుల విషయంలో దాని నిర్ణయాలకు, సూచనలకు ఎంతోకొంత విలువ ఉండేది. ఇప్పుడు పెత్తనమంతా ఆర్థికశాఖదే కనుక, నీతి ఆయోగ్‌ ఓ సలహాసంఘంగా మిగిలిపోయింది. సహకార సమాఖ్య విధానానికి దారులు పరుస్తుందని తెచ్చిన వ్యవస్థ కేంద్ర సర్కారు చేతులో కీలుబొమ్మని విమర్శలు ఎదుర్కొంటోంది. నీతి ఆయోగ్‌ను రద్దుచేసి, ప్రణాళికాసంఘాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ ఎలాగూ ఇప్పట్లో నెరవేరేది కాదు కానీ, దాని పనిపద్ధతులను మెరుగుపరచి, రాష్ట్రాలతో విస్తృతమైన సంప్రదింపులతో, వాటి అధికభాగస్వామ్యంతో దానిని తీర్చిదిద్దడం ముఖ్యం. బీజేపీ, విపక్షాలు తమ రాజకీయ యుద్ధాన్ని ఇక్కడివరకూ తేవడం సముచితం కాదు. రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించకుండా రాజకీయ ప్రయోజనాలకు వేదికగా ఉపయోగించుకోవడం ప్రజలు హర్షించరు.

Updated Date - Jul 31 , 2024 | 01:49 AM