Share News

బంగ్లా పయనం ఎటు?

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:35 AM

బంగ్లాదేశ్‌లో పరిణామాలు ఇంతవేగంగా మారిపోతాయని, ముగింపు ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఆమె తండ్రి, బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజబుర్‌ రహ్మాన్‌ యాభైయేళ్ళక్రితం...

బంగ్లా పయనం ఎటు?

బంగ్లాదేశ్‌లో పరిణామాలు ఇంతవేగంగా మారిపోతాయని, ముగింపు ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఆమె తండ్రి, బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజబుర్‌ రహ్మాన్‌ యాభైయేళ్ళక్రితం స్వదేశంలో హత్యకు గురైన విషయాన్ని గుర్తుచేసుకుంటే, హసీనా ఆమేరకు అదృష్టవంతురాలే. పదిహేను సంవత్సరాలు దేశాన్ని నిరవధికంగా, ఓ నియంతలాగా ఏలిన ఆమె ఇక తనకు పదవి కంటే ప్రాణం ముఖ్యమని తేల్చుకోవాల్సి వచ్చింది. హడావుడిగా దేశం నుంచి నిష్క్రమించాల్సివచ్చింది. రాజీనామా చేసిన గంటలోగా అప్పటికే పెట్టాబేడాతో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్‌ ఎక్కి దేశ సరిహద్దులు దాటిపోయారామె.

గత మూడువారాలుగా బంగ్లాదేశ్‌ తీవ్ర హింసాకాండ చవిచూసింది. భద్రతాబలగాలు, అధికారపార్టీ కార్యకర్తలు కలసికట్టుగా యువకులమీద సాగించిన అకృత్యాలు, మూడువందలమందిని నడిరోడ్డుమీద కాల్చిచంపేసిన దారుణాలు ఆమెకు ఎంతో చెడ్డపేరు తెచ్చాయి. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పైశాతం మేరకు రిజర్వేషన్లు కల్పించిన అంశం ఈ మొత్తం ఉపద్రవానికి తక్షణ కారణం. తన తండ్రి హయాంలో ఆరంభమైన ఆ రిజర్వేషన్లు అనంతరకాలంలో ఎన్నో మలుపులు తిరిగి, తప్పుదోవలుపట్టి, కొంతమేరకు బలహీనపడినప్పటికీ, వీటి విషయంలో యువతరంతో ఆమె ఏ స్థాయిలో యుద్ధం చేశారో తెలియంది కాదు. హైకోర్టు తీర్పుతో తిరిగిరగిలిన ఆ చిచ్చు సుప్రీంకోర్టు ఆదేశాలతో నిజానికి చల్లారాలి.


కానీ, అందుకు భిన్నంగా హసీనా గద్దెదిగాలన్న లక్ష్యంతో, దిగేంతవరకూ ఆగకుండా సాగడం విశేషం. కోటా వ్యతిరేక ఉద్యమం వెనుక విపక్ష బీఎన్పీ, ఇస్లామిస్ట్‌ శక్తుల రాజకీయ కుట్ర ఉన్నదని ఆమె ఆరోపణ. హైకోర్టు తీర్పు వెనుక ఆమె పాత్ర ఉన్నదని అనుకున్నప్పటికీ, ఆ తీర్పును రద్దుపరచి కోటాలన్నింటినీ బాగా కుదించడం ద్వారా సుప్రీంకోర్టు అటు ఉద్యమకారులకు, ఇటు హసీనాకు కూడా న్యాయం చేసింది. కానీ, ఆ తీర్పు అమలుజరిగే వరకూ పోరాడుతూనే ఉంటామని, హసీనా క్షమాపణ చెప్పాలనీ, మృతులకు న్యాయం చేయాలనీ, చివరకు ఆమె దిగిపోవాలనీ ఇలా ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లతో ఆ ఉద్యమం కొనసాగడం విచిత్రం. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆమె ఏకంగా దేశంలో అతిపెద్ద మతపార్టీ జమాత్‌–ఎ–ఇస్లామీ మీద నిషేధం విధించడానికి సిద్ధపడటం పరిస్థితులను మరింత దిగజార్చింది.

హసీనా లేని బంగ్లాదేశ్‌తో భారత్‌ ఇకపై చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇస్లామిస్టులను సంతృప్తిపరచడం కోసం హసీనా తనను దేశంనుంచి గెంటేశారని, ఇప్పుడు ఆ ఇస్లామిస్టులే హసీనాను దేశంనుంచి గెంటేశారని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఓ వ్యాఖ్య చేశారు. అధికారంలోకి వచ్చిన సైన్యం ఎలా వ్యవహరిస్తుందో, విపక్ష బీఎన్పీ, జమాత్‌–ఎ–ఇస్లామీ ఏమేరకు చక్రం తిప్పుతాయో చూడాలి. మిగతా ఇస్లామిక్ పార్టీలూ కలసి ఈ రెండూ, ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సైన్యం కృషి చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇలా జరిగినా, జరగకపోయినా భారతదేశం ఇకపై గతంలో మాదిరిగా ప్రశాంతంగా ఉండలేదు. మతఛాందసశక్తులను నియంత్రణలో ఉంచుతూ, అటువంటివారినుంచి మనకు ముప్పులేకుండా హసీనా ఇంతకాలమూ చూసుకున్నారు.


గత పదిహేనేళ్ళుగా మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నది 2001–2006 మధ్యకాలంలో మనం ఎదుర్కొన్న సమస్యలను బట్టి అర్థంచేసుకోవచ్చు. బీఎన్పీ–జమాతే కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగిన ఆ ఐదేళ్ళలో అనేక ఇస్లామిక్‌ సంస్థలు పురుడుపోసుకున్నాయి, పాకిస్థాన్‌ పోషించిన ఉగ్రవాద సంస్థలు మనదేశంలో విధ్వంసకాండకు పాల్పడ్డాయి. హసీనా అధికారంలోకి రాగానే ఇటువంటి శక్తులను ఏరివేశారు, ఉరితీశారు. ఇప్పుడు గతంలో మాదిరిగా బీఎన్పీ–జమాతే కూటమి అధికారంలోకి వస్తే అవే పరిణామాలు మనం చూడాల్సిరావచ్చు. బంగ్లాదేశ్‌లోని వేలాదిమంది హిందువుల భవితవ్యం ఎలా ఉండబోతున్నదో ఇప్పటికే కొన్ని సంఘటనలు తెలియచెబుతున్నాయి.

‍హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో చాలా శక్తులు ఏకమైనాయి. ఈ సంక్షోభం వెనుక పాకిస్థాన్‌, చైనాలున్నాయన్న విశ్లేషణలను అటుంచితే, అమెరికా కూడా తనవంతుగా ఓ చేయివేసిందన్నది నిజం. బైడెన్‌ ప్రభుత్వం విలన్‌ పాత్ర కాకున్నా, ఒక బలమైన విపక్షపాత్ర పోషిస్తుంటే, హసీనాను నిలబెట్టడానికి మనం చేయవలసినంత చేయలేదన్న విమర్శలు కూడా ఈ సందర్భంలో రావడం సహజం.

Updated Date - Aug 06 , 2024 | 06:53 AM