Share News

కొనసాగుతున్న ‘డంకీ’!

ABN , Publish Date - Oct 26 , 2024 | 03:09 AM

ఆ మధ్య వచ్చిన డంకీ సినిమా.. ఉపాధి కోసం బ్రిటన్‌లోకి అనధికారికంగా ప్రవేశించటానికి నిరుపేద భారతీయులు పడే బాధలను కళ్లకు కట్టింది.

కొనసాగుతున్న ‘డంకీ’!

  • అనుమతి లేకుండా అమెరికాలోకి వెళ్లటానికి భారతీయుల యత్నాలు

  • ఈ ఏడాది 90,415 మంది అరెస్టు

  • వెల్లడించిన అమెరికా కస్టమ్స్‌ విభాగం

న్యూఢిల్లీ, అక్టోబరు 25: ఆ మధ్య వచ్చిన డంకీ సినిమా.. ఉపాధి కోసం బ్రిటన్‌లోకి అనధికారికంగా ప్రవేశించటానికి నిరుపేద భారతీయులు పడే బాధలను కళ్లకు కట్టింది. తీవ్రమైన అవమానాలు, సవాళ్లు, ఆటంకాలు, మార్గమధ్యంలోనే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నా కూడా.. కూటి కోసం కోటి కష్టాలకు ఎదురీదుతూ విదేశాలకు అక్రమంగా వెళ్తున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు (ఈ చట్టవిరుద్ధ ప్రయాణమార్గాన్ని డంకీ ఫ్లైట్‌ అని వ్యవహరిస్తుంటారు). ఈ ఏడాది ఈ విధంగా అమెరికాలోకి ప్రవేశించటానికి ప్రయత్నించి అరెస్టయిన భారతీయుల వివరాలను ‘అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌’ తాజాగా వెల్లడించింది. 2023 అక్టోబరు 1 - 2024 సెప్టెంబరు 30 మధ్యకాలంలో (అమెరికా ఆర్థిక సంవత్సరం-2024లో) మెక్సికో, కెనడా సరిహద్దుల నుంచి అమెరికాలోకి అనధికారికంగా ప్రవేశించటానికి యత్నించి 29 లక్షల మంది దొరికిపోయారని ఈ వివరాలు తెలిపాయి.

అరెస్టయిన వారిలో 90,415 మంది భారతీయులు కాగా.. వీరిలో దాదాపు సగం మంది గుజరాతీలే ఉండటం గమనార్హం. సగటున ప్రతీ గంటకు పది మంది భారతీయులు అమెరికాలోకి ప్రవేశించటానికి ప్రయత్నించి అధికారులకు దొరికిపోతున్నారు. ఎక్కువగా అమెరికా-కెనడా సరిహద్దు వద్దే అరెస్టవుతున్నారు. ఈ ఏడాది ఆ సరిహద్దు వద్ద 43,764 మంది దొరికిపోయారు.

Updated Date - Oct 26 , 2024 | 03:09 AM