యువతరాన్ని భ్రమల వాతావరణంలోకి నెడుతున్నారు
ABN , Publish Date - Aug 12 , 2024 | 01:17 AM
ఆ మాట అనటానికి కారణం వాళ్లింకా 50,- 60ల్లోనే బతుకుతున్నారని నాకనిపించటం. ఎందుకంటే– మొదటగా వాళ్ళ కాలంలో శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు వంటి రచయితలు గొప్ప రచయితలుగా పేరు సంపాదించేశారు...
మూడు ప్రశ్నలు
గూండ్ల వెంకటనారాయణ
యువ రచయితలపై సాహితీ పెద్దలు చాదస్తాన్ని రుద్దుతు న్నారు అన్న అర్థంలో ఈమధ్య మీరు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ రాశారు. ఏమిటి మీ దృష్టిలో ఈ చాదస్తం?
ఆ మాట అనటానికి కారణం వాళ్లింకా 50,- 60ల్లోనే బతుకుతున్నారని నాకనిపించటం. ఎందుకంటే– మొదటగా వాళ్ళ కాలంలో శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు వంటి రచయితలు గొప్ప రచయితలుగా పేరు సంపాదించేశారు. వాళ్ళ టైమ్‌కి అందరి నోళ్లలో నానుతూ ఉన్నారు. దానివల్ల ఇప్పటి పెద్దవాళ్ళు అయిన అప్పటి పిల్లలు వాళ్ళనే చదివి తరించి వాళ్ళ జాడ్యం లోనే ఉన్నారు. ఆ జాడ్యం అంటువ్యాధిలా ఇప్పటి తరానికి కూడా అందిస్తున్నారు.
ఇప్పటి తరం ముఖ్యంగా ఎదుర్కొంటున్న విమర్శల్లో ఒకటి వాళ్ళు గత సాహిత్యాన్ని చదవటం లేదూ అన్నది. కానీ ఇప్పటి తరం ఏ గత సాహిత్యాన్ని చదవటం లేదనీ వీళ్ళ బాధ? వీళ్ళు ఎవరినైతే ఆరాధించారో వాళ్ళని ఈ తరం ఆరాధించటం లేదని. తర తరానికి సాహిత్య పద్ధతులు మారతాయి. ఆలోచనలు మారతాయి. వీళ్ళ మనసులో ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే వీళ్ళ పుస్తకాలు చదివి, వీళ్ళని గురువులుగా భావించాలి అని. ఇంకప్పుడు సాహిత్యం మిగలదు. గురు శిష్యుల కోలాటం మాత్రమే ఉంటుంది. కొత్త తరం విమర్శ తీసుకోదూ అనే ఇంకో మాటను వింటూ ఉంటా. అసలు ముందు ఈ మాట వాడేవాళ్లు విమర్శ తీసుకుంటే కదా కొత్త తరం తీసుకునేదీ లేనిదీ!
ఇంకో సమస్య శైలీ, శిల్పం అనేవాటి గురించి. ఈ శైలీ, శిల్పం అంటే ఏమిటి? వల్లంపాటి కథాశిల్పం పుస్తకాన్ని ఫాలో కావటమా? లేకపోతే కథలు ఎలా రాస్తారనే ఇతర విశ్లేషణా పుస్తకాలని ఫాలో కావటమా? నేను ఇల్యా ఎహ్రెన్‌బర్గ్ రాసిన ‘రచయితా- శిల్పమూ’ అనే పుస్తకమూ, రాల్ఫ్ ఫాక్స్ రాసిన ‘నవల – ప్రజలు’ అనే పుస్తకాలు చదివాను. అందులో రష్యన్, యూరోపియన్ సాహిత్యం గురించి మంచి విమర్శ ఉంటుంది. ఇవి కదా మనం మాట్లాడాల్సింది.
‘‘వీళ్ళ పుస్తకాలు చదివి వీళ్ళను గురువులుగా భావించలన్న’’ ఉద్దేశం... ఇలాంటి వాతావరణం నిజంగా ఉన్నదా?
ఉన్నది. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ కులాల నుంచి కొత్తగా రచయితలు రావటం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్న మన వాతావరణం వాళ్ళకి తప్పుడు అభిప్రాయాలను ఎక్కిస్తున్నది: -‘యువ పురస్కారం’, లేకపోతే ఏదైనా అవార్డు, లేదా పెద్ద సంకలనాలలో రచన రావటం... ఇవే ముఖ్యమైన విషయాలన్న భ్రమ కల్పిస్తున్నది. కొత్త తరం ఇలాంటి వాటికి స్టక్ అయిపోయి– వీటిని పొందాలంటే ఎవరో ఒకరి ఆశ్రయం కావాలి కాబట్టి, అందుకోసం అప్పటికే సాహిత్యంలో స్థిరపడినవాళ్ళ దగ్గరకు వెళ్తున్నారు. వారేమో ప్రోత్సహిస్తున్నాం అన్న పేరుతో కొత్తగా రచన చేస్తున్నవారిని వాళ్ళ భజనపరులుగా మార్చుకుంటున్నారు. అందరూ ఇలా చేయకపోవచ్చు. కానీ జరుగుతున్నది ఇదే. పెద్దవాళ్ళకి వాళ్ళ రచనలు చదివి పొగిడేవాళ్ళు కావాలి. ఈ కాలంలో అంత తీరిక ఎవరికుంది. అందుకని గ్రామ్ ఫోన్ రికార్డు లాంటి కొత్త తరం కావాలి. నేనేం అనుకుంటానంటే– రచయిత మొదట స్వతంత్రుడు అయ్యాక సాహిత్యం రాయాలి.
శిల్పం, శైలి... వీటిపై మీ మాటల్లో వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతుంది?
ఒక రచన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ కొలతల్లో పాత్ర చిత్రీకరణ ఉండాలి, ఏ కొలతల్లో వాతావరణ చిత్రణ ఉండాలి అన్నట్లు శైలీ శిల్పాల గురించి ప్రస్తావిస్తేనే నాకు నచ్చదు. మనమేమన్నా తూనికరాళ్లతో వ్యాపారం చేస్తున్నామా? ఈ శైలి, శిల్పం అనే వాటిని అర్థం చేసుకోవటానికి చాలా పుస్తకాలు చదివాను. కానీ అదేదో మిథ్‌లాగా నాకిప్పటికీ వీటి వ్యవహారం బోధపడలేదు.
నిజానికి కథ రాస్తున్నప్పుడు రచయిత మనసులో తను ఏ విషయం గురించి రాస్తున్నారో స్పష్టత ఉంటే చాలు. అది లేనప్పుడే ఈ గందరగోళం అంతా ఏర్పడుతుంది. నేనో వ్యక్తి గురించి రాసేటప్పుడు అతని జీవితం మొత్తం నాకు తెలిసిందై ఉండాలి. కాసేపు ఉండే పాత్రయినా... జీవితం నా చేతిలో ఉన్నాక కథ ఎలా ఏర్పడుతుందో తెలీకుండా ఉంటుందా!? శైలి, శిల్పం అనేవి పరిశోధక విద్యార్థులకీ, కథలు ఎలా రాయాలో నేర్పించాలి అనుకునేవాళ్లకీ అవసరం. రచయితకు కాదు.