Bangla army chief: హసీనా గద్దెదిగారని ప్రకటించిన ఆర్మీ చీఫ్ వాకరుజ్జమాన్ ఎవరంటే..?
ABN , Publish Date - Aug 05 , 2024 | 07:00 PM
బంగ్లాదేశ్‌లో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటించిన ఆర్మీ చీఫ్ వాకరుజ్జమాన్ గత జూని్ 23న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పాటు ఆయన అధికారంలో ఉంటారు. మూడు దశాబ్దాల కెరీర్‌లో షేక్ హసీనాకు అత్యంత సన్నిహితంగా ఆయన పనిచేశారు.
ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh)లో రిజర్వేషన్ ఆందోళన పతాక స్థాయికి చేరుకోవడం, ప్రధాని షేక్ హసీనా అధికార నివాసంపై ఉవ్వెత్తున ఆందోళనకారులు దాడి చేయడం, దీనికి కొద్ది క్షణాలకు ముందే ఆమె తన పదవికి రాజీనామా చేసి సి-130 ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో దేశం విడిచిపెట్టడం వంటి పరిణామాలు శరవేగంగా చోటుచేసుకున్న క్రమంలో ఆర్మీ చీఫ్ వాకరుజ్జమాన్ (Waker-Uz-Zaman) దేశంలో సైనికపాలన ప్రకటించారు. విపక్ష పార్టీలతో సంప్రదించి దేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మరి కాసేపట్లోనే అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌ను కలుసుకోనట్టు తెలిపారు. ప్రజలంతా హింసకు దూరంగా ఉండాలని టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.
ఎవరీ వాకరుజ్జమాన్..?
బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా జూన్ 23న వాకరుజ్జమాన్ (58) బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పాటు పదవీకాలంలో ఉంటారు. థంకాలో 1966లో ఆయన జన్మించారు. జనరల్ మహమ్మద్ ముస్తఫిజుర్ రెహ్మాన్ కుమార్తెను వివాహమాడారు. ముస్తఫిజుర్ రెహ్మాన్ 1997 నుంచి 2000 వరకూ ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. వాకరుజ్జమాన్ డిఫెన్స్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. నేషనల్ యూవర్శిటీ ఆఫ్ బంగ్లాదేశ్ పూర్వవిద్యార్థి కూడా. లండన్ కింగ్స్ కాలేజీ డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఏ చేశారు. దేశ ఆర్మీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టానికి ముందు ఆరు నెలలు చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా పనిచేశారు. మూడు దశాబ్దాల కెరీర్‌లో ఆయన షేక్ హసీనాతో సన్నిహితంగా పనిచేశారు. పీఎంఓ కింద పనిచేసే ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్‌కు ప్రిన్పిపల్ స్టాఫ్ ఆఫీసర్‌గా కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా!.. దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనా
భారత్ - బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్.. అదనపు బలగాలను మోహరిస్తున్న బీఎస్ఎఫ్