‘లంక’ ఎటువైపు?
ABN , Publish Date - Aug 23 , 2024 | 05:40 AM
బంగ్లాదేశ్ పరిణామాల తరువాత, మాల్దీవులూ మారిపోయాక, శ్రీలంక అయినా అక్కడి ఎన్నికల అనంతరం మనవైపు ఉంటుందా? వచ్చేనెల 21న అక్కడ జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో విజేతను బట్టి ఆ
బంగ్లాదేశ్ పరిణామాల తరువాత, మాల్దీవులూ మారిపోయాక, శ్రీలంక అయినా అక్కడి ఎన్నికల అనంతరం మనవైపు ఉంటుందా? వచ్చేనెల 21న అక్కడ జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో విజేతను బట్టి ఆ దేశం తన రెండు బలమైన పొరుగుదేశాలైన ఇండియా, చైనాల్లో ఎటువైపు మొగ్గుతుందో తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దౌత్యసంబంధాలమీద ఆ కుర్చీలో కూర్చోబోయేవారి ప్రభావం కాదనలేనిది. తీవ్ర ఆర్థికసంక్షోభంతో దేశం కుప్పకూలిపోయి, జనం ఆగ్రహావేశాలతో వీధుల్లోకి వచ్చి, అధ్యక్షభవనంలోకి చొచ్చి, పెత్తనం చెలాయిస్తున్న రాజపక్సలను పలాయనం చిత్తగించేట్టు చేసిన దృశ్యాలను ఎప్పటికీ మరిచిపోలేనివి. ఇప్పుడు అధ్యక్షపదవికి పోటీపడుతున్న 39మందిలో, ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేర్లలో రాజపక్స వారసుడు, మహీంద రాజపక్స కుమారుడు నమల్ కూడా ఒకరు. తమిళపులులను ఊచకోతకోసి, తమిళులపై అఘాయిత్యాలు చేయించి, యుద్ధకాలం నాటి వీరుడిగా పేరొందిన మహీంద రాజపక్స మీద ప్రజల్లో ఇంకా ఎంతో గౌరవం, మోజు ఉన్నందున నమల్ తప్పక నెగ్గుతాడని ఆయన పార్టీ శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ నమ్ముతోంది. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి) తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడుతున్నారు. ప్రేమదాస, దిస్సనాయకే వారసులు కూడా బరిలో ఉన్నందున సమధికోత్సాహానికి లోటేమీ లేదు.
రెండేళ్ళక్రితం దివాలాతీసి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇచ్చిన భారీ అప్పుతో గాడినపడుతున్న దేశాన్ని కొత్తపాలకుడు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. దానితోపాటు, ఎవరితో ఎక్కువ సాన్నిహిత్యాన్ని నెరపాలో కూడా నిర్ణయించుకోవాలి. రణిల్ బాధ్యతలు స్వీకరించిన సందర్భం వేరు కనుక, అందరితోనూ చక్కగా ఉంటూ కష్టాల్లో ఉన్న దేశాన్ని కాస్తంత ఒడ్డునపడేశారు. ఆయన భారతదేశానికి సన్నిహితుడని అక్కడివారు నమ్ముతారు. భారతదేశంతో కరెన్సీ ఒప్పంద ఆలోచనలు, అప్పులు, పెట్టుబడులు సాధించడంతో పాటు, నిబంధనలకు అతీతంగా అదానీకి మేలుచేశారన్న విమర్శలను కూడా అక్కడి విపక్షంనుంచి ఆయన ఎదుర్కొన్నారు. అదానీకి అడ్డుతోవలో వివిధ ప్రాజెక్టులు అప్పగించారన్న ఆరోపణలను ప్రధానంగా చేసిన సజిత్ ప్రేమదాస కూడా ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ, భారత్, చైనాల్లో దేనినీ కాదనగలిగే స్థితిలో శ్రీలంక లేదన్నమాట వాస్తవం. రుణభారం మోయలేక, చెల్లింపులు చేయలేక చైనా నిర్మిత హంబన్‌టోటా ఓడరేవును ఆదేశానికే 99సంవత్సరాల లీజుకు 2017లో ఇచ్చేసినప్పుడు ప్రధాని స్థానంలో ఉన్నది విక్రమసింఘే. రణిల్ తిరిగి అధ్యక్షుడైతే భారత్‌కు కొత్త సమస్యలేమీ ఉండకపోవచ్చు కానీ, భారత వ్యతిరేకి, చైనా పూర్తి అనుకూల ఎన్‌పీపీ నేత అనుర కుమార దిస్సనాయకే పోటీపడటంతో పాటు మంచి ఊపుమీద ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాదిన్నరగా జరపకుండా రణిల్ విక్రమసింఘే చట్టవ్యతిరేకంగా వ్యవహరించారంటూ శ్రీలంక సుప్రీంకోర్టు గురువారం తీవ్రంగా తప్పుబట్టింది. కేవలం డబ్బులేదన్న కారణంతో ఎన్నికలు వాయిదావేయడమేమిటని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విమర్శించినప్పటికీ, ఎన్నికలు జరపనందుకు తాను ఏమాత్రం చింతించడం లేదని ఆయన చెప్పుకున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక, ఆహారం, చమురు, విద్యుత్ ఇత్యాదివి కరువై దేశం అల్లాడిపోతున్న స్థితిలో ఓటుహక్కు కంటే జీవించే హక్కుకు తాను అప్పట్లో ప్రాధాన్యం ఇచ్చానని ఆయన ఓ బహిరంగసభలో సమర్థించుకున్నారు. సర్వశక్తిమంతులమని అనుకున్న రాజపక్స కుటుంబీకులను రెండేళ్ళక్రితం సింహళులు, తమిళులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు చేయీచేయీ కలిపి దేశంనుంచి తరిమికొట్టిన విషయం తెలిసిందే. మతాలు, మూలాలతో సంబంధం లేకుండా దేశప్రజలంతా ఒక్కటైన సందర్భం అది. దీనికి సరిగ్గా మూడేళ్ళ ముందు ఈస్టర్ సందర్భంగా అక్కడ జరిగిన పేలుళ్ళలో 250మంది మరణించడం ప్రజల మనసులమీద పనిచేసి, రాజపక్స సోదరుల మాటలు నమ్మి వారిని అందలం ఎక్కించారు. కానీ, దొరికినచోటల్లా అప్పుతెచ్చిన సొమ్మును దుర్వినియోగం చేయడం, చేసిన అప్పులు తీర్చకపోవడం, ఉన్నపళంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు దేశాన్ని మళ్ళించడం వంటి అనేకానేక తప్పుడు నిర్ణయాలతో ఈ సోదరులు దేశాన్ని ముంచేశారు. తిండిగింజలు కూడా లేని ఆ దశనుంచి దేశం క్రమంగా తేరుకుంటున్న స్థితిలో ఇప్పుడు వారి వారసుడు మళ్ళీ అధ్యక్షస్థానం కోసం పోటీపడుతున్నాడు. పాలకులమీద తిరుగుబాటుతో తమ జీవించేహక్కును పరిరక్షించుకున్న శ్రీలంకవాసులు ఇప్పుడు తమ ఓటుహక్కును ఎంత తెలివిగా వినియోగించుకుంటారో చూడాలి.