ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చర్చలు ఫలించేనా?

ABN, Publish Date - Aug 15 , 2024 | 01:38 AM

ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య నిలిచిపోయిన చర్చలను నేటినుంచి పునఃప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఖతార్‌, ఈజిప్ట్‌, అమెరికా మధ్యవర్తిత్వంలో జరగబోయే...

ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య నిలిచిపోయిన చర్చలను నేటినుంచి పునఃప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఖతార్‌, ఈజిప్ట్‌, అమెరికా మధ్యవర్తిత్వంలో జరగబోయే ఈ చర్చలు ఫలప్రదమవుతాయన్న నమ్మకాలు పెద్దగా లేవు. సీఐఏ డైరక్టర్, మొసాద్‌ అధినేత, ఖతార్‌ ప్రధాని, ఈజిప్ట్‌ ఇంటలిజెన్స్‌ అధినేత ఈ చర్చల్లో ఉంటారట. ఇజ్రాయెల్‌నుంచి ఓ భారీ బృందమే తరలివస్తున్నది కానీ, హమాస్‌ మాత్రం చర్చల్లో పాల్గొనడం లేదు. ఇజ్రాయెల్‌ వైఖరిలోనూ, చర్చల్లోని అంశాల్లోనూ చెప్పుకోదగ్గ గొప్ప మార్పులేమైనా ఉన్నట్టు తనకు అనిపిస్తే ఆ తరువాత మధ్యవర్తులతో మాట్లాడతానని ఈ ఉగ్రసంస్థ తేల్చేసింది. మళ్ళీ కొత్త చర్చలు అక్కరలేదని, ఇప్పటివరకూ అంగీకారం కుదిరినవి అమలు చేస్తే సరిపోతుందనీ, ఇజ్రాయెల్‌ మొండితనం కారణంగానే ఈ చర్చలు ఫలించలేదని హమాస్ ఆరోపణ. ఈ వారాంతంలోగా ఇజ్రాయెల్‌మీద ఇరాన్ ప్రతీకార దాడి ఖాయమని అనుమానిస్తున్న అమెరికా, ఆ దాడి ఆగాలంటే ఈ చర్చలు ఫలించాలని హెచ్చరిస్తున్నది. కరడుగట్టిన మితవాదశక్తులతో కలసి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ తన మిత్రులకు ఆగ్రహం కలగకుండా ఉండేందుకు దేశప్రయోజనాలను పణంగా పెడుతున్నారు.


నాలుగైదు కీలక అంశాలు ఇంకా తేలవలసి ఉన్నందున, ఏదో అనూహ్య పరిణామం జరిగితే తప్ప ఈ చర్చల్లో మేలిమలుపు ఉండకపోవచ్చు. హమాస్‌ నాయకుడు ఇస్మాయెల్‌ హనియేను టెహ్రాన్‌లో ఇటీవల ఇజ్రాయెల్‌ హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తన పాత్ర ఏమీ లేదని ఇజ్రాయెల్‌ బుకాయిస్తున్నది కానీ, హనియే హత్య తీరును బట్టి అది ఇజ్రాయెల్‌ పుణ్యమేనని సులువుగా అర్థమవుతుంది. నేరుగా తన రాజధాని నగరంమీదే విరుచుకుపడిన ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం చెబుతానని భీషణ ప్రతిజ్ఞ చేసిన ఇరాన్ త్వరలోనే ఆ కక్ష తీర్చుకోవచ్చు. దాడిచేయకుండా ఇరాన్‌ నానుస్తున్నదని హిజ్బుల్లా, హమాస్‌ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. శాంతి చర్చలకు ముందు ఇజ్రాయెల్‌మీద దాడులు చేయడం సరికాదని ఇరాన్‌ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ముగింపు దశకు చేరుకున్న చర్చలను ఇస్మాయెల్‌ హనియే హత్యద్వారా ఇజ్రాయెల్‌ మళ్ళీ మొదటికి తెచ్చింది. ఖతార్‌లో నివాసం ఉండే ఈ హమాస్‌ రాజకీయాధినేతను మోడరేట్‌ అంటారు. ఆయనమీద ఒత్తిడి తెచ్చి చర్చలు తుదిదశకు చేరేట్టు ఖతార్‌ చేయగలిగింది. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌ ఆయనను చంపివేయడంతో హమాస్‌ తన నేతగా యాహ్యా సిన్వర్‌ను కూచోబెట్టింది. మొన్నటివరకూ సైనికవిభాగం అధిపతిగా ఉంటూ అక్టోబర్‌ 7దాడి ఘటనకు కారకుడైన వ్యక్తినే ఇప్పుడు సర్వాధికారిని చేయడాన్ని బట్టి ఆ సంస్థ ఎంతమంది నాయకులను కోల్పోయిందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. సిన్వర్‌ను చంపితీరుతానని ఇజ్రాయెల్‌ వెంటనే ప్రకటించి, ఆయన రోజులు కాదు, గంటలు లెక్కబెట్టుకుంటున్నాడని ఇప్పుడు గర్వంగా చెబుతోంది. సిన్వర్‌ అంత సులువుగా ఇజ్రాయెల్‌కు చిక్కడన్న వాదనలు ఉన్నప్పటికీ, ఉధృతంగా సాగుతున్న వేటలో ఆయన హతమైనపక్షంలో చర్చలపై ఆ ప్రభావం కూడా ఉంటుంది.


అలాగే, కాస్త ఓపికపట్టమంటూ అగ్రదేశాలు చేసిన విజ్ఞప్తిని ఇప్పటికే తిరస్కరించిన ఇరాన్‌, ఇస్మాయెల్‌ హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ మీద దాడికి తెగబడిన పక్షంలోనూ చర్చలు సాగవు. ఏతావాతా ఇజ్రాయెల్‌ తాను అనుకున్నది చేసుకుపోగలుగుతోంది. ఒక పాఠశాలను ఉగ్రవాద స్థావరంగా ప్రకటించి వందలాదిమందిని హత్యచేయగల ఆ తెగింపు ఆశ్చర్యం కలిగిస్తుంది. యావత్‌ ప్రపంచమూ దిగ్భ్రాంతి చెందడం తప్ప మరేమీ చేయలేకపోతోంది. శాంతి శాంతి అంటూనే అమెరికా ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఇస్తోంది, యుద్ధనౌకలను తరలిస్తోంది.

చర్చలమీద నమ్మకం లేక అనేకంటే వ్యూహాత్మకంగానే హమాస్‌ నేరుగా పాల్గొనడం లేదన్నది వాస్తవం. చర్చల్లో పురోగతి కనిపిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినపక్షంలో తన ప్రతీకారాస్త్రాన్ని పక్కకుపెట్టగల అవకాశం ఇరాన్‌కు కూడా ఉంటుంది. ఇజ్రాయెల్‌మీద దాడి కూడదంటూ ఇరాన్‌ను ఒత్తిడిచేస్తున్న అగ్రరాజ్యాలు, అదేస్థాయిలో ఇజ్రాయెల్‌మీద కాల్పుల విరమణకోసం ఒత్తిడి తేవడం లేదన్నది వాస్తవం.

Updated Date - Aug 15 , 2024 | 01:38 AM

Advertising
Advertising
<