Navya : పాఠాలే కాదు... అవసరాలూ తెలుసు..
ABN , Publish Date - May 20 , 2024 | 12:10 AM
‘‘మహిళల్లో ఋతుక్రమ సమస్యలు చాలా సున్నితమైన అంశం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాటి గురించి ఇతరులతో మాట్లాడడం అపరాధంగా భావిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి మారాలనేది నా తపన. అందుకే నాకు చేతనైనది చేస్తున్నాను’’ అని చెబుతారు 35 ఏళ్ళ రాఖీ గంగ్వార్.
‘ఆరోగ్యవంతమైన సమాజం అంటే అదెక్కడినుంచో రాదు. మన చుట్టుపక్కల ఉన్న
వారందరూ ఆరోగ్యంతో ఉంటేనే అది సాకారమవుతుంది’’ అంటారు రాఖీ గంగ్వార్.
స్కూల్ టీచర్ అయిన ఆమె... గ్రామీణ మహిళల్లో ఋతుక్రమ పరిశుభ్రత కోసం
మూడేళ్ళ క్రితం ప్యాడ్ బ్యాంక్ ప్రారంభించారు.
తన సేవలను యాభై అయిదు గ్రామాల్లో ఇరవై వేలమందికి పైగా విస్తరించారు.
‘‘మహిళల్లో ఋతుక్రమ సమస్యలు చాలా సున్నితమైన అంశం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాటి గురించి ఇతరులతో మాట్లాడడం అపరాధంగా భావిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి మారాలనేది నా తపన. అందుకే నాకు చేతనైనది చేస్తున్నాను’’ అని చెబుతారు 35 ఏళ్ళ రాఖీ గంగ్వార్.
ఆమె ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా బౌరియాలో... ప్రాథమిక పాఠశాల టీచర్. ఎప్పుడు సెలవు వచ్చినా... గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ మహిళలతో సమావేశమవుతారు. ఋతుక్రమ ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి వివరిస్తారు.
అది ప్రమాదమని వారికి తెలీదు...
‘‘విద్యార్థిగా ఉన్నప్పటి నుంచీ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని’’ అంటున్న రాఖీ... ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో తల్లి, చెల్లెళ్ళకు ఆమే ఆధారమయ్యారు. ‘‘చదువంటే నాకు ప్రాణం.
ప్రతి క్లాస్‌లోనూ ఫస్టే... కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా బాగా చదువుకోవాలనేది నా సంకల్పం. అందుకోసం కుట్లు, అల్లికలు, వస్త్రాలమీద పెయింటింగ్స్ ... ఇలా ఎన్నో పనులు చేశాను’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎన్నో కష్టాలు పడుతూనే ఎంబిఎ, ఎంఎ చదివారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, ప్రభుత్వ టీచర్‌గా చేరారు.
బడికి వచ్చే బాలికలు తరచూ అనారోగ్యానికి గురికావడం ఆమెను కలవరపరచింది. వారిలో చాలా సమస్యలకు కారణం... ఋతుక్రమ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమేనని ఆమె గ్రహించారు. ‘‘మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు అందరు మహిళలు ఆ సమయంలో వస్త్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటిని శానిటైజ్ చేయకపోతే ప్రమాదమని వారికి తెలీదు.
సరైన ప్యాడ్స్ ఉపయోగించడం గురించి, ఋతుక్రమ ఆరోగ్యం గురించి ప్రచారం చెయ్యడం అవసరమనిపించింది’’ అని ఆమె వివరించారు. మొదట... తన విద్యార్థుల తల్లులతో, గ్రామంలోని మహిళలతో ఆమె ఒక సర్వే జరిపారు. ‘‘చాలామంది ఆ విషయం మాట్లాడడానికి ఇష్టపడలేదు. శానిటరీ ప్యాడ్స్ వారికి అందుబాటులో లేవు. ఎక్కువమందిని ఒక చోటికి చేర్చి చర్చిస్తే... వారిలో బెరకు పోతుందని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు రాఖీ.
కాస్త కష్టమే, కానీ...
తొలి ప్రయత్నంగా... దాదాపు యాభై మంది మహిళలతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఋతుక్రమ సమయంలో పరిశుభ్రత లేకపోతే... ఆరోగ్యానికి ఎదురయ్యే ప్రమాదాల గురించి వివరించారు. తమ బడిలోనే శానిటరీ ‘ప్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు చేసి...
గ్రామంలోని మహిళలందరికీ అవి ఉచితంగా అందేలా చూశారు. ఆమె చేపట్టిన కార్యక్రమాలు పక్క గ్రామాల మహిళలనూ ఆకర్షించాయి. వారి కోరిక మేరకు అక్కడా ఆమె ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం 55 గ్రామాల్లో 20 వేల మందికి పైగా మహిళలకు, బాలికలకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్నారు. ఆరోగ్య సలహాలు, సూచనలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వైద్యులు, కౌన్సెలర్లు,
వాలంటీర్లతో బృందాలను ఏర్పాటు చేశారు. వారు గ్రామాల్లో మహిళలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ‘‘చాలాకాలం సొంత డబ్బులతోనే ఇవన్నీ చేశాను. నా భర్త, కుటుంబం కూడా అండగా నిలిచారు. ఆ తరువాత... నేను చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని... గోరఖ్‌పూర్‌కు చెందిన శానిటరీ ప్యాడ్ తయారీ సంస్థ సాయం చెయ్యడానికి ముందుకు వచ్చింది.
గ్రామాల్లో కొందరు విరాళాలు కూడా ఇస్తున్నారు. స్కూలు పనులు, ఇంటి పనులు, ప్రచారం, గ్రామాల్లోని వాలంటీర్లతో సమన్వయం... ఇవన్నీ చూసుకోవడం కాస్త కష్టమే. కానీ ఈ పనుల్లో నాకు ఎంతో సంతోషం, సంతృప్తి లభిస్తున్నాయి. మా ప్యాడ్ బ్యాంక్ సేవలను మరిన్ని గ్రామాల్లోని మహిళలకు అందించాలనే ప్రేరణ కలిగిస్తున్నాయి’’ అంటారు రాఖీ.