Share News

శ్వేతసౌధం మళ్లీ.. ట్రంప్‌దే

ABN , Publish Date - Nov 07 , 2024 | 04:59 AM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలాహ్యారి్‌సతో ఆద్యంతం ఉత్కంఠగా.. ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా సాగిన పోరులో ట్రంప్‌ అప్రతిహత విజయాన్ని సాధించారు. 538 ఎలక్టోరల్‌ కాలేజీ

శ్వేతసౌధం మళ్లీ.. ట్రంప్‌దే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం

ఉత్కంఠ పోరులో.. ట్రంప్‌కే జైకొట్టిన ఓటర్లు

స్వింగ్‌ రాష్ట్రాల్లో కూడా రిపబ్లికన్లదే హవా

ట్రంప్‌నకు 292 స్థానాలు.. కమలకు 224

అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్‌

ఉష ఇక అమెరికా రెండో మహిళ అని వ్యాఖ్య

గెలిచి.. ఓడి.. మళ్లీ గెలుపొంది..

131 ఏళ్ల తర్వాత రికార్డు సమం చేసిన ట్రంప్‌

మిత్రమా.. కలిసి పనిచేద్దాం: ప్రధాని మోదీ

ఎవరూ ఊహించని విజయం ఇది. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయం ఉంటుందని అనుకోను. అమెరికా బంగారు భవిత కోసం పరితపిస్తా. నాపై హత్యాయత్నం జరిగాక.. దేవుడు పునర్జన్మనిచ్చాడని చాలా మంది అన్నారు. నా ఊపిరి ఉన్నంత వరకు అవిశ్రాంతంగా అమెరికన్ల కోసం పనిచేస్తా.

- డొనాల్డ్‌ ట్రంప్‌

న్యూయార్క్‌, నవంబరు 6: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలాహ్యారి్‌సతో ఆద్యంతం ఉత్కంఠగా.. ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా సాగిన పోరులో ట్రంప్‌ అప్రతిహత విజయాన్ని సాధించారు. 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లకు గాను.. అధ్యక్ష పదవిని చేపట్టడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 270ని సునాయాసంగా దాటేసిన ట్రంప్‌.. కడపటి వార్తలందేసరికి 292 చోట్ల విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆ సమయానికి ట్రంప్‌ ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలాహ్యారిస్‌ 224 ఎలక్టోరల్‌ సీట్లను కైవసం చేసుకున్నారు. ముందు నుంచి సర్వేలు ట్రంప్‌నకు అటూఇటుగానే ఉన్నా.. ఓటర్లు మాత్రం ఆయనకు అండగా నిలిచారు. ఈ ఘన విజయంతో ట్రంప్‌ మరో అరుదైన రికార్డును సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, తదుపరి ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం మరో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం 131 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కోర్టుల్లో క్రిమినల్‌ కేసులు వెంటాడుతున్నా.. ప్రచారంలో హత్యాయత్నాలు జరిగినా.. తెంపరిగా పేరున్న ట్రంప్‌ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. వ్యూహాత్మకంగా ముందుకు సాగి.. గమ్యాన్ని ముద్దాడారు.

2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్‌ మద్దతుదారులు చట్టసభల మీద జరిపిన దాడితో ఆయన రాజకీయ జీవితం ముగిసిందని అంతా భావించారు. మాజీ అధ్యక్షుడు అయి ఉండి నాలుగు క్రిమినల్‌ కేసుల్లో కోర్టు విచారణలను ఎదుర్కోవడంతో.. ఇక రాజకీయాల నుంచి ట్రంప్‌ వైదొలగడమే తరువాయి అని విశ్లేషకులు భావించారు. గత ఏడాది రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థులుగా భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామితోపాటు.. నిక్కీహేలి పేరు వినిపించినా.. తనను మించి పోటీదారు ఎవరున్నారంటూ ట్రంప్‌ పదేపదే ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మార్చిలో అధికారికంగా ట్రంప్‌నే ప్రకటించినా.. అధ్యక్షుడు జోబైడెన్‌తో డిబేట్‌లో ఆధిపత్యం చూపినా.. డెమొక్రాట్ల తరఫున కమలాహ్యారిస్‌ బరిలోకి దిగడంతో గట్టిపోటీని ఎదుర్కొన్నారు. స్వింగ్‌ రాష్ట్రాల్లోనూ ప్రతికూల పవనాలున్నాయని సర్వేలు చెబుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ప్రచారాలు చేశారు. రెండు సార్లు జరిగిన హత్యాయత్నాలు సానుభూతిని తీసుకురాగా.. అక్రమ చొరబాట్లకు చెక్‌, చొరబాటుదారులను వెనక్కి పంపడం, ఉద్యోగాలు, వేతనాల విషయంలో అమెరికా ఫస్ట్‌ నినాదం, ద్రవ్యోల్బణం తగ్గించడం వంటి హామీలతో ముందుకు సాగారు. ఫలితంగా.. స్వింగ్‌ రాష్ట్రాల్లోని జార్జియా, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగాన్‌, విస్కాన్సిన్‌లలో ఏకపక్షంగా ట్రంప్‌ హవా కొనసాగింది. మిగతా 2 రాష్ట్రాల్లోనూ(ఇంకా ఫలితాలు వెలువడాల్సి ఉంది) ట్రంప్‌ ఆధిపత్యం కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌-హమాస్‌, హిజ్బుల్లా పోరు.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాలను బైడెన్‌ సర్కారు నియంత్రించే ప్రయత్నం చేయలేదని, ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సహకారం అందించి, పోరును కొనసాగించడాన్ని ట్రంప్‌ తన ప్రచారంలో అస్త్రాలుగా వాడుకున్నారు. తాను అధికారంలో ఉండగా.. అఫ్ఘానిస్థాన్‌ యుద్ధాన్ని ఆపిన తీరును గుర్తుచేశారు. తాను అధికారంలోకి వస్తే.. అమెరికా ఏ యుద్ధంలో పాల్గొనదని, ఇప్పుడున్న యుద్ధాలను ఆపేస్తుందని హామీ ఇచ్చారు. ఈ హామీలతో జార్జియా వంటి రాష్ట్రాల్లో ఉన్న అరబ్బులు, ముస్లింలు ట్రంప్‌కే జైకొట్టినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వలస విధానాలపైనా ట్రంప్‌ హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. 1798 నాటి ‘ఏలియన్‌ ఎనిమీస్‌ యాక్ట్‌’ను తాను తిరిగి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రెండో ప్రపంచయుద్ధం సమయంలో జర్మనీ, జపాన్‌, ఇటలీ వాసులను కట్టడి చేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓటర్లు ట్రంప్‌కే జైకొట్టడంతో ఆయన విజయం మరింత సులువైంది.

బంగారు భవితకు..

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన విజయం ఖరారైనట్లు తేలగానే.. ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్‌ బీచ్‌ బంగళా వద్ద ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. తనను 47వ అధ్యక్షుడిగా ఎన్నుకొన్న అమెరికన్లకు ధన్యవాదాలు తెలుపుతూ.. ట్రంప్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన విజయం నభూతో నభవిష్యత్‌ అని వ్యాఖ్యానించారు. తన ఊపిరి ఉన్నంత వరకు అమెరికా బంగారు భవిత కోసం, అమెరికన్ల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తానని ప్రకటించారు. అమెరికాకు సరిహద్దులను నిర్ణయించబోతున్నామని మెక్సికో గోడ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. తన ప్రసంగంలో ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్న జేడీ వాన్స్‌, ఆయన భార్య, తెలుగమ్మాయి అయిన ఉష చిలుకూరి వాన్స్‌ను, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఈలాన్‌ మస్క్‌, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఆగస్టులో తప్పుకొన్న రాబర్డ్‌.ఎ్‌ఫ.కెన్నడీలను ట్రంప్‌ పొగడ్తలతో ముంచెత్తారు. ఈలాన్‌ మస్క్‌ను ఏకంగా ఆకాశానికి ఎత్తారు. ‘‘అమెరికా వినీలాకాశంలో సరికొత్త తార ఆయన(మస్క్‌). అలాంటి మేధావులను మనం మరిచిపోకూడదు’’ అని ప్రకటించారు. తనపై హత్యాయత్నాలు జరిగాక.. దేవుడు పునర్జన్మనిచ్చారని మిత్రులు అనేవారని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అమెరికన్ల శ్రేయస్సుకు పాటుపడతానన్నారు.


ట్రంప్‌కు అభినందనల వెల్లువ

ట్రంప్‌కు వివిధ దేశాల అధినేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అమెరికాతో తమ ప్రత్యేక బంధం కొనసాగుతుందని యూకే ప్రధాని కీర్‌ స్మార్టర్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ చరిత్రాత్మక విజయం అమెరికాకు కొత్త ప్రారంభాన్ని ఇస్తుందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. శాంతి, శ్రేయస్సు కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ పేర్కొన్నారు. సెప్టెంబరులో ట్రంప్‌ను కలిసినప్పుడు.. రష్యా దురాక్రమణకు ముగింపు పలికే అంశంపై చర్చించామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

ట్రంప్‌ సరికొత్త చరిత్ర!

రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌.. సరికొత్త ఘనత సాధించారు. తొలిసారి పోటీలో అధ్యక్షుడిగా గెలిచి.. రెండోసారి ఓడి.. మూడోసారి పోటీలో విజయం సాధించి అధ్యక్ష పీఠం అధిష్టించనున్న నాయకుడిగా నిలిచారు. గతంలో ఈ రికార్డు మాజీ అధ్యక్షుడు గ్రోవెర్‌ క్లీన్‌ల్యాండ్‌ పేరిట ఉంది. 131 ఏళ్ల తర్వాత ఆ రికార్డును ట్రంప్‌ సమం చేశారు. క్లీవ్‌ ల్యాండ్‌ 1884 ఎన్నికల్లో గెలిచి తొలిసారి అధ్యక్ష పీఠమెక్కారు. ఆ తర్వాత నాలుగేళ్లకు 1888లో పోటీ చేసి ఓడారు. మళ్లీ 1892లో మూడోసారి పోటీ చేసిన ఆయన.. విజయం సాధించి రెండో సారి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టారు. ఇక ట్రంప్‌ 2016 ఎన్నికల్లో గెలిచి తొలిసారి అధ్యక్షుడయ్యారు. రెండోసారి 2021 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా కమలను ఓడించి అధ్యక్ష పీఠం అధిష్టించబోతున్నారు.

వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి..

డొనాల్డ్‌ ట్రంప్‌ 1946 జూన్‌ 14న న్యూయార్క్‌ నగరంలోని క్వీన్స్‌లో ఫెడ్రిక్‌ క్రీస్ట్‌ ఫ్రెడ్‌ ట్రంప్‌, మేరీ ట్రంప్‌ దంపతులకు జన్మించారు. తండ్రికి జర్మనీ మూలాలుండగా.. తల్లి స్కాట్లాండ్‌ వాసి. 13వ ఏట న్యూయార్క్‌ సైనిక అకాడమీలో చేరిన ట్రంప్‌.. ఆ వయసు నుంచే ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలకు మారుపేరుగా నిలిచేవాడు. ఫోర్దామ్‌ యూనివర్సిటీలో రెండేళ్లు చదివాక.. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. తన తాత నిర్వహించే సంస్థ ‘ఎలిజబెత్‌ ట్రంప్‌ అండ్‌ సన్స్‌’లో వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. ఓవైపు వ్యాపార దిగ్గజంగా ఎదుగుతూనే.. నటనపై ఆసక్తితో పలు హాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. 1977లో ఇవానాను పెళ్లాడగా.. వారి బంధం 1992 వరకు కొనసాగింది. 1993లో మార్లాను పెళ్లాడారు. 1999లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మెలానియాతో కలిసి ఉంటున్నారు. ట్రంప్‌నకు ఐదుగురు పిల్లలు. 1970లోనే వేల కోట్లకు పడగలెత్తిన ట్రంప్‌.. రాజకీయాల్లో చక్రం తిప్పాలని పలుమార్లు ప్రయత్నించారు. మాజీ అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌కు మద్దతుదారుగా పనిచేశారు. 1987లో తనకుతాను రిపబ్లికన్‌ నేతగా ప్రకటించుకున్నారు. 1988లో ఉపాధ్యక్ష పదవికి పోటీచేద్దామనుకున్నా.. పార్టీలో అంతర్గత విభేదాలతో ఆయనకు అవకాశం దక్కలేదు. తర్వాత పలుమార్లు పార్టీలు మారారు. 2009లో రిపబ్లికన్‌ అభ్యర్థి జాన్‌ మెక్‌-కెయిన్‌కు మద్దతిచ్చారు. 2016లో ప్రతికూలతలను తట్టుకుని.. మొదటిసారి అధ్యక్షుడిగా విజయం సాధించారు.


కేసులు నిలుస్తాయా?

వాషింగ్టన్‌, నవంబరు 6: ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తరుణంలో.. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్‌ కేసుల పరిస్థితేంటన్న చర్చ ముందుకొస్తోంది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడు ఈయనే. నాలుగు తీవ్ర అభియోగాలపై ఈ ఏడాదే నాలుగు సమాంతర విచారణలు జరిగాయి. ఇందులో పోర్న్‌ స్టార్‌ స్టామీ డేనియల్స్‌ కేసు.. 2020లో జార్జియాలో ఎన్నికల తీర్పును ఆయన తారుమారు చేయడానికి ప్రయత్నించారన్న అభియోగం తీవ్రమైనవి. అధికారిక రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా తన ఇంట్లో దాచారని నిరుడు బైడెన్‌ యంత్రాంగం ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ కేసును ఫ్లోరిడా జిల్లా జడ్జి కొట్టివేశారు. దీనిపై ప్రాసిక్యూషన్‌ అప్పీల్‌ దాఖలు చేసింది. వాస్తవానికి తనపై ఉన్న ఫెడరల్‌ కేసులను స్వయంగా మాఫీ చేసుకునే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. కానీ ఇంతవరకు అమెరికా అధ్యక్షుడెవరూ ఇలాంటి పని చేయలేదు. అయితే న్యాయశాఖ ఆ అభియోగాలను ఉపసంహరించుకుంటే మాత్రం ట్రంప్‌కు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని అమెరికా న్యాయవాద వర్గాలు అంటున్నాయి.


విజయానికి అడ్డురాని వివాదాలు!

న్యూఢిల్లీ, నవంబరు 6: డొనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయవేత్తగా ఎంత దూకుడైన నాయకుడో.. ఆయన చుట్టూ వివాదాలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. చట్టాలను ఉల్లంఘించారని, ఓటమిని అంగీకరించకుండా ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలే కాకుండా.. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా ట్రంప్‌పై ఉన్నాయి. అయినా.. ఎన్నికల్లో విజయానికి ఇవేవీ అడ్డురాలేదు. ట్రంప్‌ తమను లైంగికంగా వేధించారంటూ ఇద్దరు మహిళలు కోర్టుకు ఎక్కగా, స్టామీ డేనియల్స్‌ అనే పోర్న్‌స్టార్‌ ఏకంగా మీడియా ముందుకు వచ్చి.. ట్రంప్‌ తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని, ఆయన తొలిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన 2016లో ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు తనకు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చారని వెల్లడించారు. ఈ అంశం పెద్ద దుమారమే రేపింది. ఈ ఆరోపణలపై విచారణ కూడా జరిగింది. కాగా, ఒకప్పటి ప్లేబాయ్‌ పత్రిక మోడల్‌ కారెన్‌ మెక్‌ డౌగ ల్‌.. 2006లో తనతో ట్రంప్‌ లైంగిక సంబంధం కొనసాగించినట్లు తెలిపారు. వీరే కాకుండా మరికొందరు మహిళలు కూడా ట్రంప్‌ తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక ట్రంప్‌ మూడు పెళ్లిళ్ల సంగతి తెలిసిందే. ఇన్ని వివాదాలున్నా ట్రంప్‌ విజయంపై ఇవేవీ ప్రభావం చూపలేదు.

Updated Date - Nov 07 , 2024 | 05:02 AM