Weight Loss: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి.. బరువు తగ్గుతారు.. అంతేకాకుండా..
ABN, Publish Date - Nov 18 , 2024 | 11:56 AM
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని పానీయాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే, ఈ నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
Weight Loss: మీరు బరువు పెరుగుతున్నారా? దాన్ని తగ్గించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే, మీరు మీ జీవనశైలిని మెరుగుపరచుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామంతో మీరు పెరుగుతున్న ఊబకాయాన్ని నియంత్రించవచ్చు. అలాగే, మీరు మీ బరువును త్వరగా తగ్గించుకోవాలనుకుంటే మంచి ఆహారం, వ్యాయామం మాత్రమే కాకుండా, మీరు ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని పానీయాలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు ఉన్న నీటిని త్రాగండి:
నిమ్మ, తేనె:
ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ, ఒక టీ స్పూన్ తేనె, కొన్ని నల్ల మిరియాలు వేసి కలుపుకొని త్రాగాలి. నల్ల మిరియాలలో పైపెరిన్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో కొత్త కొవ్వు కణాలు పేరుకుపోవడానికి అనుమతించదు. నిమ్మకాయలోని ఆస్కార్బిక్ యాసిడ్ శరీరంలో ఉండే కఫాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని విషపూరిత అంశాలను తొలగించడంలో సహాయపడుతుంది.
సోపు నీరు:
6-8 సోపు గింజలను ఒక కప్పు నీటిలో ఐదు నిమిషాలు ఉడకబెట్టండి. దీన్ని వడగట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి వేడిగా తాగాలి. ఇది అధిక ఆకలి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఎందుకంటే సోంపులో ఉండే ఫైబర్..త్వరగా ఆకలి వేయనివ్వదు. అంతే కాకుండా శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.
జీలకర్ర నీరు:
జీలకర్ర నీటిని తాగడం వల్ల ఊబకాయం వేగంగా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు గుండె సమస్యలు రాకుండా చేస్తాయి. ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందే ఒక టీస్పూన్ జీలకర్రను గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం లేవగానే ఈ నీటిని వడకట్టుకొని తాగాలి. ఖాళీ కడుపుతో ఈ జీలకర్ర నీరు తీసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. జీలకర్ర వాటర్ ఆర్థరైటిస్ సమస్యను తగ్గించడం మాత్రమే కాకుండా.. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో దోహదపడుతుంది.
మెంతి గింజల నీరు:
మెంతి నీరు తాగడం వల్ల స్థూలకాయం తగ్గడమే కాకుండా మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో మెంతులు సహకరిస్తాయి. మెంతి నీటిని తయారు చేయడానికి, ముందుగా, 1 టీస్పూన్ మెంతి గింజలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం నిద్రలేచిన తర్వాత, ఈ నీటిని వడపోతకట్టుకుని ఖాళీ కడుపుతో తాగండి.
ఉసిరి రసం:
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను పెంచడంలో మరియు కేలరీలను బర్న్ చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
Updated Date - Nov 18 , 2024 | 11:58 AM