ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతిభావంతుడిని విద్యకు దూరం కానివ్వం!

ABN, Publish Date - Oct 01 , 2024 | 06:14 AM

నిర్దేశిత గడువులోపు ఫీజు చెల్లించలేక ఐఐటీ-ధన్‌బాద్‌లో సీటు కోల్పోయిన దళిత యువకుడికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఆ యువకుడికి బీటెక్‌ కోర్సులో అడ్మిషన్‌ ఇవ్వాలని సోమవారం ఐఐటీ-ధన్‌బాద్‌ను ఆదేశించింది. ‘ఇలాంటి ప్రతిభావంతుడైన ఒక యువకుడిని ఇలా వదిలేయలేం. అతను ఇలా

ఆ దళిత యువకుడికి అడ్మిషన్‌ ఇవ్వండి

ఐఐటీ-ధన్‌బాద్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు

ఫీజు కట్టలేక సీటు కోల్పోయిన విద్యార్థికి ఊరట

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: నిర్దేశిత గడువులోపు ఫీజు చెల్లించలేక ఐఐటీ-ధన్‌బాద్‌లో సీటు కోల్పోయిన దళిత యువకుడికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఆ యువకుడికి బీటెక్‌ కోర్సులో అడ్మిషన్‌ ఇవ్వాలని సోమవారం ఐఐటీ-ధన్‌బాద్‌ను ఆదేశించింది. ‘ఇలాంటి ప్రతిభావంతుడైన ఒక యువకుడిని ఇలా వదిలేయలేం. అతను ఇలా అనాదరణకు గురికాకూడదు’ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన దినసరి వేతన కార్మికుడి కుమారుడైన అతుల్‌ కుమార్‌కు ఐఐటీ-ధన్‌బాద్‌లో బీటెక్‌ ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ అడ్మిషన్‌ ఇప్పించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తన విశేష అధికారాలను ఉపయోగించింది. ‘పిటిషనర్‌ లాంటి అట్టడుగువర్గాలకు చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలను ఇలా వదిలేయలేం. అతను సకాలంలో ఫీజు చెల్లించి ఉంటే, ఏ బ్యాచ్‌లోనైతే అడ్మిషన్‌ ఇచ్చేవారో అదే బ్యాచ్‌లో విద్యాభ్యాసం కొనసాగించేలా అతనికి అడ్మిషన్‌ ఇవ్వాలని ఐఐటీ-ధన్‌బాద్‌ను ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. అడ్మిషన్‌ పొందేందుకు అభ్యర్థి జూన్‌ 24వ తేదీలోపు అంగీకార రుసుము రూ.17,500 చెల్లించాల్సి ఉండగా, అతుల్‌ కుమార్‌ తల్లిదండ్రులు సకాలంలో ఆ డబ్బు చెల్లించలేకపోయారు. దీంతో ఐఐటీ-ధన్‌బాద్‌ అతనికి సీటు కేటాయించలేదు.


ఓ మాజీ చీఫ్‌జస్టిస్‌ను విచారించాలా?

సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ను ప్రతివాదిగా చేర్చి విచారణ జరపాలంటూ పిల్‌ దాఖలుచేసిన వ్యక్తికి జస్టిస్‌ చంద్రచూడ్‌ చీవాట్లు పెటారు. జడ్జి పేరును రాతపూర్వకంగా తొలగిస్తేనే ‘పిల్‌’పై నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్‌కు తేల్చిచెప్పారు. కార్మిక చట్టాల కింద తన సర్వీసు రద్దు చేసిన వ్యవహారంలో వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ కొట్టివేస్తూ 2018లో ఇచ్చిన తీర్పు వల్ల తనకు అన్యాయం జరిగిందని నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తి తన పిటిషన్‌లో వాదించారు. అందువల్ల జస్టిస్‌ రంజన్‌ను కూడా తన పిల్‌లో భాగం చేసి, ఆయనపై ఇన్‌-హౌస్‌ ఎంక్వైరీ (కోర్టు నియమించిన కమిటీ జరిపే విచారణ) చేయించాలని కోరారు. పిటిషనర్‌ విజ్ఞాపనపై చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మండిపడ్డారు. ‘‘ఒక మాజీ చీఫ్‌జస్టి్‌సపైనే ఇన్‌-హౌస్‌ ఎంక్వైరీ కోరతారా? కొంచమైనా గౌరవం ఉండాల్సి న అవసరం లేదా? ఓడిపోయిన ఓ కేసులో ఇలా కోరడం ఏమిటి? దీన్ని మేం సహించబోం’’ అని ఆగ్రహించారు.

బాధిత ట్రైనీ డాక్టరు పేరు వెల్లడించొద్దు

కోల్‌కతాలోని ఆర్‌.జి.కర్‌ వైద్య కళాశాలలో అత్యాచారానికి, హత్యకు గురయిన ట్రైనీ డాక్టర్‌ ఫొటో, పేరును ఎక్కడా వెల్లడించకూడదని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆమె వివరాలను వికీపీడియా సహా సామాజిక మాధ్యమాల్లో ప్రచురించకూడదంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి ఫొటో, పేరు వస్తుండడంతో ఆమె తల్లిదండ్రులు బాధపడుతున్నారని న్యాయవాది వృందా గ్రోవర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కృత్రిమ మేధ ద్వారా వీడియోలు సృష్టించి ఆన్‌లైన్‌లో పెడుతున్నారని తెలిపారు. ఆమెపై సినిమా కూడా తీశారని, అది మంగళవారం యూట్యూబ్‌లో విడుదల కానుందని చెప్పారు. దీనిపై జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పందిస్తూ తాము ఉత్తర్వులు ఇచ్చామని, అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత ఏజెన్సీలపై ఉందని తెలిపారు. కాగా, వైద్య కళాశాలల్లో సీసీటీవీ కెమేరాల ఏర్పాటు నత్తనడకన సాగుతోందంటూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబరు 15 నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించింది.

Updated Date - Oct 01 , 2024 | 06:14 AM