ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అదానీ.. దారెటు

ABN, Publish Date - Nov 23 , 2024 | 05:38 AM

లంచాలు, మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీని అప్పగించాలని అమెరికా కోరుతుందా? ఆయన అరెస్టు తప్పదా?

నేరం రుజువైతే అమెరికాలో పాతికేళ్ల జైలు శిక్ష

లంచం ఇచ్చినందుకు ఐదేళ్లు.. మోసం కింద 20 ఏళ్ల వరకు..

అమెరికా-భారత్‌ మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం

దీని ప్రకారం అదానీని అప్పగించాలని అమెరికా కోరే చాన్స్‌

క్యాపిటల్‌ మార్కెట్‌ అక్రమాలపై కఠినంగా ఆ దేశ చట్టాలు

అడిగితే అప్పగించక తప్పదు.. ఇండో అమెరికన్‌ లాయర్‌ రవిబాత్రా

అప్పీలుకు అదానీకి అవకాశం.. ఒప్పందాలు, జరిమానా

చెల్లింపుల ద్వారా రాజీకి అనుమతిస్తున్న అమెరికా చట్టాలు

ఇది సుదీర్ఘ ప్రక్రియ అంటున్న న్యాయ నిపుణులు

న్యూయార్క్‌, నవంబరు 22: లంచాలు, మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీని అప్పగించాలని అమెరికా కోరుతుందా? ఆయన అరెస్టు తప్పదా? నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు! సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రాష్ట్రాలకు అదానీ గ్రూప్‌ రూ.2029 కోట్ల లంచాలు వెదజల్లిందని అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌, న్యాయ విభాగం, ఎఫ్‌బీఐ నిర్ధారించిన సంగతి తెలిసిందే. దీనిపై న్యూయార్క్‌ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఆయనపై కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అదానీని తమకు అప్పగించాలని అమెరికా కోరే అవకాశాలు ఉన్నాయని భారతీయ అమెరికన్‌ న్యాయవాది రవి బాత్రా వెల్లడించారు. అమెరికాలో అదానీ సహా 8 మంది ఎదుర్కొంటున్న ఈ కేసు మరింత తీవ్రతరం కావచ్చని అభిప్రాయపడ్డారు. నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద నిందితులను తమకు అప్పగించాల్సిందిగా కూడా అడగవచ్చని గురువారం ఓ వార్తాసంస్థకు చెప్పారు. ‘భారత్‌లాగే అమెరికాతో ఈ ద్వైపాక్షిక ఒప్పందం ఉన్న దేశాలు.. అమెరికా అడిగిన వ్యక్తులను తప్పనిసరిగా అప్పగించాల్సి ఉంటుంది. అమెరికన్‌ చట్టాలకు లోబడి ఆయా దేశాలు వ్యవహరించేందుకు నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లోనే అప్పగింత జరుగుతుంది. మానవీయ కోణం ఆధారంగా చిలీ మాజీ అధ్యక్షుడు అగస్టో పినోచెట్‌ను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్‌ నిరాకరించింది. అదానీ, ఇతరుల కేసులో ఇది వర్తించదు’ అని బాత్రా స్పష్టం చేశారు. అమెరికాతో భారత్‌ 1997లో నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కుదుర్చుకుంది. తమ కేపిటల్‌ మార్కెట్లో అవకతవకల విషయంలో అమెరికన్‌ చట్టాలు మరింత కఠినంగా ఉంటాయని బాత్రా చెప్పారు. నేరం నిరూపితమయ్యేవరకు తాము నిర్దోషులమని చెప్పుకొనే హక్కు అదానీ తదితరులకు ఉంటుందని.. అయితే తమ ఆత్మరక్షణ వాదనలను నిజాయుతీగా, నేర్పుగా వినిపించలేకపోతే ఆ హక్కు వారికి దూరమవుతుందని పేర్కొన్నారు.

సుదీర్ఘ విచారణ ప్రక్రియ...

అదానీపై అమెరికాలో సుదీర్ఘకాలం విచారణ ప్రక్రియ జరిగే అవకాశముంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీపై లంచం, మోసం, కుట్రలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. రెండు దశాబ్దాల్లో 2 బిలియన్‌ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి ఒప్పందాల కోసం ఆయన 250 మిలియన్‌ డాలర్లకు పైగా లంచం కింద ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.

ఇకముందు ఏం జరగనుంది?

ఇప్పటి వరకూ అమెరికా కోర్టుకు అదానీ హాజరు కాలేదు. అక్కడ ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయలేదు. ఒకవేళ ఆయన్ను అమెరికాకు అప్పగించినా లేదా ఆయనే లొంగిపోయినా అదానీ తరఫు న్యాయవాదులు అభియోగాలను సవాలు చేయవచ్చు. వారు పిటిషన్‌ డీల్‌పై చర్చలు జరిపే అవకాశమూ ఉంది. అయితే దీనికి అంగీకరించాల్సిన బాధ్యత అక్కడి ప్రాసిక్యూటర్లకు లేదు. మరోవైపు ఈ కేసు విచారణ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదు. సాక్ష్యాధారాల సేకరణలో సవాళ్లు, అదానీ సహ నిందితులకు వేర్వేరు ట్రయల్స్‌ సహా చట్టపరమైన చర్యలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

రాజీ ప్రయత్నాలకు మొగ్గు

లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ బృందం... ఒప్పందాలు చేసుకోవడం, జరిమానాలు చెల్లించడం ద్వారా రాజీ చేసుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే దీనికి కాలపరిమితి ఉన్న నేపథ్యంలో తొలుత అప్పీలు వెళ్లడమే వీరి ముందున్న మొదటి మార్గం అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పరిష్కార మార్గాలు అన్వేషించవచ్చని సూచిస్తున్నారు. ‘ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీపీఏ)’ కింద నమోదయ్యే లంచం కేసుల్లో రాజీకి రావడానికి అమెరికా చట్టాలు అనుమతిస్తాయి. అదానీ గ్రూప్‌ జరిమానాలు చెల్లించడం, కొన్ని తప్పులను అంగీకరించడం, నిబద్ధతను మెరుగుపరుచుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఎఫ్‌సీపీఏ ఉల్లంఘనల కేసులో అమెరికా ప్రభుత్వ దర్యాప్తును సెటిల్‌ చేసుకోవడానికి 2019లో ఎరిక్సన్‌ కంపెనీ ఒక బిలియన్‌ డాలర్లకు పైగా చెల్లించడానికి అంగీకరించింది. అలాగే ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలోని ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసును పరిష్కరించుకోవడానికి 220 మిలియన్‌ డాలర్లకు పైగా చెల్లించడానికి జర్మనీకి చెందిన ఎస్‌ఏపీ సంస్థ అంగీకరించింది. అయితే అదానీపై ఇప్పటికి ఆరోపణలు మాత్రమే చేశారని, ఇంకా నేరాన్ని నిరూపించాల్సి ఉందని, ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని న్యాయవాదులు చెబుతున్నారు.

భారత్‌-అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయి: వైట్‌హౌస్‌

అదానీ లంచాల వ్యవహారంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ స్పందించింది. ఈ సంక్షోభాన్ని భారత్‌-అమెరికా అధిగమించగలవని ఆశాభావం వ్యక్తం చేసింది. వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరీన్‌ జిన్‌ పియర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అదానీపై ఆరోపణల విషయం మా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ కమిషన్‌ (సీఈసీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (డీవోజే) మాత్రమే సరైన సమాధానం ఇవ్వగలవు. అయితే భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఈ సంక్షోభాన్ని కూడా ఇరు దేశాలు అధిగమించగలవనే నమ్ముతున్నాం’ అని చెప్పారు.


అదానీని అరెస్టు చేస్తారా?

ఒకవేళ అదానీ భారత్‌లో ఉంటే అతడిని అప్పగించాలని అమెరికా ప్రాసిక్యూటర్లు కోరవచ్చు. భారతీయ చట్టాల ప్రకారం ఈ అభియోగాలు వర్తిస్తాయో, లేదో ఇక్కడి కోర్టులు అంచనా వేస్తాయి. అలాగే రాజకీయ, మానవ హక్కుల పరమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే ఈ అప్పగింతను అదానీ సవాలు చేయవచ్చు. అలాగే దీనిపై వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా అప్పగింత ప్రక్రియను పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.

ఎలాంటి శిక్షలు పడొచ్చు?

నేరం రుజువైతే లంచం ఇచ్చినందుకు ఐదేళ్లు, మోసం, కుట్ర అభియోగాల కింద 20 ఏళ్ల వరకూ అదానీకి జైలుశిక్షతో పాటు భారీగా జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఏ శిక్ష అయినా అంతిమంగా న్యాయాధిపతి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఏ శిక్ష విధించినా అదానీ తరఫు న్యాయవాదుల బృందం దానిపై అప్పీలు చేయవచ్చు. తద్వారా ఇదొక సుదీర్ఘ న్యాయపోరాటంగా మారే అవకాశం ఉంది.

అదానీ గ్రూపు ఏమందంటే..

సౌర విద్యుత్తు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు పెద్ద మొత్తంలో లంచం ఇవ్వజూపారంటూ తమ సంస్థపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, తమ సంస్థ చట్టాలకు లోబడి నడుచుకుంటుందని స్పష్టం చేసింది.

Updated Date - Nov 23 , 2024 | 05:38 AM