వయనాడ్ విలాపం
ABN , Publish Date - Aug 01 , 2024 | 05:06 AM
కేరళలోని వయనాడ్‌జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏకంగా గ్రామాలకు గ్రామాలు ఆనవాళ్ళు లేకుండా పోయాయి. వందలాది ఇళ్ళు...
కేరళలోని వయనాడ్‌జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏకంగా గ్రామాలకు గ్రామాలు ఆనవాళ్ళు లేకుండా పోయాయి. వందలాది ఇళ్ళు నేలమట్టమై, మొత్తం కుటుంబాలు ప్రాణాలు వదిలేసిన ఘోర విషాదం ఇది. బురదలో చిక్కుబడిన మృతదేహాలను వెలికి తీయడం అత్యంత కష్టమైపోతున్నది. వందలాదిమందిని ఒకేసారి ముంచేసిన ఈ అతిపెద్ద విపత్తులో సహాయకచర్యలు మరింత కాలం కొనసాగక తప్పదు.
విపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలను సమస్యలు వెంటాడినప్పుడు కేంద్రమంత్రుల స్పందన సామాన్యంగా ఉండదు. గత చరిత్రనంతా తవ్వితీసి అక్కడి పాలకులు అసమర్థులనీ, బధిరులనీ విరుచుకుపడతారు. విషాద సమయాల్లో ఈ తుచ్ఛరాజకీయాలేమిటని ఉపన్యాసాలు ఇస్తూనే వయనాడ్ దారుణంమీద కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు రాజకీయ యుద్ధం చేసుకుంటున్నాయి. భయంకరమైన వర్షాలు పడతాయనీ, కొండచరియలు విరిగిపడి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయనీ ఎంతో ముందుగా హెచ్చరించినా పినరయ్ ప్రభుత్వం పెడచెవినపెట్టిందని హోంమంత్రి దాడికి దిగారు.
ఆయన మాటలు కేంద్రప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి పరిమితం కాలేదు. తాము హెచ్చరించినా రాష్ట్రప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు, ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నదని చెప్పినా సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా వారి కర్మానికివారిని వదిలివేసినట్టు ఆయన వ్యాఖ్యలు అర్థాన్నివ్వడంతో పినరయ్ సమర్థింపులతో పాటు విమర్శలకు కూడా దిగారు. ఎవరిది నిజం అన్న ప్రశ్నను అటుంచితే, భారీ వర్షాలు కురుస్తాయని కేంద్రం వారం ముందుగానే హెచ్చరించివుండవచ్చు, ఎన్డీఆర్‌ఎఫ్‌ను సైతం పంపివుండవచ్చు కానీ, ఒక్కసారిగా హెచ్చిన ముప్పును ముందుగా అంచనావేయడం కష్టమైన విషయమే. కేంద్రం తన హెచ్చరికలో పేర్కొన్న వర్షపాతానికీ, కొద్దిగంటల్లోనే కురిసిన కుంభవృష్టికీ హస్తిమశకాంతరం ఉన్నది. ఆ మూడు రంగుల హెచ్చరికలు తమకు ఏయే దశలో ఎప్పుడెప్పుడు అందాయో, అప్పటికే అక్కడ జరిగిందేమిటో పినరయ్ వివరించారు. అంతమాత్రాన రుతుపవనాల కాలంలో ప్రతీ హెచ్చరికనూ తీవ్రంగా తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించలేదు.
కేరళలోని పద్నాలుగు జిల్లాలో పదిజిల్లాలు కొండచరియలు విరిగిపడే ప్రమాదం అధికంగా ఉన్నవి. ఏడేళ్ళకాలంలో దేశం మొత్తం మీద 3782ఘటనలు జరిగితే, అందులో 2239 ఘటనలు కేరళలోనే జరిగాయి. ఏటా కేరళలోని ఏదో ఒకజిల్లాలో కొండచరియలు విరిగిపడి కొందరు మరణించడం జరుగుతూంటుంది. వర్ష విషాదాలు దానిని వెన్నాడుతూనే ఉంటాయి. 2018 ఆగస్టులో వర్ష బీభత్సం వందలాది ప్రాణాలు తీసింది, లక్షలమందిని పునరావాస శిబిరాలకు తరలించాల్సివచ్చింది. ఒక ఏడాది రాష్ట్ర బడ్జెట్ అంత ఆర్థిక నష్టాన్ని మిగల్చిన విషాదం ఇది.
వయనాడ్‌లో ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు నేలమట్టమైపోయాయి. పెను విషాదం కమ్మేసిన ఈ ప్రాంతాలన్నీ పర్యాటకులు మెచ్చినవే. పెరుగుతున్న పర్యాటకం, తదనుగుణంగా సాగుతున్న భారీ నిర్మాణాలు సున్నితమైన ఈ ప్రాంతాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నమాట నిజం. ఆచరణకు దూరంగా మిగిలిపోయిన గాడ్గిల్ కమిటీ నివేదికలను ఇలాంటి విషాదాలు సంభవించినప్పుడల్లా స్మరించుకోవడం వినా ఏమీ జరగడం లేదు. ప్రకృతితో చెలగాటం ఎంతప్రమాదకరమో, వాతావరణమార్పు ఎంతటి ఉపద్రవాన్ని సృష్టిస్తుందో ఈ ఘటన గుర్తుచేస్తోంది. వేడెక్కిన అరేబియా సముద్రం కుంభవృష్టికీ ఎడతెగని భారీ వర్షాలకూ కారణమవుతోంది. ఒక ఆనకట్ట ఒక్కసారిగా బద్దలైనట్టుగా ఏకంగా ఎనిమిదికిలోమీటర్ల మేరకు కొండచరియలు కొట్టుకురావడం, భారీ పరిమాణంలో నీరూ, బురదా ప్రజలను సజీవంగా కప్పివేయడం ఇప్పటివరకూ అరుదు.
బిల్లులు సమర్పించలేదనీ, నిధులు సక్రమంగా వినియోగించలేదనీ అభ్యంతరాలు వెలిబుచ్చుతూ నిధుల విడుదలలో అడపాదడపా ఆటంకాలు కల్పిస్తున్న కేంద్రప్రభుత్వం ఈ విషాదసమయంలో కేరళపట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వయనాడ్ ఘోరాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న విపక్షపార్టీల అభ్యర్థనను పరిశీలించి, కేరళను భారీ ఆర్థికసాయంతో ఆదుకోవాలి. మిగతారాష్ట్రాలు తమకు తోచిన సాయం చేస్తున్నాయి, ధనికులూ ప్రముఖులూ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ సహా, అన్ని రకాల సహాయసహకారాలు ఉంటాయని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం తక్షణమే నిధుల విడుదలతో ఈ కష్టంనుంచి బయటపడేవరకూ రాష్ట్రాన్ని కాపుగాయాల్సిన అవసరం ఉంది.