నేడే మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఫలితాలు
ABN, Publish Date - Nov 23 , 2024 | 05:35 AM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. 288 స్థానాలున్న శాసన సభకు ఈ నెల 20న ఒకే విడతలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఫలితాల్లో ఏ కూటమి మెజారిటీ దక్కించుకున్నా కేవలం 72 గంటల్లోనే సర్కారును
మహారాష్ట్రలో 26తో ముగియనున్న ప్రస్తుత సర్కారు కాల పరిమితి
హంగ్ ఏర్పడితే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చాలని వ్యవధి
రాష్ట్రపతి పాలనకు చాన్స్?.. హోటళ్లను బుక్ చేసిన శివసేన
కొనుగోలుదార్ల నుంచి రక్షణకే: రౌత్.. కూటముల్లో ‘సీఎం సీటు’ కుస్తీలు
మళ్లీ ఝార్ఖండ్ సీఎం అవుతాననే ధీమాలో హేమంత్ సోరెన్
బరిలో సీఎం సతీమణి కల్పన కూడా.. అధికారం తమదేనంటున్న బీజేపీ
ముంబై, నవంబరు 22: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. 288 స్థానాలున్న శాసన సభకు ఈ నెల 20న ఒకే విడతలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఫలితాల్లో ఏ కూటమి మెజారిటీ దక్కించుకున్నా కేవలం 72 గంటల్లోనే సర్కారును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కాల పరిమితి ఈ నెల 26తో ముగియనున్న నేపథ్యంలో మెజారిటీ దక్కించుకునే పార్టీ లేదా కూటమి అదే సమయానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇది ఆయా పార్టీలను టెన్షన్ పెడుతోంది. ఒకవేళ ఓటరు తీర్పు ఎవరికీ అనుకూలంగా లేకపోతే హంగ్ ఏర్పడుతుంది. అప్పుడు కేవలం 3 రోజుల్లోనే సర్కారును ఏర్పాటు చేయడం మరింత సంక్లిష్టంగా మారనుంది. ఇదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలిచే అవకాశం ఉందని, తర్వాత బలపరీక్షకు ఆదేశించవచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. 1990ల నుంచి రాష్ట్రంలో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ దక్కకపోవడం గమనార్హం.
రాష్ట్రపతి పాలన ప్రశ్నే లేదు!
ఏ పార్టీకీ మేజిక్ ఫిగర్ రాకపోయినా వెనువెంటనే రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం లేదని సీనియర్ అడ్వొకేట్, మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ బిశ్వజిత్ తెలిపారు. తొలుత భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకున్న పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, తర్వాత కొంత గడువులోపల మెజారిటీని నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి(శివసేన, ఎన్సీపీ) కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ(శివసేన-యూబీటీ, ఎన్సీపీ-శరద్‌పవార్) కూటములు బరిలో ఉన్నాయి. గత ఐదేళ్ల విషయాన్ని తీసుకుంటే రెండు కూటములు రాష్ట్రాన్ని పాలించాయి. 1985లో చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా 161 స్థానాల్లో విజయం దక్కించుకుని అధికారం చేపట్టింది. ఇక, ఆ తర్వాత నుంచి ఏడుసార్లుగా కూటములే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.
సీఎం సీటు కోసం కుస్తీలు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాకముందే రెండు కీలక కూటముల్లోనూ సీఎం సీటు కోసం నేతలు కుస్తీలు పడుతున్నారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకుని సీఎం సీటు తమకంటే తమకేనని పట్టుబడుతున్నారు. ఈ నెల 23న పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రెండు కూటములు ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశాయి. ప్రజల తమవైపే మొగ్గు చూపారని ఇరు పక్షాలు ప్రకటించుకున్నాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నానా పటోల్ స్పందిస్తూ.. మహావికాస్ అఘాడీ అధికారం చేపట్టి తీరుతుందని చెప్పారు. కాంగ్రెస్ నేత సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అయితే, పటోల్ వ్యాఖ్యలతో విభేదించిన శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్.. మహావికాస్ అఘాడీ మెజారిటీ దక్కించుకున్న తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎవరికి ఇవ్వాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక, మహాయుతి కూటమిలో.. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ షిర్సత్ మాట్లాడుతూ ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిందేనే తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారని చెప్పారు. అయితే.. బీజేపీ నేత ప్రవీణ్ దరేకర్ మాత్రం తమ నాయకుడు, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని తెలిపారు. ఇదే, మహాయుతి కూటమిలో ఉన్న ఎన్సీపీ కూడా సీఎం సీటుపై ఆశలు పెట్టుకుంది. అజిత్ పవార్‌కు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని.. ఎన్సీపీ కింగ్ మేకర్‌గా మారనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శిబిరాలకు ఉద్ధవ్ సేన!
ఫలితాలు ఇంకా రాకుండానే గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు శివసేన(యూబీటీ) పార్టీ జాగ్రత్త పడుతోంది. తమ ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభపెట్టకముందే వారిని తరలించడం కోసం పలు హోటళ్లను ముందుగానే రిజర్వ్ చేసుకుంది. ‘‘బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది. మరి మా జాగ్రత్తలో మేం ఉంటే తప్పేముంది?’’ అని ఆ పార్టీ నేత రౌత్ అన్నారు.
ఝార్ఖండ్‌లో గెలుపెవరిదో
న్యూఢిల్లీ, నవంబరు 22: ఝార్ఖండ్‌లోనూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి శాసన సభ ఎన్నికల్లో హోరా హోరీ తలపడ్డాయి. ముఖ్యంగా ఇండియా కూటమిలోని ఝార్ఖం డ్ ముక్తి మోర్చా మరోసారి అధికారం దక్కించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అదేవిధంగా బీజేపీ కూటమి కూడా అధికారం కోసం కష్టించింది. దీంతో రెండు కూటములు అధికార పీఠంపై ఆశలు బాగానే పెట్టుకున్నాయి. మొత్తంగా జేఎంఎం 41 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మిగిలిన స్థానాల్లో మిత్రపక్షాలు బరిలో నిలిచాయి. ఇక, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ 68 స్థానాల్లో తలపడింది. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఇక, కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లోనే పోటీ చేసింది. అయితే.. కీలక నాయకులను పోటీలో నిలపడంతో గెలుపుపై ఆశలు భారీగానే పెట్టుకుంది. ఇదిలావుంటే, ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ కూటమికే ప్రజలు పట్టం కట్టడం గమనార్హం. ఈ కూటమి 42-47 స్థానాల్లో గెలిచి సర్కారు ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలు సర్వేలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా శనివారం వెలువడనున్నాయి. ఇందులో ప్రియాంక పోటీచేసిన వయనాడ్ స్థానంలో ఫలితంపై అంది దృష్టి ఉంది.
Updated Date - Nov 23 , 2024 | 05:35 AM