యుద్ధ రంగం నుంచి ఉక్రెయిన్ సైనికుల పలాయనం
ABN , Publish Date - Dec 01 , 2024 | 02:38 AM
రష్యా దాడులు భయానకంగా ఉంటున్నాయని, వాటిని తట్టుకుని, ఎదురుదాడి చేసే వనరులు తమ వద్ద లేవని సైన్యంలో విధులకు ఎగనామం పెట్టిన సెర్హీ నెజ్డిలోవ్ అనే సైనికుడు పేర్కొన్నారు.
లక్ష మందికి పైగా వెనక్కి
కీవ్, నవంబరు 30: దాదాపు మూడేళ్లుగా ‘తెగదు- ముడిపడదు’ అన్నట్లుగా రష్యాతో యుద్ధం కొనసాగుతుండడంతో.. ఉక్రెయిన్ సైనికులు కదనరంగం నుంచి జారుకుంటూ.. కాలికి బుద్ధిచెబుతున్నారు. గడిచిన ఆర్నెల్లుగా ఈ జాఢ్యం మరింతగా పెరిగిందని ఉక్రెయిన్ సైన్యాధికారులు చెబుతున్నారు. ఈ కారణంతో వుహెల్దర్ వంటి కీలక భూభాగాలను ఉక్రెయిన్ కోల్పోవాల్సి వచ్చిందంటున్నారు. ఒకవేళ కాల్పుల విరమణకు రష్యాతో చర్చలు జరిగితే.. తాజా పరిణామాలు తమకు ప్రతికూలంగా మారే ప్రమాదాలున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022 ఫిబ్రవరి 24న రష్యా దురాక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి లక్ష మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు చెప్పాపెట్టకుండా విధులకు ఎగనామం పెట్టినట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. అనధికారికంగా ఈ సంఖ్య 2 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ సైన్యం పలచబడుతోంది. మరణాలు, గాయాలతోపాటు.. అనారోగ్య సమస్యలతో సెలవులు పెట్టి, తిరిగి రానివారు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినవారి వల్ల ఈ పరిస్థితి నెలకొందని 72 బ్రిగేడ్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
యుద్ధం భయానకం
రష్యా దాడులు భయానకంగా ఉంటున్నాయని, వాటిని తట్టుకుని, ఎదురుదాడి చేసే వనరులు తమ వద్ద లేవని సైన్యంలో విధులకు ఎగనామం పెట్టిన సెర్హీ నెజ్డిలోవ్ అనే సైనికుడు పేర్కొన్నారు. ‘‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. రష్యా మాపై 50 షెల్స్‌ను ప్రయోగిస్తే.. మా సామర్థ్యం ఒక షెల్ మాత్రమే..! రష్యా దాడుల్లో మా తోటి సైనికుల శరీరాలు ఛిద్రమవ్వడం చూశాను. అరకొర వనరులతో మా పరిస్థితి కూడా అలాగే తయారవుతుందనే ఆందోళనతో బయటకు వచ్చాను. మా పై అధికారులు క్షేత్రస్థాయిలో ఉండరు. మాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. రేడియో సెట్ల ద్వారా ఆదేశాలు జారీ చేస్తారు’’ అని వివరించారు. సైన్యం కంపెనీల్లో 120 మంది సైనికులు ఉంటారని.. ప్రస్తుతం ఒక్కో కంపెనీలో వారి సంఖ్య 10కి పడిపోయిందని ఓ ఉన్నతాధికారి వివరించారు.
నాటోలో కలపండి
రష్యాతో యుద్ధాన్ని ముగించాలంటే.. తమ దేశ భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకురావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. మా భూభాగానికి భద్రత కల్పిస్తామని నాటో హామీ ఇవ్వాలని, అప్పుడే తాము కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. తన సూచనను నాటో పరిగణనలోకి తీసుకుంటుందా? అని చెప్పలేమని, అసలు తమను నాటోలో చేర్చుకుంటారో? లేదో? కూడా చెప్పలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.