Share News

ఉభయ కూటముల ‘మహా’యుద్ధం!

ABN , Publish Date - Oct 17 , 2024 | 06:47 AM

దేశంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యాపరంగా రెండో అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో ఎన్నికల పర్వానికి తెరలేచింది. 403 శాసన సభాస్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌ తర్వాత 288

ఉభయ కూటముల ‘మహా’యుద్ధం!

మహాయుతి X మహా వికాస్‌ అఘాడీ

బీజేపీ నేతృత్వంలోని కూటమి ఒకవైపు

కాంగ్రెస్‌ నేతృత్వంలో జట్టు ఇంకోవైపు

హరియాణా గెలుపుతో బీజేపీ దూకుడు

ముంబై, అక్టోబరు 16: దేశంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యాపరంగా రెండో అతి పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో ఎన్నికల పర్వానికి తెరలేచింది. 403 శాసన సభాస్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌ తర్వాత 288 స్థానాలతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు రెండు ప్రధాన కూటముల మధ్య ఈ మహా యుద్ధం జరగనుండడం విశేషం. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ)లు ఈ ఎన్నికల్లో హోరా హోరీ తలపడనున్నాయి. చిత్రం ఏంటంటే.. ఈ రెండు కూటముల్లోనూ కీలకమైన శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)లకు చెందిన చీలిక నేతలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఇరు కూటముల మధ్య పొలిటికల్‌ కెమిస్ట్రీ, అర్థమెటిక్‌ వంటివి అత్యంత ఆసక్తిగా మారాయి. ఎన్సీపీ, శివసేనల్లోని ఏర్పడిన చీలిక కారణంగా అరడజను మందికిపైగా కీలక నేతల రాజకీయం, భిన్నమైన రాజకీయాలు, మరాఠా కోటా ప్రకంపనలు, పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకుని దూకుడుమీదున్న విపక్షం, గత ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు వంటివి ప్రస్తుత ఎన్నికలను శాసించనున్నాయి. అయితే, ఇరు కూటములు కూడా ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటుపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. మరో కీలక విషయం ఏంటంటే.. 2022లో చీలిపోయిన శివసేన, ఏడాది కిందట ముక్కలైన ఎన్సీపీలు చెరో కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయా చీలిక పార్టీల బలాబలాలు తాజా ఎన్నికలతో తేలిపోనున్నాయి. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 స్థానాలకు గాను మహాయుతి 17 స్థానాలకే పరిమితం కాగా, ఎంవీఏ మాత్రం 30 స్థానాలు దక్కించుకుని సత్తా చాటింది. ఈ పరిణామం సహజంగానే బీజేపీ నేతృత్వంలోని కూటమిని కలవరపెడుతోంది.

పైగా, ఇప్పుడు జరుగుతున్నవి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో స్థానిక రాజకీయాలు, సమస్యలపై మరింత ఫోకస్‌ పెరగనుంది. దీంతో కూటముల ప్రచారం కూడా హోరాహోరీగా సాగనుంది. నిజానికి మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న రాజకీయం గతంలో ఎన్నడూ లేదు. రెండు కూటముల్లోని ఆరు ప్రధాన పార్టీలు బీజేపీ, శివసేన, ఎన్సీపీ; కాంగ్రెస్‌, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)లు ప్రభావం చూపడంలో పోటీ పడుతున్నాయి. కాగా, మహారాష్ట్ర రాజకీయాల్లో గత ఐదేళ్లలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019లో జరిగిన ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమి కుప్పకూలింది. రెండు ప్రధాన పార్టీల్లో చీలికలు రావడం, చీలిపోయిన పార్టీలను ఎన్నికల సంఘం నిజమైన పార్టీలుగా గుర్తించడం వంటివి రాజకీయంగా ప్రభావం చూపాయి. ఇదిలావుంటే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్‌ మాయావతి ‘ఎక్స్‌’లో స్పందిస్తూ.. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో తమ పార్టీ ఒంటరిగానే పోటీకి దిగుతుందని పేర్కొన్నారు.

ఇవీ.. కూటములు మహాయుతి: బీజేపీ, శివసేన(శిండే), ఎన్సీపీ(అజిత్‌ పవార్‌)

మహావికాస్‌ అఘాడీ: కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)

Updated Date - Oct 17 , 2024 | 06:47 AM