Delhi: సర్వేల పేరుతో పథకాలకు ఓటర్ల నమోదు వద్దు
ABN , Publish Date - May 03 , 2024 | 03:37 AM
ప్రకటనలు, సర్వేలు లేదా మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఎన్నికల అనంతరం పథకాల లబ్ధి చేకూర్చుతామని ఓటర్ల పేర్లను న మోదు చేయడాన్ని
జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలకు ఈసీ ఆదేశం
న్యూఢిల్లీ, మే2: ప్రకటనలు, సర్వేలు లేదా మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఎన్నికల అనంతరం పథకాల లబ్ధి చేకూర్చుతామని ఓటర్ల పేర్లను న మోదు చేయడాన్ని తక్షణమే ఆపివేయాలని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం ఆదేశించింది.
వివిధ సర్వేల ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల తర్వాత లబ్ధిదారులకు అందించే పథకాల కోసం వ్యక్తుల వివరాలను కోరుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీలకు ఈసీ సూచనలను జారీ చేసింది. అలాంటి ప్రకటనలపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది.