అమెరికా వలస విధానంపై పిడుగు
ABN , Publish Date - Nov 09 , 2024 | 05:35 AM
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా గద్దెనెక్కక ముందే.. శ్వేతసౌధంలోకి అడుగు పెట్టకముందే.. వలస విధానంలో సంచలనం చోటు చేసుకుంది.
అధ్యక్షుడు బైడెన్ తెచ్చిన కొత్త పాలసీ ‘కీపింగ్ ఫ్యామిలీస్ టుగెదర్’ నిలిపివేత
ట్రంప్ నామినేట్ చేసిన జడ్జి ఉత్తర్వులు
సుమారు 5 లక్షల మందిపై ప్రభావం
వాషింగ్టన్, నవంబరు 8: అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా గద్దెనెక్కక ముందే.. శ్వేతసౌధంలోకి అడుగు పెట్టకముందే.. వలస విధానంలో సంచలనం చోటు చేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది జూన్‌లో ‘కుటుంబాలను కలిపి ఉంచడం’(కీపింగ్ ఫ్యామిలీస్ టుగెదర్) అనే నూతన వలస విధానాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా అమెరికాలో నివసిస్తున్న విదేశీ పౌరులు తమ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోయినా.. చట్టబద్ధత పొందే వీలు కల్పించారు. అయితే.. ఈ విధానాన్ని తాజాగా గతంలో డొనాల్డ్ ట్రంప్ నామినేటెడ్ చేసిన టెక్సా్‌సలోని జిల్లా జడ్జి జస్టిస్ జె. కాంప్‌బెల్ బార్కర్ నిలుపుదల చేశారు.
‘‘ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఫెడరల్ ఏజెన్సీలకు చట్టబద్ధత లేదు’’ అని తీర్పు వెలువరించారు. దీంతో నూతన విధానానికి అర్హులైన సుమారు 5లక్షల మంది పౌరులపై పిడుగు పడినట్టయింది. ట్రంప్ అప్రతిహత విజయం దక్కించుకున్న కొన్ని గంటల్లోనే ఆయన నామినేట్ చేసిన జడ్జి తీర్పు వెలువరించడం చర్చకు దారితీసింది. అక్రమ వలస దారులను దేశం నుంచి పంపేస్తానని ఎన్నికల సమయంలో ట్రంప్ పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. టెక్సాస్ కోర్టు తాజా తీర్పుపై ‘అమెరికన్ ఫ్యామిలీస్ యునైటెడ్’ సంఘం అధ్యక్షుడు ఆష్లే డీ అజెవెడో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పు లక్షల మంది ఆశలను ఛిద్రం చేసిందన్నారు.