Dense Fog: దట్టంగా కమ్ముకున్న పొగమంచు..విమానాల ఆలస్యం, స్కూల్స్ బంద్
ABN , Publish Date - Jan 04 , 2024 | 08:41 AM
ఉత్తర భారతంలో పొగమంచు తీవ్రత భారీగా పెరిగింది. దీంతోపాటు చలిగాలులు కూడా పెరిగాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా..మరికొన్ని చోట్ల స్కూళ్లను మూసి వేశారు.
ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు(Dense fog) కమ్ముకుంది. ఉదయం 6 దాటినా కూడా రహదారులు కనిపించకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, జమ్మూలలో చాలా దట్టంగా పొగమంచు నెలకొంది. ఈ నేపథ్యంలో పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమానాలు ఆలస్యంగా(delayed flights) ప్రయాణించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా(noida) జిల్లాలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 6వ తేదీ వరకు మొదటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠశాలలను మూసివేయాలని(closed schools) ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మరో రెండు రోజులు కూడా ఈ చలి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉత్తర భారతంతోపాటు తూర్పు భారతదేశంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మధ్య భారతంలో చలి తీవ్రత రాబోయే మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.