Share News

Pennsylvania/Washington : ట్రంప్‌పై హత్యాయత్నం

ABN , Publish Date - Jul 15 , 2024 | 05:45 AM

గన్‌కల్చర్‌కు నెలవైన అమెరికాలో మరోమారు తుపాకీ గర్జించింది..! ఈసారి ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. 5-6 రౌండ్ల కాల్పులు జరపగా ఆ సమయానికి ట్రంప్‌ కాకతాళీయంగా ముఖాన్ని పక్కకు తిప్పడంతో ఆయన కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకుపోయింది.

Pennsylvania/Washington : ట్రంప్‌పై హత్యాయత్నం

  • రైఫిల్‌తో కాల్పులు జరిపిన యువకుడు.. వెంటనే స్పందించిన సీక్రెట్‌ ఏజెంట్లు

  • దుండగుడి కాల్చివేత.. ట్రంప్‌ క్షేమం.. కుడి చెవి పైభాగంలో తూటా గాయం

  • ట్రంప్‌ను ఆస్పత్రికి తరలించిన ఏజెంట్లు.. నిందితుడిని గుర్తించిన ఎఫ్‌బీఐ

  • పక్కా ప్లాన్‌తో కాల్పులు జరిపిన క్రూక్స్‌.. అతడు రిపబ్లికన్‌ పార్టీ అభిమాని!

  • కాల్పులకు ముందు వీడియో పోస్ట్‌.. దుండగుడిని ముందే పసిగట్టిన ఓ వ్యక్తి

  • సెక్యూరిటీ ఏజెంట్లకు సమాచారం.. ట్రంప్‌ను అప్రమత్తం చేయని సిబ్బంది

  • దాడిని ఖండించిన జో బైడెన్‌.. యూఎస్‌లో హింసకు తావు లేదని వ్యాఖ్య

  • ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ఖండించిన మోదీ, రాహుల్‌, పలు దేశాల నేతలు

  • రాబోయే అమెరికా ఎన్నికల్లో భారీగా పెరిగిన ట్రంప్‌ విజయావకాశాలు!

  • రైఫిల్‌తో కాల్పులు జరిపిన యువకుడు.. వెంటనే స్పందించిన సీక్రెట్‌ ఏజెంట్లు

  • దుండగుడి కాల్చివేత.. ట్రంప్‌ క్షేమం

  • దాడిని ఖండించిన జో బైడెన్‌

వేలాదిమందితో అమెరికా ఎన్నికల ప్రచార సభ.. చుట్టూ అభిమానులు, అనుకూలంగా నినాదాలు.. 2 రోజుల్లో అభ్యర్థిత్వం ఖరారు కానుండటంతో రెట్టించిన ఉత్సాహంతో రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌. ‘మీరు నిజంగా విచారకరమైనదాన్ని చూడాలనుకుంటే.. ఏం జరిగిందో చూడండి’ అంటూ ఉద్వేగంగా ప్రసంగం.. యాదృచ్ఛికమే అయినా, ఆయన మాటలు అలా తూటాల్లా పేలుతుండగానే దూసుకొచ్చిందో నిజమైన తూటా.. సమీపంలోని ఓ భవనంపై నుంచి తుపాకీతో దుండగుడి కాల్పులు.. బుల్లెట్‌ చెవిని తాకుతూ వెళ్లడంతో చివ్వున చిమ్మిన రక్తం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియా రాష్ట్రంలో ప్రచారంలో ఉన్న సమయంలో జరిగిన ఈ హత్యాయత్నం నుంచి ట్రంప్‌ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

పెన్సిల్వేనియా/వాషింగ్టన్‌, జూలై 14: గన్‌కల్చర్‌కు నెలవైన అమెరికాలో మరోమారు తుపాకీ గర్జించింది..! ఈసారి ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. 5-6 రౌండ్ల కాల్పులు జరపగా ఆ సమయానికి ట్రంప్‌ కాకతాళీయంగా ముఖాన్ని పక్కకు తిప్పడంతో ఆయన కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకుపోయింది. ట్రంప్‌ను నీడలా కాపాడుతున్న సీక్రెట్‌ ఏజెంట్లు క్షణాల్లో దుండుగుడిని మట్టుబెట్టారు. ఈ ఘటన శనివారం సాయంత్రం 6.10గంటల సమయంలో పెన్సిల్వేనియా ప్రావిన్స్‌లోని బట్లర్‌ పట్టణంలో చోటుచేసుకుంది.


నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో రెండ్రోజుల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ప్రకటన జరగనుందనగా ట్రంప్‌ బట్లర్‌లో ప్రచార ర్యాలీలోపాల్గొన్నారు. భారీ ర్యాలీని ఉద్దేశించి ఆయన సరిహద్దుల్లో అక్రమ వలసలకు సంబంధించిన ఓ చార్ట్‌ను ప్రదర్శిస్తూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. అంతలోనే తుపాకీ తూటాలు ట్రంప్‌వైపు దూసుకొచ్చాయి. వాటిలో ఒకటి ఆయన కుడి చెవి పైభాగం నుంచి దూసుకువెళ్లింది. ఆ వెంటనే ట్రంప్‌ రక్తమోడుతున్న తన చెవిని పట్టుకుని కిందకు జరిగిపోయారు. అదే సమయంలో ట్రంప్‌ వెనకున్న ఎత్తైన ప్రదేశంలో ఉన్న సీక్రెట్‌ ఏజెంట్‌ విభాగానికి చెందిన స్నైపర్లు దుండగుడిని కాల్చి చంపారు.

తర్వాత సీక్రెట్‌ ఏజెంట్లు, సెక్యూరిటీ సిబ్బంది ట్రంప్‌ వద్దకు వచ్చి అతనికి వలయంగా నిలబడ్డారు. ట్రంప్‌ను ఆయన బుల్లెట్‌ప్రూఫ్‌ ఎస్‌యూవీ వద్దకు తీసుకెళ్తుండగా ఆయన తన కుడిచేతి పిడికిలిని పైకెత్తి చూపుతూ ‘‘పోరాడతా (ఫైట్‌)’’ అని నినదించారు. తర్వాత ట్రంప్‌ను చికిత్స నిమిత్తం బట్లర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని రిపబ్లిక్‌ పార్టీ ప్రతినిధులు తెలిపారు. కాగా దుండగుడి కాల్పుల్లో ర్యాలీలో పాల్గొన్న ఓ వ్యక్తి మరణించాడని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.


దాడికి పక్కా స్కెచ్‌..!

దుండగుడు పక్కా వ్యూహంతోనే ట్రంప్‌పై దాడి జరిపినట్లు ఎఫ్‌బీఐ అధికారులు అనుమానిస్తున్నారు. దాన్ని బలపరుస్తూ ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలిచ్చారని తెలుస్తోంది. మీడియాతో మాట్లాడిన ఓ ప్రత్యక్ష సాక్షి.. తాను ముందుగానే భద్రత సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ‘‘ట్రంప్‌ రావడానికి ముందే.. ఓ యువకుడు చేతిలో రైఫిల్‌ తీసుకుని ఓ ఇంటిపైకి చేరాడు. అతను వేదిక వైపు గురిపెట్టి ట్రంప్‌ రాక కోసం సిద్ధంగా ఉన్నాడు. నేను వెంటనే భద్రత సిబ్బందికి సమాచారం అందించా. అయినా వారు పట్టించుకోలేదు. ట్రంప్‌ వేదికపైకి వచ్చి, ప్రసంగించడాన్ని చూసిన నేను ఆందోళనచెందాను. అంతలోనే కాల్పులు జరిగాయి’’ అని అన్నారు.

దుండగుడు 20ఏళ్ల యువకుడు

ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎ్‌ఫబీఐ) అధికారులు గుర్తించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్‌పార్క్‌ ప్రాంతానికి చెందిన థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ (20) ఈఘాతుకానికి పాల్పడ్డట్లు పేర్కొన్నారు. కాగా క్రూక్స్‌ రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారుగా నమోదవ్వడం గమనార్హం..! అయితే 2021లో ఆయన డెమోక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసివ్‌ టర్నవుట్‌ ప్రాజెక్టుకు 15డాలర్లను విరాళంగా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. క్రూక్స్‌ ఈ ఘాతుకానికి పాల్పడడానికి ముం దు సోషల్‌ మీడియాలో.. తాను రిపబ్లికన్‌ పార్టీని, ట్రంప్‌ను ద్వేషిస్తున్నట్లు ఓ పోస్టు చేశాడు. అతను అసాల్ట్‌ రైఫిల్‌తో 200అడుగుల దూరం నుంచి ట్రంప్‌ పై కాల్పులు జరిపినట్లు అధికారులు నిర్ధారించారు. క్రూక్స్‌ ఇంట్లో పేలుడు పదార్థాలు దొరికినట్లు తెలిపారు.


పెరిగిన ట్రంప్‌ విజయావకాశాలు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో క్రమంగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయావకాశాలు పెరుగుతున్నాయి. శనివారం నాటి కాల్పుల ఘటనకు ముందు ఆయన విజయావకాశాలను పోల్‌స్టర్‌ 62శాతంగా అంచనా వేసింది. పెన్సిల్వేనియా కాల్పుల ఘటనతో ప్రజల మద్దతు మరో 8ు పెరిగి విజయావకాశాలు 70శాతానికి చేరుకున్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది.

చెవి పైభాగంలోంచి బుల్లెట్‌ దూసుకెళ్లింది: ట్రంప్‌

కాల్పుల ఘటనపై డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌’ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘‘కాల్పుల శబ్దం వినగానే.. ఏదో జరుగుతోందని అర్థమైంది. అంతలోనే నా కుడిచెవి పైభాగం నుంచి బుల్లెట్‌ దూసుకెళ్లింది. చెవి నుంచి రక్తస్రావమైంది. సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది నా ప్రాణాలు కాపాడారు. వారికి ధన్యవాదాలు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదు. గాడ్‌ బ్లెస్‌ అమెరికా!’’ అని పోస్ట్‌ చేశారు. ట్రంప్‌ కుమార్తె ఇవాంక సోషల్‌ మీడియా వేదికగా తన తండ్రిని కాపాడిన సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

అమెరికాలో హింసకు తావు లేదు: బైడెన్‌

ట్రంప్‌పై కాల్పులు జరగడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదని బైడెన్‌ వ్యాఖ్యానించినట్లు వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ట్రంప్‌తో బైడెన్‌ స్వయంగా మాట్లాడినట్లు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసినట్లు వెల్లడించింది. కాగా వారాంతంలో భాగంగా డెలావెర్‌ బయలుదేరాల్సిన బైడెన్‌.. ఈ ఘటనతో తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వివరించింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, మాజీ అధ్యక్షులు ఒబామా, బిల్‌ క్లింటన్‌, బుష్‌ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

Updated Date - Jul 15 , 2024 | 05:46 AM