Viral: అత్తారింటికి దారేది.. భార్య కోసం ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన ఘనుడు
ABN, Publish Date - Jul 27 , 2024 | 09:50 PM
మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే ఏం చేస్తాం? మన దగ్గర వాహనం ఉంటే అందులోనో.. లేకపోతే రైలు లేదా బస్సుల్లోనో వెళ్తాం. కానీ.. ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు.
మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే ఏం చేస్తాం? మన దగ్గర వాహనం ఉంటే అందులోనో.. లేకపోతే రైలు లేదా బస్సుల్లోనో వెళ్తాం. కానీ.. ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. పుట్టింటికి వెళ్లిన భార్యను కలుసుకోవడం కోసం.. ‘అత్తారింటికి దారేది’ అంటూ ఆర్టీసీ బస్సును తీసుకెళ్లాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆర్టీసీ బస్సును ఎలా తీసుకెళ్లాడంటే..
ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన దరగయ్యకు ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహం అయ్యింది. వృత్తిరీత్యా దరగయ్య డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కట్ చేస్తే.. అతని భార్య కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో.. భార్యను చూడాలని అనుకుని, ఆత్మకూరు బస్టాండ్ వద్దకు వెళ్లాడు. అక్కడికెళ్లాక ముచ్చుమర్రికి ఏ బస్సు వెళ్తుందని అడిగాడు. ఆ ఊరికి వెళ్లే బస్సులేమీ లేవని అవతలి వ్యక్తం సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతడు ఓ బస్సు ఎక్కి చూశాడు. అందులో ఏ ఒక్కరూ లేరు. కానీ.. తాళాలు మాత్రం బస్సుకే ఉన్నాయి. ఇంకేముంది.. తన పంట పండిందనుకొని, ఆ బస్సుని స్టార్ట్ చేసి, తుర్రుమంటూ అక్కడికి నుంచి వెళ్లిపోయాడు.
రంగంలోకి పోలీసులు..
మరోవైపు.. ఆ బస్సు డ్రైవర్ డిపోకు వచ్చి తన బస్సు కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇక్కడే ఉండాల్సిన తన బస్సు ఎలా మాయమైందంటూ అయోమయానికి గురయ్యాడు. డిపో మొత్తం వెతికినా కనిపించలేదు. దీంతో.. అతను అధికారులకు సమాచారం అందించాడు. వాళ్లు వెంటనే రంగంలోకి దిగి.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అప్పుడు ఆ బస్సు నందికొట్కూరు దిశగా ముచ్చుమర్రి వైపు వెళ్లిందని గుర్తించారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌కు ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడంతో.. వాళ్లు యాక్షన్‌లోకి దిగారు. ఎట్టకేలకు బస్సుని ఆపి.. దరగయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఈ పని చేశావని ప్రశ్నించగా.. అతనిచ్చిన సమాధానం విని అంతా షాకయ్యారు.
భార్య కోసమే..
తన భార్య పుట్టింటికి వెళ్లి చాలా రోజులు అయ్యిందని.. ఆమెను చూసేందుకే తాను బస్సు తెచ్చానని దరగయ్య సమాధానం ఇచ్చాడు. బస్సు ఎక్కి చూడగా.. తాళాలు దానికే ఉండటంతో ఈ పని చేశానని పేర్కొన్నాడు. కాగా.. ఆ బస్సుని తిరిగి ఆత్మకూరు డిపోకు అధికారులు అప్పగించారు. అటు.. దరగయ్యకు మతిస్థిమితం లేదని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి.. ఆ సమస్య ఉన్నా ఎక్కడ ప్రమాదానికి గురి కాకుండా బస్సుని ముచ్చుమర్రి వరకు డ్రైవ్ చేయడం గమనార్హం.
Read Latest Prathyekam News and Telugu News
Updated Date - Jul 27 , 2024 | 09:50 PM