Share News

అది విచ్ఛిన్న ముఠా భాష!

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:00 AM

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు ప్రస్తావన రాజస్థాన్‌లో ఎందుకని శనివారం ఆయన జైపూర్‌లో చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

అది విచ్ఛిన్న ముఠా భాష!

జమ్మూకశ్మీరుకు దేశంతో సంబంధం లేదంటారా?.. మీ మాటలకు సిగ్గుపడుతున్నాను

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేపై ప్రధాని ఫైర్‌

అవినీతి నేతలను కాపాడుకోవడానికే కేంద్ర ఏజెన్సీలపై టీఎంసీ దాడులు: మోదీ

నవాదా/జల్పాయ్‌గురి, ఏప్రిల్‌ 7: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు ప్రస్తావన రాజస్థాన్‌లో ఎందుకని శనివారం ఆయన జైపూర్‌లో చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. జమ్మూకశ్మీరుకు మిగతా దేశంతో సంబంధం లేదా అని ధ్వజమెత్తారు. ఇది విచ్ఛిన్న ముఠా (టుకడే టుకడే గ్యాంగ్‌) భాషగా పేర్కొన్నారు. ఆదివారం ప్రధాని బిహార్లోని నవాదా, బెంగాల్లోని జల్పాయ్‌గురిలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చిన్నది కాదు. ఆ పదవిలో ఉన్న ఖర్గే 370 రద్దు గురించి ఏం మాట్లాడారు? జమ్మూకశ్మీరు గురించి రాజస్థాన్‌ ప్రజలకు ఏం సంబంధమని అంటారా? అంటే జమ్మూకశ్మీరు మన దేశంలో అంతర్భాగం కాదా? ఆయన మాటలకు సిగ్గుపడుతున్నాను. మాతృభూమి కోసం బిహార్‌ యువత, ప్రజలు ఎంతో మంది త్యాగాలు చేశారు. జమ్మూకశ్మీరును పరిరక్షించే క్రమంలో ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారు. రాజస్థాన్‌లో కూడా ఇంతే. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు దేశంలోని ఈ ప్రాంతంతో ఆ ప్రాంతానికి సంబంధం ఏమిటని అంటారా? వారి విభజన దృక్పథాన్ని ఇది చాటుతోంది. ఈ విచ్ఛిన్న ముఠాను క్షమిస్తారా’ అని సభికులను ప్రశ్నించారు. అలాగే శనివారం రాత్రి టీఎంసీ నేతలను అరెస్టు చేయడానికి వెళ్లిన ఎన్‌ఐఏ అధికారులపై స్థానిక టీఎంసీ కార్యకర్తలు దాడి చేసి.. తిరిగి వారిపైనే కేసు పెట్టారని మోదీ అన్నారు. బెంగాల్లో టీఎంసీ సిండికేట్‌ రాజ్‌ నడుస్తోందని.. అవినీతి నేతలను కాపాడడమే మమత ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో దోపిడీ, భయానక వాతావరణం, అవినీతి, హింసకు టీఎంసీ ఉచిత లైసెన్సు కోరుతోంది. దేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కుతోంది. పేదల కోసం కేంద్రం తెచ్చిన సంక్షేమ పథకాలను మమత అమలు చేయడం లేదు. కేంద్ర నిధులు మొదట తమ ఖాతాలో పడాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలో వివిధ అవినీతి కేసులకు సంబంధించి ఈడీ అవినీతి నేతలకు చెందిన రూ.3 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసింది. నేను అవినీతిని నిర్మూలిస్తానంటుంటే ప్రతిపక్ష కూటమి అవినీతిపరులను రక్షిస్తామంటోంది. అవినీతిపరులను రక్షించేందుకే టీఎంసీ, లెఫ్ట్‌, కాంగ్రెస్‌ ఇండీ కూటమిని ఏర్పాటుచేశాయి’ అని మోదీ అన్నారు. సందేశ్‌ఖాలీలో జరిగిన అత్యాచారాలను యావద్దేశం చూసిందని.. అఘాయిత్యాలకు పాల్పడినవారు జీవితాంతం జైల్లో మగ్గేలా చేస్తానని అన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 04:00 AM