Share News

Delhi : అప్రజాస్వామికంగా..గొంతునొక్కే యత్నం

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:00 AM

పార్లమెంట్‌ సాక్షిగా విపక్షాలు అప్రజాస్వామికంగా తన గొంతు నొక్కేయాలని ప్రయత్నించాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. గత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి మోదీ ధన్యవాదాలు చెబుతుండగా..

Delhi : అప్రజాస్వామికంగా..గొంతునొక్కే యత్నం

  • పార్లమెంట్‌ ఉన్నది పార్టీల కోసం కాదు.. దేశం కోసం

  • రాజకీయాలకు వేదిక కాదు

  • 2029 ఎన్నికల్లో మనం మరోసారి తలపడదాం

  • అప్పటి వరకు ప్రజా సమస్యలపై దృష్టిపెడదాం

  • బడ్జెట్‌ సమావేశాలకు ముందు మీడియాతో ప్రధాని మోదీ

  • కాంగ్రెస్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ, జూలై 22: పార్లమెంట్‌ సాక్షిగా విపక్షాలు అప్రజాస్వామికంగా తన గొంతు నొక్కేయాలని ప్రయత్నించాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. గత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి మోదీ ధన్యవాదాలు చెబుతుండగా.. విపక్షాలు ఆందోళన చేయడాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘రాజకీయాలకు పార్లమెంట్‌ వేదిక కాదు. పార్లమెంట్‌ అనేది పార్టీల కోసం కాదు. దేశ ప్రజల కోసం. ఎన్నికల్లో పోరాడాం. ఎన్నికలు అయిపోయాయి. మళ్లీ 2029 ఎన్నికల్లో పోరాడుదాం. అప్పటి వరకు పార్లమెంట్‌లో మహిళలు, యువత, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిద్దాం’’ అని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు ముందు విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ రాబోయే ఐదేళ్లకు మార్గదర్శకంగా ఉంటుందని, విపక్షాలు కూడా 2047లోగా సాధించాలని సంకల్పించిన ‘వికసిత్‌ భారత్‌’ కోసం కృషి చేయాలని కోరారు. మోదీ ‘గొంతు నొక్కడం’ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఖండించింది. ‘‘విపక్షాలు తన గొంతు నొక్కాయని ప్రధాని కన్నీళ్లు కారుస్తున్నారు. కానీ, గడిచిన పదేళ్లుగా మోదీయే దేశం గొంతు నొక్కుతున్నారు’’ అని విమర్శించింది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.

Updated Date - Jul 23 , 2024 | 05:00 AM