‘లాభదాయక’ అనర్హతపై కొత్త చట్టం!
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:19 AM
ఎంపీలపై అనర్హత వేటుకు సంబంధించి కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సర్కారులో లాభదాయక పదవులు నిర్వహిస్తూ ఎంపీగా గెలిచినవారిపై అనర్హతకు అవకాశం కల్పిస్తున్న 1959నాటి చట్టాన్ని రద్దుచేయాలని భావిస్తోంది.
ఫ్లాగ్‌షిప్ పథకాల్లో సభ్యులుగా ఉన్నవారిపై వేటు పడదు
బిల్లుపై ప్రజాభిప్రాయం కోరిన కేంద్ర న్యాయ శాఖ
1959 నాటి చట్టం రద్దుకు యోచన వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా నిర్వచనం
న్యూఢిల్లీ, నవంబరు 17: ఎంపీలపై అనర్హత వేటుకు సంబంధించి కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సర్కారులో లాభదాయక పదవులు నిర్వహిస్తూ ఎంపీగా గెలిచినవారిపై అనర్హతకు అవకాశం కల్పిస్తున్న 1959నాటి చట్టాన్ని రద్దుచేయాలని భావిస్తోంది. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ‘లాభదాయక పదవి’కి నిర్వచనం ఇవ్వాలని నిశ్చయించింది. 16వ లోక్‌సభ (2014-19) కాలంలో బీజేపీ సీనియర్ నేత కల్‌రాజ్ మిశ్రా సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీ (జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్-జేసీవోపీ) సిఫారసులకు అనుగుణంగా కొత్త బిల్లు ముసాయిదాకు రూపకల్పన చేసింది. దీనిపై కేంద్ర న్యాయ శాఖ తాజాగా ప్రజాభిప్రాయం కోరింది.
నూతన ‘పార్లమెంటు (అనర్హత నిరోధక) బిల్లు-2024’లో అనర్హత పరిధిలోకి వచ్చే పదవులు, అనర్హతకు వీల్లేని పోస్టుల జాబితాను ప్రతిపాదించింది. కొన్ని నిర్దిష్ట కేసుల్లో అనర్హత వేటును తాత్కాలికంగా సస్పెండ్ చేయడానికి ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 4 అవకాశం కల్పిస్తోంది. దీన్ని తొలగించాలని తాజా బిల్లులో ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాలు, కార్యక్రమాలైన స్వచ్ఛభారత్, స్మార్ట్ సిటీ మిషన్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్-గ్రామీణ కౌశల్య యోజన మొదలైనవాటిలో సభ్యులుగా ఉండేవారిని లాభదాయక పదవులు నిర్వహించేవారి జాబితాలోకి తేకూడదని జేసీవోపీ న్యాయ శాఖకు సూచించింది. అలాగే ‘లాభదాయక పదవి’కి సమగ్ర నిర్వచనం రూపొందించాలని.. చట్టంలోని భాష, ఫార్మాట్ సరళంగా ఉండాలని ప్రతిపాదించింది. ప్రస్తుత చట్టంలోని కాలం చెల్లిన, నిరర్థక అంశాలను పరిగణనలోకి తీసుకోకూడదని పేర్కొంది.