Lok Sabha Elections: నడ్డా రోడ్‌షోకు అనుమతి నిరాకరణ
ABN , Publish Date - Apr 07 , 2024 | 03:08 PM
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. తిరుచిరాపల్లిలో రోడ్‌షో నిర్వహించేందుకు ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసు కమిషనర్‌ను కలిసి అనుమతి కోరనున్నట్టు నడ్డా తెలిపారు. దీనికి ముందు తమిళనాడులోని అరియలూరులో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు.
తిరుచిరాపల్లి: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)కు చేదు అనుభవం ఎదురైంది. తిరుచిరాపల్లిలో రోడ్‌షో నిర్వహించేందుకు ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసు కమిషనర్‌ను కలిసి అనుమతి కోరనున్నట్టు నడ్డా తెలిపారు. దీనికి ముందు తమిళనాడులోని అరియలూరులో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆయన తెలిపారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచేందుకు నరేంద్ర మోదీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
''డైనమిక్ పీఎం నాయకత్వంలో దేశంలో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోంది. 2019లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా ప్రధాని డైనమిక్ పాలనలో భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2024లోనూ తిరిగి మోదీ ప్రధాని అయితే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం ఖాయం'' అని నడ్డా అన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో మన ఉత్పత్తులు, ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయని, 2014లో కేవలం చైనా మొబైల్ ఫోన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చేదని, ఈరోజు 'మేడ్ ఇన్ ఇండియా' మొబైల్ ఫోన్లు అందరి చేతుల్లోనూ ఉన్నాయని, 97 శాతం మొబైల్ ఫోన్లు ఇండియాలోనే తయారవుతున్నాయని చెప్పారు.
Delhi: ఢిల్లీలో మాయమై.. వారణాసిలో ప్రత్యక్షమై.. దొరికిన జేపీ నడ్డా కారు..
'ఇండి' నేతలు జైలులోనో, బెయిలుపైనో..
'ఇండియా' కూటమి నేతలపై జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. ఇండి కూటమి నేతలు జైలులోనో, బెయిలుపైనో ఉన్నవాళ్లేనని అన్నారు. ''రాహుల్ గాంధీ బెయిలుపై ఉన్నారు, సోనియాగాంధీ, పి.చిదబరం బెయిలుపై ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. స్టాలిన్ ప్రభుత్వ అవినీతి పాలనలో తమిళనాడులో అభివృద్ధి నిలిచిపోయింది'' అని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడు పట్ల ప్రత్యేక అభిమానం ఉందని, హెల్త్ ఇన్‌ఫ్రాస్చక్టర్ నిధులను రెట్టింపులు చేశారని, గ్రామీణ ప్రాంత రోడ్లపై ప్రత్యేక దృష్టిసారించారని, ఈఏడాది గ్రామీణాభివృద్ధి కోసం తమిళనాడుకు రూ.10,436 కోట్లు కేటాయించారని చెప్పారు. కాగా, తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఈనెల 19న తొలి విడతలో పోలింగ్ జరుగనుంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి