ప్రచారం ముగిసింది.. ప్రలోభాలు షురూ
ABN , Publish Date - May 12 , 2024 | 05:35 AM
లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార రథాల హోరు.. సభలు సమావేశాల్లో ప్రసంగాల జోరుకు తెరపడింది. డప్పు దరువులు.. జిందాబాద్ నినాదాలు ఆగిపోయాయి.
ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీతో ఎర
ఓటర్ స్లిప్పు చూపించినవారికి డబ్బులు!
చాలా చోట్ల రూ.300-500 పంపిణీ
కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు వెయ్యి
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార రథాల హోరు.. సభలు సమావేశాల్లో ప్రసంగాల జోరుకు తెరపడింది. డప్పు దరువులు.. జిందాబాద్ నినాదాలు ఆగిపోయాయి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి ప్రచారాన్ని ముగించుకున్న నేతలు.. ప్రలోభాల పర్వానికి తెర తీశారు. ఓటర్లకు డబ్బు, మద్యం ప్రవాహాన్ని షురూ చేశారు. ఎన్నికల పర్వంలో ఓటింగ్‌కు ముందు 24 గంటలు ఎంత కీలకమో తెలిసిన నేతలంతా శనివారం సాయంత్రం నుంచే ఓటర్లకు తాయిలాల పంపిణీ మొదలుపెట్టారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థులున్న చోట, హోరాహోరి పోటీ నెలకొన్న చోట కాస్త ఎక్కువ సొమ్మును పంపిణీ చేస్తుండగా.. అత్యధిక నియోజకవర్గాల్లో తక్కువ మొత్తాలతో సరిపెడుతున్నారు. కుల, యువజన, మహిళా సంఘాల నాయకులతో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం డబ్బులు పంపుతున్నారు. మల్కాజ్‌గిరిలో ఓ కుల సంఘం నాయకులకు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి రూ.12 లక్షలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పలు బస్తీల్లో ఓటుకు రూ.500 చొప్పున ప్రధాన పార్టీ నేతలు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో 30 వేల నుంచి 50 వేల మంది ఓటర్లకు రూ.500 నగదు ఇస్తున్నారు. చేవెళ్లలో ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. మల్కాజిగిరి, మెదక్, ఖమ్మం, జహీరాబాద్‌లో రూ.500-1000 చొప్పున పంపిణీ సాగుతున్నట్టు తెలిసింది. ఇక, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో రూ.200-300 చొప్పున పంచుతున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, భువనగిరి, మహబూబాబాద్ వంటి నియోజకవర్గాల్లో పంపిణీ ఛాయలు పెద్దగా కనిపించకపోయినా.. గ్రూపుగా వచ్చి అడిగే ఓటర్లకు ఎంతో కొంత ముట్టజెప్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళా సంఘాలకు కొంత మొత్తం చొప్పున పార్టీలు అందజేస్తున్నాయి. ఆదివారం రాత్రికి పంపిణీలో కాస్త జోరు పెరగవచ్చని అంటున్నారు. జహీరాబాద్ పరిధిలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి.. నాయకుల ద్వారా ఓటర్ల వివరాలు తెలుసుకుని ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నాయకుల ఫోన్ల నుంచి ఓటర్ల బ్యాంకు ఖాతాలకు రూ.500చొప్పున బదిలీ చేస్తున్నట్లు తెలిసింది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ముషీరాబాద్ అచ్చయ్యనగర్‌లో ఓ పార్టీ బస్తీ నాయకుడు ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేశారు. మళ్లీ డబ్బులోస్తే రెండో విడత కూడా చెల్లింపులు ఉంటాయని చెబుతున్నారు.
మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని రామచంద్రాపురం పట్టణం బొంబాయి కాలనీలో ఓటర్లకు బీఆర్‌ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తుండగా.. బీజేపీ నేతలు వారిని పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం కొందరు బీఆర్‌ఎస్ నాయకులు కారు, ద్విచక్రవాహనంపై వచ్చి ఇంటింటికి వెళ్లి నగదును పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు, యువత వారిని పట్టుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.