Modi in Ukrain: భారత్ తటస్థంగానో, ఉదాసీన ప్రేక్షకుడిగానో ఉండదు.. మోదీ ఉద్ఘాటన
ABN , Publish Date - Aug 23 , 2024 | 08:45 PM
చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు పునరుద్ఘాటించారు. శాంతి నెలకొనేందుకు భాగస్వామ్య పక్షాల మధ్య వాస్తవిక సంప్రదింపులు అవసరమని అన్నారు.
కీవ్: చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఉక్రెయిన్ (Ukrain) పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారంనాడు పునరుద్ఘాటించారు. శాంతి నెలకొనేందుకు భాగస్వామ్య పక్షాల మధ్య వాస్తవిక సంప్రదింపులు అవసరమని అన్నారు. ''భారత్ తటస్థంగానో, ఉదాసీన ప్రేక్షకుడిగానే ఉండిపోదు. ఎప్పుడూ శాంతి పక్షమే ఉంటుంది'' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy)తో కీవ్‌లో శుక్రవారం జరిపిన భేటీ సందర్భంగా స్పష్టం చేశారు. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతియుత పరిష్కారానికి అన్నివిధాలా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
మోదీ ఉక్రెయిన్ పర్యటన, జెలెన్‌స్కీతో జరిపిన భేటీ విషయాలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వివరిస్తూ, మోదీ ఉక్రెయిన్ పర్యటన చరిత్రాత్మకమని అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించే ఇరుదేశాల నేతలు ఎక్కువగా చర్చించినట్టు చెప్పారు. శాంతి నెలకొనేందుకు భాగస్వామ్య పక్షాల మధ్య వాస్తవిక సంప్రదింపులు అవసరమని మోదీ స్పష్టం చేసినట్టు తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఫ్యార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్య తదితర అంశాలపై కూడా ఉభయులూ చర్చించినట్టు చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో గత జూలైలో జరిపిన చర్చల వివరాలను కూడా జెలెన్‌స్కీకి మోదీ వివరించినట్టు తెలిపారు.
PM Modi: జెలెన్ స్కీకి ప్రధాని మోదీ భరోసా..
నాలుగు ఒప్పందాలు
మోదీ, జెలెన్‌స్కీ మధ్య అధికారిక చర్చల అనంతరం భారత్-ఉక్రెయిన్ మధ్య 4 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, మెడిసన్, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. 1991లో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత తర్వాత ఆ దేశంలో ఒక భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం.
Read More International News and Latest Telugu News